Share News

ఉల్లి లొల్లి తీరలే..టమాటా తగ్గలే!

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:45 AM

అటు ఉల్లి, ఇటు టమోటా ... ఈ రెండూ ధరలతో పోటీ పడుతున్నాయి. కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగులు పెడుతున్నాయి.

ఉల్లి లొల్లి తీరలే..టమాటా తగ్గలే!
ఉల్లిపాయలు

ఉల్లి..టమాటా మధ్య పోటీ

పెరుగుతూ తగ్గుతున్న ధరలు

ఉల్లి కిలో రూ.36

టమాటా రూ.80

రైతు బజార్‌లోనూ మోసం

పట్టించుకోని అధికారులు

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 14 : అటు ఉల్లి, ఇటు టమోటా ... ఈ రెండూ ధరలతో పోటీ పడుతున్నాయి. కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. చాపకింద నీరులా.. వినియోగదారులకు నొప్పి తెలియకుండా నెమ్మది నెమ్మదిగా ఉల్లిపాయల ధరలు రేజ్‌ అవుతుంటే.. టమాటా ధరలు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా దూసుకుపోతున్నాయి. ఈ రెండూ వంటింట్లో నిత్యావసరాలు కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం ఉల్లి, టమోటా ధరల పోటీతో బెంబేలెత్తిపోతున్నారు. మహారాష్ట్ర నుంచి కొత్తపాయలు రావాలి... అనంతపురం టమోటాలు అందుకోవాలి... అప్పటి వరకూ ప్రజలకు ధరాఘాతం తప్పక పోవచ్చనే అభిప్రాయం వ్యాపారులు, అధికారుల్లో ఉంది.

నిలకడగా పెరుగుతున్న ధరలు..

ఉల్లిపాయల ధరలు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర ఉల్లిపాయలు తప్ప మనకు మరో గత్యంతరం లేకపోవడంతో ప్రజలు పెరిగిన ధరల భారాన్ని మోయకతప్పడంలేదు. ఉల్లిపాయల ధరలు చాపకింద నీరులా రెండు మూడు రోజులకు ఒకసారి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా కిలోకు రూ.2, రూ.3లు పెరుగుతుండడంతో వినియోగదారులపై వారికి తెలియకుండానే భారం పడుతోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని హోల్‌సేల్‌ మార్కెట్లో నెంబర్‌ 1 రకం కిలో రూ.36లు ధర ఉంది.రెండో రకం రూ.32, మూడో రకం రూ.28-రూ.30 మధ్య అమ్ముతున్నారు. వీటినే రీటైల్‌ వ్యాపారులు బయట మార్కెట్లలో కిలోకు రూ.5 నుంచి రూ.10ల మార్జిన్‌తో అమ్మకాలు సాగిస్తున్నారు.రైతు బజార్లలో సెకండ్‌ క్వాలిటీ విక్రయిస్తున్నా కిలో రూ.36ల ధర ఉంటోంది.ఆటోలు, తోపుడుబళ్ల వ్యాపారులు రూ.100లకు కేవలం మూడు కిలోలు మాత్రమే ఇస్తున్నారంటే ధరల పెరుగుదల ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొత్త పంట వస్తేనే ధరలు తగ్గేది..

మహారాష్ట్ర నుంచి మాత్రమే మనకు ఉల్లిపాయలు దిగుమతి అవుతున్నాయి. కర్నాటక, కర్నూలు ఉల్లిపాయలకు సీజన్‌ కాకపోవడంతో మహారాష్ట్ర ఉల్లిపాయలపైనే మొత్తం మార్కెట్‌ ఆధారపడాలి. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న ఉల్లిపాయలన్నీ ఆరుదలపాయలు. అంటే పాత పాయలు. కొత్తపాయలు వస్తేనే కానీ ధరలు తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లినారు వేశారని, కొత్తపంట ఆగస్టు నెలాఖరుకు కానీ రాకపోవచ్చని ఇక్కడి హోల్‌సేలర్లు స్పష్టం చేస్తున్నారు. అంటే సెప్టెంబర్‌లో కానీ ధరలు దిగొచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. కొత్తపంట లేనందు వల్లనే ఉల్లిపాయల ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తున్నదని, కొత్తపాయలు వచ్చే వరకూ ధరలభారం మోయకతప్పదని పేర్కొంటున్నారు. కాగా ఉల్లిపాయలు, టమోటా ధరల పెరుగుదల నేపథ్యంలో వాటి నియంత్రణకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజానీకం కోరుకుంటున్నారు.

కిలో టమోటా రూ.80పైనే

టమోటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల టమోటా ధరలు కాస్త తగ్గినట్టు కనిపించినా ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో టమోటా రూ.80ల పైనే ధర ఉంది. రైతు బజార్లలో రూ.50లకు అమ్ముతున్నారు. ఈ ధర మరింత పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా హోల్‌సేల్‌ వ్యాపారులందరూ మదనపల్లి, పరిసర ప్రాంతాల నుంచి టమోటా దిగుమతి చేసుకుంటున్నారు.మదనపల్లి టమోటా మాత్రమే మన అవసరాలను చాలా వరకూ తీరుస్తోంది. బెంగుళూరు టమోటా వస్తున్నా ఎక్కువ మంది మదనపల్లి టమోటాలనే వినియోగిస్తుండడంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. అనంతపురం టమోటాలు మార్కెట్లోకి అందుకుంటేనే తప్ప ఇప్పట్లో ధరలు తగ్గే పరిస్థితి లేదనే భావన ఇటు అధికారులు..అటు వ్యాపారుల్లోనూ వ్యక్తమవుతోంది.

రైతు బజార్‌లో మోసం

రైతు బజార్‌లో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నా యి..అధికారులు ఉన్నా పట్టించుకోవడంలేదు.. ఉల్లిపా యల్లో దోపిడీ అంతా ఇంతా కాదు..మూడో రకం ఉల్లి పాయలు తెచ్చి మొదటిరకం రేటుతో విక్రయాలు చేస్తు న్నారు.. కేజీ రూ.36లకు విక్రయాలు చేస్తున్నా నాణ్యత ఉండడం లేదు.. మూడు రకాల ఉల్లిపాయలు కలిపి విక్రయాలు జరపడం గమనార్హం.మొదటి రకం ఉల్లిపా యలు లాటుపైన వేసి కింద రెండో రకం.. మూడో రకం ఉల్లిపాయలు వేసి విక్రయాలు చేస్తు న్నా రు.చూసేవారికి నాణ్యతగా ఉన్నట్టు కనిపించినా లోపల చూస్తే మాత్రం అంతా మోళీయే. అయినా ప్రశ్నించే వారు లేరు..పట్టించుకునేవారు లేరు. రైతు బజార్‌లో నిత్యం దోపిడీ జరుగుతూనే ఉంది. ఇకనైనా అధికా రులు తనిఖీలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:45 AM