Share News

తవ్వుడే.. తవ్వుడు!

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:49 AM

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 5: ఓవైపు ఎన్నికల హోరు... ఇంకోవైపు మట్టి తవ్వకాల జోరు అన్నట్టు తయారైంది. ఎక్కడ చూసినా లంక మట్టి తవ్వి తరలించుకుపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో పలువురు అక్రమార్కులు కన్వర్జెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు.

తవ్వుడే.. తవ్వుడు!
ఆత్రేయపురం మండలం వాడపల్లి లంక నుంచి అక్రమంగా తరలిపోతున్న లంక మట్టి దృశ్యం

వాడపల్లి లంక భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 5: ఓవైపు ఎన్నికల హోరు... ఇంకోవైపు మట్టి తవ్వకాల జోరు అన్నట్టు తయారైంది. ఎక్కడ చూసినా లంక మట్టి తవ్వి తరలించుకుపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో పలువురు అక్రమార్కులు కన్వర్జెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ లంకలను కొల్లగొడుతున్నారు. లంక మట్టిని ప్రతి నిత్యం లారీలు, ట్రాక్టర్లలో యథేచ్ఛగా ఇటుక బట్టీలు, ఇళ్ల స్థలాల మెరక, రియల్‌ ఎస్టేట్‌ అవసరాల కోసం తరలించేస్తున్నారు. లంకల్లో మట్టి తవ్వకాలు నిషేధం. హెడ్‌ వర్క్స్‌, రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గోదావరి నదీగర్భంలోని లంకలను విచ్చలవిడిగా తవ్వేస్తూ కొందరు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. లంకల్లో సాగుచేసుకుని జీవనం సాగించాల్సిన రైతులు గోదావరికి ఆనుకుని నాలుగు అడుగుల మేర మట్టిని తవ్వుకునేందుకు అనుమతిస్తూ అక్రమార్కులకు అమ్మేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ హడావుడిలో ఉన్న యంత్రాంగం పరోక్షంగా సహకరిస్తుండడంతో ఈ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ముఖ్యంగా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి లంకల్లో వారం రోజులుగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గోదావరిని అనుకుని మట్టిని తవ్వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై కొందరు లంక రైతులు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. వాడపల్లి లంక లోకి లారీలు వెళ్లాలంటే రావులపాలెం, జొన్నాడ, చొప్పెల్ల లాకుల మీదుగా వెళ్లాలి. రెవెన్యూ అధికారులకు సమాచారం తెలిసి అక్కడికి వెళ్లినా అక్రమ తవ్వకాలను నిరోధించలేకపోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 06 , 2024 | 12:49 AM