Share News

వైసీపీ పందెం వేసి ఓటమి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:46 AM

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున రూ. 3.50 లక్షలు అప్పుచేసి బెట్టింగ్‌ కాశాడు. పందెంలో డబ్బులు పోయాయి. అప్పు తీర్చేందుకు భార్య బంగారం ఇవ్వమని అడిగాడు. ఆమె నిరాకరించడంతో నిద్రలో ఉండగా కిరాతకంగా హత్య చేశాడు.

వైసీపీ పందెం వేసి ఓటమి

అప్పు తీర్చడానికి నగలు ఇమ్మని భార్యపై వేధింపులు

నిరాకరించడంతో హత్య?

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 16: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున రూ. 3.50 లక్షలు అప్పుచేసి బెట్టింగ్‌ కాశాడు. పందెంలో డబ్బులు పోయాయి. అప్పు తీర్చేందుకు భార్య బంగారం ఇవ్వమని అడిగాడు. ఆమె నిరాకరించడంతో నిద్రలో ఉండగా కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన కాకినాడ రూరల్‌ హార్బర్‌ పేటలో జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకు చెందిన ఓలేటి నరసింహమూర్తికి, ఓలేటి సీత (26)కు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భర్త స్థానిక పోర్టులో సెక్యూరిటీగా పని చేస్తూ, చేపలు పడే సమయంలో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య స్థానికంగా గల రొయ్యల కంపెనీలో పని చేస్తోంది. అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో బెట్టింగ్‌ భూతం చిచ్చురేపింది. వైసీపీ గెలుపుపై అప్పు చేసి రూ. 3.50 లక్షలు బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. ఈ పందెంలో ఓడిపోవడంతో చేసిన అప్పు తీర్చలేక, బంగారం, డబ్బుల కోసం భార్యను వారం రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుమార్తె సంతోషం కోసం సీత తండ్రి పాలెపు కాసుబాబు కొంత సొమ్ముని అల్లుడు నరసింహమూర్తికి ముట్టచెప్పాడు. ఇంకా డబ్బుల కోసం తాకట్టు పెట్టేందుకు బంగారు వస్తువులు ఇవ్వాలని శనివారం రాత్రి భార్యను అడగ్గా, ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా స్థానికులు సర్దిచెప్పారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 3-4 గంటల సమయంలో తన భార్య ఓలేటి సీత తలపై ఎవరో దాడి చేసి పుస్తలతాడు, చెవిలీలు తీసుకుని హత్య చేశారంటూ నరసింహమూర్తి పోలీసులు, బంధువులకు సమాచారం అందించాడు. ఈ సమాచారంతో కాకినాడ ఎస్‌డీపీవో కె.హనుమంతరావు, సర్పవరం ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో ఏ.సన్యాసిరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై భర్త, బంధువులు, స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న అల్లుడు నరసింహమూర్తి గత వారం రోజులుగా డబ్బులు కోసం కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నాడని సీత తల్లి వీరవేణి పోలీసులకు తెలిపింది. డబ్బుల కోసం కావాలనే అల్లుడే ఈ హత్య చేసి ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతున్నాడని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. మృతురాలి తల్లి వీరవేణి ఫిర్యాదుతో ఎస్‌డీపీవో హనుమంతరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సన్యాసిరావు తెలిపారు. ఈ హత్య బయటవారు చేశారా, అంతర్గతంగా చేశారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించినట్లు చెప్పారు.

Updated Date - Jun 17 , 2024 | 12:46 AM