Share News

కొండలుగా చెత్త గుట్టలు..

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:50 AM

అమలాపురం నల్లవంతెన దిగువన బైపాస్‌ రోడ్డులో వెళుతుంటే కొండల మాదిరిగా గుట్టలు దర్శనమిస్తున్నాయి.

కొండలుగా చెత్త గుట్టలు..

అమలాపురం టౌన్‌, జూన్‌ 2: అమలాపురం నల్లవంతెన దిగువన బైపాస్‌ రోడ్డులో వెళుతుంటే కొండల మాదిరిగా గుట్టలు దర్శనమిస్తున్నాయి. అదంతా అమలాపురం పట్టణంలో సేకరించిన చెత్తే. పట్టణంలో చెత్త సమస్యపై ప్రజలు ఎన్నో సమరాలు చేశారు. దశాబ్దాల కాలంగా చెత్త పేరుకుపోయి కొండంత గుట్టలుగా మారిపోయాయి. ఎట్టకేలకు అమలాపురం పురపాలక సంఘం హిందూ శ్మశాన వాటిక చెంతన ఉన్న కంపోస్టు యార్డులో చెత్తను పూర్తిగా తొలగించేందుకు కంకణం కట్టుకుంది. ఆ చెత్తను బయో మైనింగ్‌ చేసే విధంగా ఓ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పజెప్పారు. ప్రత్యేక యంత్రాల ద్వారా చెత్తను ఆరు రకాలుగా విభజిస్తున్నారు. చెత్త నుంచి మట్టితో పాటు ప్లాస్టిక్‌, గాజు వంటి ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఓ పక్క పాత చెత్త కొండలు తరుగుతుంటే బయో మైనింగ్‌తో వేరు చేయబడ్డ మట్టి, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు కొండల్లా పెరిగిపోయాయి. ఆ గుట్టలు రోడ్డెక్కడమే కాకుండా విద్యుత్‌ స్తంభాలను సైతం చుట్టుముట్టేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు కురవడంతో ఆ వ్యర్థాలన్నీ సమీపంలో ఉన్న ప్రధాన పంట కాల్వలోకి కరిగి జారిపోతుంది.

రోజుకు 30టన్నుల చెత్త:

అమలాపురం పురపాలక సంఘం నుంచి రోజుకు 30 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ తెలిపారు. బయో మైనింగ్‌ ద్వారా వచ్చిన మట్టిని పురపాలక సంఘం అధీనంలోని పలు లోతట్టు ప్రాంతాలను మెరక చేసేందుకు వినియోగించామన్నారు. ఇక ప్లాస్టిక్‌, గాజు వంటి ఇతర వ్యర్థాలను కాంట్రాక్టు సంస్థ సిమెంట్‌, ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. గతంలో కొండలుగా పెరిగిపోయిన చెత్తనంతటినీ పూర్తిగా తొలగించి ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని చూస్తున్నటట్టు కమిషనర్‌ తెలిపారు. ఆ వ్యర్థాలను తరలించే బాధ్యత కాంట్రాక్టు సంస్థదేనన్నారు.

తగలబెట్టేస్తున్నారు..

ఓ పక్కన చెత్తను బయో మైనింగ్‌ చేస్తుంటే మరో పక్కన ఏరోజుకారోజు వస్తున్న చెత్తను కుమ్మరి కాల్వ డ్రెయిన్‌ గట్టుపై పోస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రజారోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా తగలబెట్టేస్తున్నారు. దీంతో బైపాస్‌ రోడ్లపై వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను అంటించడం ద్వారా వస్తున్న పొగ సమీప ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి, కళాశాలల్లోకి వెళ్లిపోతుండడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ఆ పొగ పట్టణ పరిధిలోని పలు వీధులు, మెయిన్‌రోడ్ల వరకు సైతం వ్యాపిస్తుంది. పట్టణంలో సేకరించిన ఎన్నో రకాల వ్యర్థాలకు నిప్పుపెట్టడం ద్వారా వస్తున్న పొగను పీలిస్తే ప్రజారోగ్యం దెబ్బతింటుందని తెలిసినా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:50 AM