Share News

జగన్నేతలు.. మహామేతలు..

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:04 AM

ఒకనాడు ఓటుకు వెయ్యి అంటే అమ్మో అనే వారు.. మరిప్పుడో.. వైసీపీ అభ్యర్థులు ఓటుకు రూ.2500 ఇస్తారట.. ఇదీ జనం మాట.. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది..! డబ్బులు ఎక్కడైనా చెట్టుకు కాస్తాయా? సంపాదిస్తే వస్తోంది.. ఐదేళ్లలో ఒక అభ్యర్థి ఓటుకు రూ.2500 ఇచ్చేలా ఎలా సంపాదించగలడంటారా!? ఇది జనమెరిగిన సత్యమే.. ఊహకు అందదు..

జగన్నేతలు.. మహామేతలు..

  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్లూ మింగుడే

  • అక్రమంగా వేల కోట్ల దోపిడీ

  • ఎక్కడికక్కడ కొండలు మాయం

  • ఇసుక లేకుండా గోదావరి ఖాళీ

  • నేటికీ సాగుతున్న డ్రెడ్జింగ్‌

  • ఏటిగట్లు..పోలవరం గట్లు కొట్టివేత

  • ఉమ్మడి జిల్లాలో వైసీపీ దందా

  • కన్నెత్తి చూడని అధికారులు

  • ఎవరైనా వెళితే ఇక అంతే!

  • అదే డబ్బుతో నేడు ఓటర్లకు గాలం

ఒకనాడు ఓటుకు వెయ్యి అంటే అమ్మో అనే వారు.. మరిప్పుడో.. వైసీపీ అభ్యర్థులు ఓటుకు రూ.2500 ఇస్తారట.. ఇదీ జనం మాట.. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది..! డబ్బులు ఎక్కడైనా చెట్టుకు కాస్తాయా? సంపాదిస్తే వస్తోంది.. ఐదేళ్లలో ఒక అభ్యర్థి ఓటుకు రూ.2500 ఇచ్చేలా ఎలా సంపాదించగలడంటారా!? ఇది జనమెరిగిన సత్యమే.. ఊహకు అందదు.. అంచనాలకు చిక్కదు.. ఐదేళ్లూ అందిన కాడికి తవ్వేశారు.. నేటికీ తవ్వుతూనే ఉన్నారు.. సాగని దందా లేదు.. జరగని అవినీతి లేదు..కొండలూ మాయం చేసేశారు. గోదారిని కుళ్లబొడిచేశారు. వంతెనల చెంత గుల్లగుల్ల చేసేశారు.. ఏటిగట్లూ లేపేశారు.. అఖండ దోపిడీకి అంతే లేదు.. ఐదేళ్లలో గోదావరి రూపురేఖలనే మార్చేశారు... ఎంతలా అంటే గోదావరిలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గోతులే..ఆ గోతుల్లో పడి చనిపోయినవారెందరో... అయినా అడ్డూ అదుపూ లేదు.. అడిగేవాడూ లేడు.. సీఎంకే ఎదురెళ్లే వాడెవడుంటాడు.. అధికారులు కిమ్మనడం లేదు.. ఇదీ గోదావరి జిల్లాల్లో జగనాసుర ఇసుక చరిత్ర.. సాక్షాత్తూ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడే చూసి ఆశ్చర్యపోయేటంత ఇసుకను దోచేశారు.. మట్టినీ వదల్లేదు.. జగన్‌ ఒక్క చాన్స్‌ అంటే జనం అధికారమిచ్చారు.. ఐదేళ్లూ అంతా వాళ్లిష్టం..!? ఏది దొరికితే అది మింగేశారు.

పిఠాపురం, ఏప్రిల్‌ 24: అధికారం చేతిలో ఉంది అడిగేవాళ్లెవరు. అంతా వాళ్లిష్టమే.. ఇళ్ల స్థలాల లెవెలింగ్‌, ప్రభుత్వ పనుల మాటున చెరువులను అడ్డగోలుగా తవ్వేసి కొల్లగొట్టేశారు. కాకినాడ జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో పోలవరం, పుష్కర కాలువల తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్‌ను గట్లుగా వేశారు. కోట్లా ది రూపాయలు విలువైన ఈ గ్రావెల్‌పై ఆయా నియోజకవర్గాల్లోని వైసీపీ నేతల కన్ను పడింది. చెరువులు, కొండలు, పోలవరం, పుష్కర కాలువల గట్లు ఇలా ఏది కనిపిస్తే వాటిపై రాబందుల్లా వాలిపోయారు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా తవ్వేశారు. మట్టి, గ్రావెల్‌ తరలించేసి కోట్లు గడించారు. ఇళ్లస్థలాల ముసుగులో గట్లను కరిగించేశారు. పోలవరం ఇరిగేషన్‌ అధికారులు ఈ అక్రమ తవ్వకాలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినా కనీసం కేసులు నమోదు చేయలేదు. కాకినాడ జిల్లా కేంద్రానికి చెందిన ఒక కీలక నేత ఈ తవ్వకాల్లో వేయి కోట్లకు పైగా వెనుకేసుకున్నారు. ప్రత్తిపాడు, పిఠాపురం సహా మెట్ట నియోజకవర్గాల్లో కొండలు కరిగిపోయాయి. గ్రావెల్‌ను అక్రమంగా తరలించేశారు.

ఒకే ఒక్కడు.. రూ.1000 కోట్లు

జిల్లా కేంద్రమైన కాకినాడకు చెందిన వైసీపీ కీలక నేత, ఆయన అనుచరులు జిల్లాలో మట్టి, గ్రావెల్‌ తవ్వకాల్లో పేట్రేగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ కీలక నేత అండదండలు పుష్కలంగా ఉండడంతో అడ్డే లేకుండా పోయింది. ఈ ఒక్క నేత మట్టి, గ్రావెల్‌ సంపాదనే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు.

పెద్దాపురం మండలం రామేశంమెట్టలో వందలాది ఎకరాల్లో వీరు అడ్డగోలుగా తవ్వేశారు. ఇళ్ల స్థలాల లెవెలింగ్‌ పేరుతో అనుమతి తెచ్చుకుని ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ను తరలించి కోట్లు కొల్లగొట్టేశారు. ఈ ఒక్క తవ్వకాల్లోనే కాకినాడ కీలక ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు రూ.800 కోట్లు మేర వెనుకేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనే కాకినాడ కీలక నేత కనుసన్నల్లో చెరువులను అడ్డగోలుగా తవ్వేశారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో 100 ఎకరాల విస్తీర్ణంలోని కోదండరాముడి చెరువు, చేబ్రోలులోని కోటలంకవారి చెరువు, పిఠాపురం మండలం కుమారపురం, జల్లూరు శివారులోని చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వేసి తరలించేశారు. తాటిపర్తి, చేబ్రోలు చెరువులో 20 నుంచి 40 అడుగుల మేర గోతులు పెట్టి అడ్డగోలుగా తవ్వకాలు నిర్వహించడంపై ఆయా గ్రామస్తులు, రైతులు ఆందోళనలు చేశారు. తాటిపర్తి చెరువుల్లో గోతుల్లో పడి ఇద్దరు మరణించారు. చేబ్రోలు చెరువులో అడ్డగోలు తవ్వకాలపై అక్కడి రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో తవ్వకాలపై స్టే విధించింది. తాటిపర్తి చెరువులో మాత్రం స్థానికుల ఆందోళనలు తోసిరాజని తవ్వకాలు సాగించారు. దీంతో వారు హైకోర్టు ను ఆశ్రయించడంతో కోర్టు తవ్వకాలను నిలిపివేసింది. దుర్గాడ, చెందుర్తి, సామర్లకోట మం డలంలోని చెరువుల్లో తవ్వకాలు జరిగాయి. మట్టి, గ్రావెల్‌ను భారీగా తరలించేశారు.

కొడవలి కొండ మాయం..

గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో 370 ఎకరాల్లో విస్తరించి ఉన్న దనందిబ్బను(కొడవలి కొండ) తవ్వుకునేందుకు అనుమతులు మంజూరు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పెద్ద మంత్రి అనుచరులు ఇందులో కీలకపాత్ర పోషించారు. ఇక్కడ ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న పేదల అభ్యంతరాలు తోసిరాజని అనుమతులిచ్చేయడం గమనార్హం. ఇక్కడే అతి ప్రాచీనమైన బౌద్ధారామం ఉంది. తవ్వకాల వల్ల బౌద్ధ ఆరామానికి నష్టం జరుగుతుందని పురావస్తుశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, బౌద్ధ భిక్షువులు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. కీలక నేత అనుచరులకు స్థానిక వైసీపీ నేతలు సహకారం అందించడంతో కొడవలి కొండపై తవ్వకాలు సాగించారు. చివరకు కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

తూర్పున గోదారంతా దోపిడీయే..

రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి/రాజమహేంద్రవరం రూరల్‌/ కొవ్వూరు/తాళ్లపూడి, ఏప్రిల్‌ 24: గోదారంతా అఖండ దోపిడీ సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదారిలో ఇష్టానుసారంగా తవ్వేశారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక ర్యాంపులను జేపీ కాంట్రాక్టు సంస్థకు ఇచ్చినట్టు చెప్పి గతేడాది మే నుంచి డిసెంబరకు వరకు అనధికారికంగా తవ్వేసి కోట్లు దోచేసింది. తర్వాత మరోసంస్థను తెరపైకి తెచ్చి ఏకంగా బ్యారేజీ నుంచి గామన్‌ బ్రిడ్జి అవతలి వరకూ యథేచ్ఛగా డ్రెడ్జింగ్‌ చేసేస్తున్నారు. దీంతో గోదావరిపై ఉన్న రోడ్‌ కం రైలు వంతెన, గామన్‌, రైల్వే ఆర్చ్‌ బ్రిడ్జిలకు ముప్పు వాటిల్లనుంది. వైసీపీకి చెందిన ఒక వ్యక్తికి అఖండ గోదావరిని అప్పగించి నెలకు రూ.30 కోట్ల వరకూ కప్పం కట్టించు కుంటున్నట్టు ఆరోపణలున్నాయి. అంతకు ముందు కొవ్వూరులో ఇదే తరహా వ్యవహారం లో ప్రేమ్‌రాజ్‌ అనే కాంట్రాక్టర్‌ నెలకు రూ.30 కోట్లు కట్టలేక, ఒత్తిళ్లు తట్టుకోలేక రైలు పట్టాల పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయినా దోపిడీ ఆగలేదు. బోట్స్‌ మన్‌ సొసైటీల నిర్వహించాల్సిన ర్యాంపులను స్వాధీనం చేసుకుని అక్రమ డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. ఓపెన్‌ రీచ్‌ల్లో సీతానగరం, తాళ్లపూడి, కడియం, కొవ్వూరు, పెరవలి, నిడద వోలు మండలాల పరిధిలో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో గాయత్రి, కోటిలింగాలు, కాతేరు, వెంకటనగర్‌ ప్రాంతాల్లో దోపిడీకి అంతేలేదు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల మేర 30 ర్యాంపులు ఉన్నాయంటే ఎంత దారుణంగా గోదారిని కొల్లగొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు హోం మంత్రి ఆదేశాలున్నాయంటూ అధికారపార్టీ నేతలు రేయింబవళ్లు యథేచ్ఛగా గోదావరి లంకల్లో ఉన్న ఇసుక, మట్టిని దోచుకుంటున్నారు. ఇటీవల కొవ్వూరు జడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి నేరుగా కుమారదేవం ర్యాంపులో అక్రమం గా తరలిస్తున్న మట్టి లారీలను అడ్డుకున్నారు. తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక ఓపెన్‌ రీచ్‌లోనూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తు న్నారు. గోపాలపురం మండలం రాజంపాలెం పరిధిలోని దేవరకొండ గ్రావెల్‌ పుష్కలంగా లభించడంతో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా ఎక్స్‌కవేటర్లతో తవ్వి ట్రాక్టర్లపై తరలించి భారీ గా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.

కోనసీమంతా కొల్లగొట్టేశారు...

అమలాపురం-ఆంధ్రజ్యోతి/మండపేట/ఆత్రేయ పురం/ఆలమూరు/కొత్తపేట/రావులపాలెం, ఏప్రిల్‌ 24: గోదారంతా దోపిడీ.. ఎక్కడా అడ్డులేదు.. అదు పూ లేదు.. గత ఐదేళ్లలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ పరిధిలోని గోదావరి నదీ పాయల్లో వం దల కోట్ల విలువైన ఇసుక, మట్టి కొల్లగొట్టుకుపోయారు. ఈ అక్రమ దందాలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలక భాగస్వాములు. ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గ కేంద్రంగా వేల కోట్ల విలువైన ఇసుక, మట్టిని అనుమతులు లేకుండా తరలించుకుపోయారు. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధ గౌతమి నదీ పాయలతో పాటు బంగాళాఖాతం సముద్ర తీరం వెంబడి ఉన్న సముద్రపు ఇసుకను సైతం కొల్లగొట్టేశారు. లంకల్లో మట్టి అయితే ప్రభుత్వ ఇళ్ల స్థలాల మెరక పేరుతో అనుమతులు పొంది ప్రైవేటు లేఅవుట్లకు తరలించి కోట్లు దోచేశారు. ప్రభుత్వానికి నామమాత్రపు ఆదాయమే చూపించేవారు. ఇందుకు కలెక్టర్‌ స్థాయి నుంచి వివిధ శాఖల అధికారులు సైతం వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, అల్లవరం, ఐ.పోలవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం తదితర మండలాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో నిత్యం అక్రమ ఇసుక దందాలు నేటికీ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారిక అనుమతులతో ప్రమేయం లేకుండా రావులపాలేనికి చెందిన ఒక కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు మట్టి, ఇసుక తరలింపు ద్వారా నెలనెలా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇలా వచ్చిన ఆదాయంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ముడుతున్నాయి. జిల్లాలో ఐదేళ్లలో వెయ్యి కోట్ల పైబడి ఆదాయాన్ని ఇసుక, మట్టి మాఫియా అక్రమార్కులు ఆర్జించారనే ఆరోపణలున్నాయి. ఇసుక తవ్వకాలపై జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై న్యాయస్థానాల్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా ర్యాంపులకు అనుమతులిచ్చిన తీరుపై ఎన్జీటీలో కూడా కేసు కొనసాగుతోంది. ఎర్ర గ్రావెల్‌ కొండలు వైసీపీ పాలనలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. మండపేట మండలం ద్వారపూడి, కేశవరం, అనపర్తి నియోజ కవర్గ పరిధిలో ఉన్న అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలతో పాటు రాజానగరం మండలంలో ప్రభుత్వ భూములే లక్ష్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరులు ఇళ్ల స్థలాల మెరక పేరిట కోట్లు విలువ చేసే ఎర్రకొండలను తవ్వి లారీల్లో తరలించేశారు. ఆలమూరు మండలం జొన్నాడ ఇసుక ర్యాంపులో నిబంధనలు పాటించకుండా ఇసుక తవ్వేశారు. గోదావరిలో గోతులు చెరువుల్లా మారడం తో యువత స్నానాలకు వెళ్లి మృత్యువాతపడ్డారు. ఆలమూరు జొన్నాడ వద్ద ఇసుక కొండలను జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు చూసి ఆశ్చర్యపోయా రు. కొత్తపేట మండలం మందపల్లి(ఆలమూరు-2)గా ఉన్న ఇసుక రీచ్‌లో ఇసుక రవాణాకు హద్దులు..నిబంధనలను తుంగలోకి తొక్కి ఇసుక రవాణా చేశారు. పేరుకు ప్రతిమా ఇన్‌ఫాస్ట్రక్చర్‌ పేరుతో ఇసుక రవా ణా చేస్తున్నామని చెప్తున్నా వైసీపీ నేతల ప్రైవేటు సైన్యంతోనే రవాణా సాగుతోంది.

Updated Date - Apr 25 , 2024 | 01:04 AM