Share News

సాహిత్యం ఉన్నంతకాలం వేటూరి ఉంటారు: జేకే భారవి

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:55 AM

కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే’.. ఎలాంటి భావాన్నైనా పలికించగలిగే శక్తి వేటూరికే సాధ్యమని, క్లిష్టమైన, సరళమైన పదాలతో గారడీ చేస్తూ ఆడుకోవడం వేటూరి మాత్రమే చేయగలరని ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు, పాటల రచయిత జేకే.భారవి అన్నారు.

సాహిత్యం ఉన్నంతకాలం వేటూరి ఉంటారు: జేకే భారవి

తుని రూరల్‌, జనవరి 29: ‘కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే’.. ఎలాంటి భావాన్నైనా పలికించగలిగే శక్తి వేటూరికే సాధ్యమని, క్లిష్టమైన, సరళమైన పదాలతో గారడీ చేస్తూ ఆడుకోవడం వేటూరి మాత్రమే చేయగలరని ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు, పాటల రచయిత జేకే.భారవి అన్నారు. సంగీతం, సాహిత్యం ఉన్నంతవరకు వేటూరిని మరిచిపోలేమని అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా తునిలోని చిట్టూరి మెట్రోలో వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేటూరి జయంతి వేడుకల్లో ఈ ఏడాది త్రయోదశ(13వ) వేటూరి కవితా పురస్కారాన్ని జేకే భారవి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటూరి వారి పురస్కారానికి తనను ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేటి యువతకు గాయకులుగా, గేయ రచయితలుగా చాలా అవకాశాలున్నాయని చెప్పారు. కవులకు ధనం ముఖ్యం కాదని, వారి వారి వాక్చాతుర్యం, రచనా శైలి నిజమైన సంపద అని అన్నారు. అన్నమయ్య, రామదాసు, మంజునాఽథ సినిమాలకంటే ఆదిశంకరాచార్య సినిమాకు యూట్యూబ్‌ వీక్షకులు ఎక్కువ ఉండడం తనకు వచ్చిన విజయంగా భావిస్తున్నానని అన్నారు. తెలుగు పాటకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వేటూరి చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అన్నవరం దేవస్థానం అదనపు కమిషనర్‌ కోడూరి రామచంద్రమోహన్‌, రసమాధురి వ్యవస్థాపక అధ్యక్షుడు పేరాల సీతారామ ప్రభు మాట్లాడుతూ వేటూరి మన మధ్య లేకపోయినా పాటల రూపంలో బతికే ఉన్నారని, కవులు ఉన్నంతకాలం తెలుగు భాష వైభవం తగ్గదని అన్నారు. అనంతరం సన్మాన గ్రహీత జేకే భారవిని తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన పలువురు ప్రముఖులు పుస్తకాలతో ఘనంగా సత్కరించారు. వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, శ్రీప్రకాష్‌ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి, వేటూరి సాహితి పీఠం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌, వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కేఆర్‌జే శర్మతో పాటు తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:55 AM