Share News

నేడు యానాంలో పోలింగ్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:43 AM

కేంద్ర పాలిత ప్రాంతమైనా పుదుచ్చేరి రాష్ట్రానికి ఒక లోక్‌సభ స్థానం మాత్రమే ఉంది. ఈ లోక్‌సభ స్థానానికి 19వ తేదీ శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్‌ జరిగే లోక్‌సభ స్థానాల్లో పుదుచ్చేరి కూడా ఉండడంతో పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు.

 నేడు యానాంలో పోలింగ్‌

యానాం, ఏప్రిల్‌ 18: కేంద్ర పాలిత ప్రాంతమైనా పుదుచ్చేరి రాష్ట్రానికి ఒక లోక్‌సభ స్థానం మాత్రమే ఉంది. ఈ లోక్‌సభ స్థానానికి 19వ తేదీ శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్‌ జరిగే లోక్‌సభ స్థానాల్లో పుదుచ్చేరి కూడా ఉండడంతో పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. పుదుచ్చేరి లోక్‌సభ స్థానంలో మొత్తం 30 నియోజకర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భౌగోళికంగా కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాం నియోజకవర్గం. యానాం నియోజకవర్గంలో సుమారు 40 వేల మంది ఓటర్లు ఉన్నారు. పుదుచ్చేరి లోక్‌సభ స్థానంలో మొత్తం 10,23,699 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 4,80,569 మంది ఉండగా, మహిళలు 5,42,979 మంది, థర్డ్‌ జెండర్‌ 148 మంది ఓటర్లు ఉన్నారు. యానాంలో మొత్తం 39,408 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 19,037 మంది, మహిళలు 20,371 మంది ఉన్నారు. యానాం నియోజకవర్గ పరిధిలో మొత్తం 10 వార్డులకు గాను మొత్తం 33 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పుదుచ్చేరి నుంచి పోలింగ్‌ సామగ్రి వచ్చింది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల విభాగం పూర్తి చేసింది. అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే నిర్వహణపై శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ముగిసిన విషయం తెలిసిందే. యానాంలోని నిర్వహించే ఎన్నికలకు సంబంధించి డాక్టర్‌ ఎస్‌ఆర్‌కె ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను భారీ భద్రత నడుమ పోలింగ్‌ కేంద్రాలకు చేరాయి. యానాం ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి మునిస్వామి పర్యవేక్షణలో యానాంలోని 33 పోలింగ్‌ కేంద్రాలకు 5 సెక్టార్లలో ఈవీఎంలను తరలించారు. పుదుచ్చేరి లోక్‌సభ స్థానంలో మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీపడుతున్నప్పటికీ ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే ఉన్నట్లు ప్రస్తుతం ఉన్న ఎన్నికల వాతావరణం స్పష్టం చేస్తోంది. ఒకరు కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వి.వైద్యలింగం కాగా మరొకరు ఎన్టీయే అభ్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్‌.రంగసామి మేనల్లుడు, పుదుచ్చేరి హోంమంత్రి నమశ్శివాయ ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:43 AM