Share News

మూడేళ్లుగా పామాయిల్‌ రైతులను పీడిస్తున్న తెల్లదోమ వైరస్‌

ABN , Publish Date - May 24 , 2024 | 01:49 AM

గత మూడు సంవత్సరాలుగా పామాయిల్‌ రైతులకు తెల్లదోమ వైరస్‌ తెగులు శాపంగా మారింది. ఒకపక్క ధర లేకపోవడంతో దిగుబడి కూడా కోల్పోయి రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు.

మూడేళ్లుగా పామాయిల్‌ రైతులను పీడిస్తున్న తెల్లదోమ వైరస్‌
తెగులు సోకి గెలలు కాయకుండా ఉన్న తోట

ఎకరానికి పది నుంచి ఐదుకి పడిపోయిన దిగుబడులు

గిట్టుబాటు ధర లేక నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు

గండేపల్లి, మే23: గత మూడు సంవత్సరాలుగా పామాయిల్‌ రైతులకు తెల్లదోమ వైరస్‌ తెగులు శాపంగా మారింది. ఒకపక్క ధర లేకపోవడంతో దిగుబడి కూడా కోల్పోయి రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. మూడేళ్ల కిందట ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వచ్చేది. తెల్లదోమ సోకవడంతో క్రమక్రమంగా దిగుబడి తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 4 నుంచి 5 టన్నులు అవ్వడానికి కష్టంగా ఉందని రైతులు తెలుపుతున్నారు. ఎన్ని మందులు పిచ్‌కారి చేసినా తెల్లదోమ వైరస్‌ తెగులును నివారించలేకపోతున్నామంటున్నారు. అధికారుల సూచనలు తీసుకుంటుంటే ఒకేసారి అన్ని తోటలకు మందు పిచికారి చేస్తేనే తెగులు నివారించగలుగుతున్నామంటున్నారు. అయితే కొద్దిమంది పిచ్‌కారి చేసి మరికొద్దిమంది చేయకపోతే మళ్లీ వైరస్‌ విజృంభించే అవకాశముంది. గతంలో ఆయిల్‌ఫామ్‌ లాభదాయకంగా ఉండడంతో రైతులు తోటలు వేసేందుకు ఆసక్తి చూపేవారు. అయితే తెల్లదోమ సోకినప్పటి నుంచి దిగుబడి లేక రైతులు తీవ్ర నష్టాలపాలవడంతో పామాయిల్‌ తోటలు వేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతకాలం కిందట పామాయిల్‌ టన్ను ధర సుమారు రూ.23 వేల వరకు కొన్ని రోజులు నిలకడగా పలకడంతో ఆ సమయంలోనే తోటలు కూడా ఎక్కువ వేయడంతోపాటు కౌలు రైతులు ఎకరం లక్షకు నాలుగైదు సంవత్సరాలకు కౌలు కట్టి తీసుకున్నారు. అయితే పెరిగిన ధర ఒక సంవత్సరం కూడా నిలబడకుండా క్రమక్రమంగా దిగుతూ రూ.11,800కు చేరుకుని మళ్లీ పెరిగి ప్రస్తుతం రూ.14,090 ధరకు వచ్చింది. దీంతో కౌలు రైతులు కూడా పెట్టిన పెట్టుబడి లేక నష్టాలు ఎదుర్కొంటున్నారు. పామాయిల్‌ సాగుకు ఎక రానికి సుమారు రూ.50 వేలు నుంచి 60 వేల పెట్టుబడి అవుతుందని, అయితే ప్రస్తుతం తెల్లదోమ వల్ల ఐదు టన్నులు దిగుబడి రావడంతో పెట్టిన పెట్టుబడి రావడం కూడా గగనమైందంటున్నారు. తెల్లదోమ ప్రభావం పూత, పిందె సమయంలో ఉన్నప్పుడు తెల్లదోమ ఆకుల్లో ఉన్న తేమ పీల్చేయడంతో వైరస్‌ సోకి పుష్టిగా ఉన్న గెలలు గిడసబారిపోయి దిగుబడి తగ్గిపోతుంది. ప్రభుత్వం నుంచి రాయతీలు వచ్చేవని వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ సాయం కూడా లేదని రైతులు చెపుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎకరానికి రూ.50 వేలు వరకు నష్టం చూడాల్సి వస్తుందని రెండు సంవత్సరాలుగా ఇలాగే నష్టాలు ఎదుర్కొంటున్నామని కౌలు రైతులు చెప్పారు. కౌలు రైతు పరిస్థితి కుడిలో పడ్డ ఎలుకలా మారిం ది. లాభాలు బాటిన పట్టిన ఆయిల్‌ ఫామ్‌ ప్రస్తుతం నష్టాల్లో ముంచింది. సొంత రైతులకు లాభాలు రాకపోయినా పెట్టుబడులు అయినా వస్తున్నాయి. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గండేపల్లి మండలంలో సుమారు 12500 ఎకరాల్లో ఆయిల్‌ఫామ్‌ సాగు చేస్తున్నారు.

రూ.18 వేలుంటేనే గిట్టుబాటు

టన్ను రూ.18 వేలు ఉంటేనే గిట్టుబాటవుతుంది. తెల్లదోమ నివారణ కావడంలేదు. వైరస్‌ నివారణకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. తీవ్రంగా నష్టపోయాం. పెట్టిన పెట్టుబడులే తప్ప లాభాలు లేవు. - గురజాల వెంకన్నదొర, మురారి

పూర్తిగా నష్టాల్లో మునిగా

టన్ను రూ.23 వేలు పలుకుతున్న సమయంలో పదెకరాలు కౌలుకు తీసుకున్నా. ఆ ధర ఎంతోకాలం నిలబడలేదు. ప్రస్తుతం సుమారు రూ.14 వేల ధర పలుకుతోంది. వచ్చిన ఆదాయం కౌలుకు వస్తుంది. ఎకరాలకు రూ.50 వేల నష్టం వస్తుంది. రెండు సంవత్సరాల నుంచీ అదే పరిస్థితి. - పిల్లా సత్తిబాబు, మల్లేపల్లి

Updated Date - May 24 , 2024 | 01:49 AM