Share News

ఓటరూ.. ఏమైంది!?

ABN , Publish Date - May 27 , 2024 | 12:07 AM

ఎటు చూసినా.. ఎక్కడ చూసినా ఒకటే క్యూ.. ఓటర్లు ఎక్కడా అదర లేదు.. బెదరలేదు.. రాత్రి 12 గంటలు దాటినా కదల్లేదు.. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు క్యూకట్టే ఉన్నారు.. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తీరిది.. చాలా చోట్ల ఓటర్లు కుమ్మేశారు. సుమారు 96 శాతం వరకూ పోలింగ్‌ నమోదవడం గమనార్హం.

ఓటరూ.. ఏమైంది!?
పెరవలి మండలంలో రాత్రి సమయంలో కూడా ఓటర్ల క్యూ(ఫైల్‌)

క్యూ కట్టిన పల్లె ఓటర్లు.. దూరమైన పట్టణ ఓటర్లు

పట్టణాల్లో తగ్గిన పోలింగ్‌ శాతం

బాలాజీపేట 165వ పీఎస్‌లో 30.09 శాతం

శ్రీరామ్‌నగర్‌ ఒకటో బూత్‌లో 38.83 శాతం

ఆశ్చర్యపోయిన నాయకులు

జిల్లాలో 80.93 శాతం నమోదు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఎటు చూసినా.. ఎక్కడ చూసినా ఒకటే క్యూ.. ఓటర్లు ఎక్కడా అదర లేదు.. బెదరలేదు.. రాత్రి 12 గంటలు దాటినా కదల్లేదు.. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు క్యూకట్టే ఉన్నారు.. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తీరిది.. చాలా చోట్ల ఓటర్లు కుమ్మేశారు. సుమారు 96 శాతం వరకూ పోలింగ్‌ నమోదవడం గమనార్హం. కొన్ని చోట్ల మాత్రం దారుణంగా పోలింగ్‌ జరిగింది. మూడో వంతు మంది మాత్రమే ఓటు హక్కు విని యోగించుకున్నారు. జిల్లాలో 1577 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 303 పోలింగ్‌ కేంద్రాల్లో 90 శాతం మించి పోలింగ్‌ జరిగింది. మొత్తం జిల్లాలో 16,23,149 మంది ఓటర్లు ఉండగా 13,13,630 మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు.ఏకంగా 80.93 శాతం ఓట్లు నమోదయ్యాయి. అయితే పల్లె ఓటర్లు ఓటు విలువ తెలుసుకుని క్యూ కడితే.. ఓటు విలువ తెలిసిన పట్టణ ఓటర్లు మాత్రం చాలా వరకూ దూరంగా ఉండడం గమనార్హం. బూత్‌ల వారీ పోలింగ్‌ చూసినపుడు రాజమండ్రి రూరల్‌, సిటీ నియోజ కవర్గాల్లో కొన్ని బూత్‌లలో సుమారు మూడో వంతు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజానగరం నియోజకవర్గంలో 216 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అందులో 86 పోలింగ్‌ కేంద్రాల్లో 90 శాతం దాటి ఓటు హక్కు వినియోగించుకున్నారు.కోరుకొండ మండలం 64వ పీఎస్‌లో ఏకంగా జిల్లాలోనే అత్యధికంగా 96.73 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ మొత్తం 1011 మంది ఓటర్లు ఉండగా 967 మంది ఓటేశారు.65వ బూత్‌లోనూ 95.65 మంది ఓటేశారు. అతి తక్కువగా 147వ బూత్‌లో 67.35 శాతం మంది ఓటేశారు.మొత్తంగా ఈ నియోజకవర్గంలో 87.54 శాతం పోలింగ్‌ జరిగింది. ఇది జిల్లాలోనే నెంబర్‌ వన్‌ స్థానం. గోపాలపురం నియోజక వర్గంలో 248 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 80 కేంద్రాల్లో 90 శాతం దాటి పోలింగ్‌ జరిగింది.అత్యధికంగా మారంపల్లి 219వ బూత్‌లో 95.61 శాతం పోలింగ్‌ జరగ్గా, అతి తక్కువగా నాగులపల్లిలోని 245వ బూత్‌లో 69.60 శాతం నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 86.67 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇది జిల్లాలో రెండో స్థానం. అనపర్తిలో మొత్తం పోలింగ్‌ 86.23 శాతం జరగ్గా జిల్లాలో మూడో స్థానం. ఇక్కడ 62 పోలింగ్‌ కేంద్రాల్లో 90 శాతం దాటి పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా 144వ బూత్‌లో 94.62 శాతం నమోదుకాగా 4వ బూత్‌లో అత్యల్పంగా 66.42 శాతం నమోదైంది. కొవ్వూరులో 85.90 శాతం పోలింగ్‌ జరిగింది. ఇక్కడ 42 పోలింగ్‌ కేంద్రాల్లో 90 శాతం దాటింది. మద్దూరులోని సీతంపేట 175వ పీఎస్‌లో అత్యధికంగా 94.25 శాతం ఓట్లు పోలవ్వగా, కొవ్వూరులోని అల్లూరి నాగరత్నం స్కూల్‌ లో 88వ బూత్‌లో అతి తక్కువగా 66.23 శాతం ఓట్లు పోలయ్యాయి. నిడదవోలులో మొత్తం 84.67 శాతం పోలవ్వగా 33 పోలింగ్‌ కేంద్రాల్లో 90 శాతం దాటి పోలింగ్‌ జరిగింది. సూరపురం 14వ బూత్‌లో అత్యధికంగా 95.71 శాతం ఓట్లు పోలవ్వగా.. నిడదవోలులోని 41వ పీఎస్‌లో 63.45 శాతం పోలయ్యాయి. రాజమహేంద్రవరం సిటీలో ఒక చోట కూడా 90 శాతం దాటి పోలవ్వలేదు. ఇక్కడ అత్యధికంగా జాంపేట 113వ బూత్‌లో 85.41 శాతం పోలవ్వగా, శ్రీరాంనగర్‌ 1వ బూత్‌లో కేవలం 38.83 శాతం పోలయ్యాయి.ఇక్కడ 783 మంది ఓటర్లు ఉండగా కేవలం 304 మంది ఓటు వినియోగించుకున్నారు.రాజమండ్రి రూరల్‌లో మాత్రం 90 శాతం దాటి ఒక చోట మాత్రమే పోలయ్యాయి. వెంకటనగర్‌ 6వ బూత్‌లో 91.67శాతం ఓట్లు పోలయ్యాయి. బాలాజీనగర్‌ 165వ బూత్‌లో కేవలం 30.09 శాతం మాత్రం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ మొత్తం 934 మంది ఓటర్లు ఉండగా, కేవలం 281 మంది ఓటేశారు. 164వ బూత్‌లో 35.07 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 884 మంది ఓటర్లు ఉండగా కేవలం 310 మంది ఓటేశారు. ఈ ప్రాంతం సిటీ, రూరల్‌ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. ఇంత తక్కువ మంది ఓటు వేయడం నేతలను ఆలోచనలో పడేసింది.

Updated Date - May 27 , 2024 | 12:07 AM