తవ్వేయ్.. నరికెయ్!
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:04 AM
అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు.. ఎవరైనా వస్తే రానీ మామూళ్లిస్తాం.. మాట్లాడి పంపిస్తాం.. ఇదీ వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది నాయకుల తీరు.. దర్జాగా అక్రమార్జనకు తెగబడుతున్నారు.. అధికారుల అండదండలతో ఎటువంటి భయమూ లేకుండా పగలూ రాత్రీ కూడా తాము అనుకున్నది చేసేస్తున్నారు. ఈ సంఘటనే అందుకు ఉదాహరణ.
వైసీపీ నాయకులు..అధికారుల దందా?
కొవ్వూరు, ఫిబ్రవరి 5 : అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు.. ఎవరైనా వస్తే రానీ మామూళ్లిస్తాం.. మాట్లాడి పంపిస్తాం.. ఇదీ వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది నాయకుల తీరు.. దర్జాగా అక్రమార్జనకు తెగబడుతున్నారు.. అధికారుల అండదండలతో ఎటువంటి భయమూ లేకుండా పగలూ రాత్రీ కూడా తాము అనుకున్నది చేసేస్తున్నారు. ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. కొవ్వూరు మండలం చిడిపి గ్రామ రెవెన్యూ పరిధిలో అఖండ గోదావరి మధ్య లంకలలో చాలా ఏళ్లగా విలువైన మట్టి, కలప ఉంది. గతంలో ఆ ప్రాంతంలో అడుగుపెట్టాలంటేనే భయపడేవారు. అటువంటిది నేడు ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలించుకుపోతున్నారు.. చెట్లను కొట్టుకుపోతున్నారు. అయినా అడిగే నాథుడు లేడు.. ప్రశ్నించే పాలకుడు లేడు. గోదావరి మధ్య భాగంలో సుమారు 200 ఎకరాల లంకభూమి ఉంది. 2023 నవంబరులో చిడిపి గ్రామ దళితులకు ఒక్కొక్కరికి 65 సెంట్లు చొప్పన రాష్ట్ర ప్రభుత్వం లీజుకు పట్టాలు మంజూరు చేసింది. ఆ భూములను ఆనుకుని ఇంకా మిగిలి ఉన్న 140 ఎకరాల లంకభూమిలో వేమ, చీమచింత, తుమ్మ జాతికి చెందిన పెద్దపెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ భూముల్లో మట్టిని వ్యవసాయ భూములు మెరక చేసుకోవడానికి, ఇటుక బట్టీలకు విక్రయించి అక్రమార్జన చేస్తున్నారు. చెట్లను నరికివేసి ట్రాక్టర్లలో స్మగ్లింగ్ చేస్తూ లక్షలాది రూపాయలు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారన్నారు. దళితులకు చెందిన లంకభూముల్లో మట్టి, కలపను (అటవీశాఖ, నీటిపారుదల, రెవెన్యూ, గనులు, పర్యావరణ శాఖల) అనుమతులు లేకుండా దోచుకుంటున్నారు. అక్రమంగా చెట్లు నరికి అక్రమార్జన చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిడిపి గ్రామస్తులు జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌లో చిడిపి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కవల శ్రీనుబాబు, కొయ్య వెంకట్రావు, డి.వెంకటరత్నం, కె. దుర్గాప్రసాద్ సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పామెర్ల నగేష్, అఖండ గోదావరి కుడిగట్టు విభాగం (ఏజీఆర్‌బీ) ఏఈ సునీల్‌కుమార్ కుమ్మకై లంకభూములలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను నరికి అక్రమంగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. కోట్లాది రూపాయలు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ఇరువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అఖండ గోదావరి కుడిగట్టు విభాగం(ఏజీఆర్‌బీ) ఏఈ సునీల్‌కుమార్‌ను ప్రశ్నించగా దళితులు జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటున్నారని చెప్పడం గమనార్హం.