ఎన్నెన్నో అందాలు!!!
ABN , Publish Date - Sep 27 , 2024 | 01:27 AM
గోదావరి జిల్లాలు.. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. అడుగడుగునా ఓ ప్రత్యేకత. ఆకుపచ్చని లోకంలో విహరించాలంటే ఖచ్చితంగా ఇక్కడకు రావాల్సిందే. ప్రకృతి రమణీయతకు అద్దంలా కనిపించే పచ్చని పైరు పంటలు.. కోనసీమ కొబ్బరి తోటల అందాలు ఎవరినైనా ఈ కొత్త లోకంలో విహరింపజేస్తాయి.
ఉమ్మడి జిల్లాలో ఊటీ.. కొడైకెనాల్‌ను తలదన్నే పర్యాటక ప్రాంతాలు
పర్యాటకానికి చిరునామా ‘తూర్పు’
గోదారి పరవళ్లు.. పచ్చని కోనసీమ
అపార బీచ్‌లు.. ఏజెన్సీ అందాలు
ఆధ్యాత్మికత.. పూల సోయగాలు
కూటమి దృష్టిపెడితే..ఆదాయవనరు
పట్టించుకుంటే ఇదే స్వర్గసీమ
నిధుల లేమితో ప్రాజెక్టులు మూలకు
పర్యాటకంగా కానరాని అభివృద్ధి
తాజాగా రూ.100 కోట్లతో ప్రాజెక్టు
కాకినాడ/ రాజమహేంద్రవరం/ అమలాపురం (ఆంధ్రజ్యోతి):
గోదావరి జిల్లాలు.. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. అడుగడుగునా ఓ ప్రత్యేకత. ఆకుపచ్చని లోకంలో విహరించాలంటే ఖచ్చితంగా ఇక్కడకు రావాల్సిందే. ప్రకృతి రమణీయతకు అద్దంలా కనిపించే పచ్చని పైరు పంటలు.. కోనసీమ కొబ్బరి తోటల అందాలు ఎవరినైనా ఈ కొత్త లోకంలో విహరింపజేస్తాయి. ఇక పేరులోనే ఉన్న గోదావరి.. పరవళ్లు తొక్కే గోదావరికి ఆనుకుని పరుగులు పెట్టే పంట కాల్వలు, మరోవైపు దట్టమైన అడవి.. అందులో ఎగిసిపడే వాగులు..వంకలూ.. మరోవైపు పాపికొండల వయ్యారాలు..ఇటు చూస్తే అంతమే లేదన్నట్టు సాగిపోయే తీరంలో సముద్రపు అలల సవ్వడి.. ఇంకా కడియం పూలతోటలు.. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఆలయాలు.. అన్నిటికీ మించి అన్నవరం దేవా లయం. పర్యాటకం అంటే ఊటీకో, గోవాకో వెళ్లడం కాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రండి.. చూస్తే పరవశించిపోవాల్సిందే..
ఓ వైపు కొబ్బరి చెట్లతో తివాచీ పరిచినట్టు పచ్చగా కనిపించే కోనసీమ.. ఇంకో వైపు గోదావరి నడుమ పాపికొండల వయ్యారాలు.. మరోవైపు మారేడుమిల్లి అటవీ అందాలు.. ఇంకోపక్క కాకినాడ సమీపంలో కోరింగ అభ యారణ్యం.. ఇలా చెప్పుకుంటూపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి అందాలకు కొదువేలేదు. కోరుకొండ, ఆదుర్రు, కొడవలిలో బౌద్ధ స్తూపాలు, పెద్దాపురంలో పాండవులమెట్ట వంటి చారిత్రక ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఇక అన్నవరం, అప్పనపల్లి, అంతర్వేది, అయి నవిల్లి, మురమళ్ల, ముక్తేశ్వరం, వాడపల్లి, కోటిపల్లి, ర్యా లీ, ద్రాక్షారామ, పిఠాపురం తదితర ప్రాంతాల్లో చారిత్రక దేవాలయాలూ ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న పాపికొండల విహారం ఆహ్లాదభరితం. ఎత్తయిన కొండలు, అటవీప్రాంతం మీదుగా వం పులు తిరుగుతూ ప్రవహించే గోదావరి అందాలను బోటులో నుంచి వీక్షించవచ్చు. గోదావరి తీరంలో ఉన్న చారిత్రక నగరం రాజమహేంద్రవరం. గోదావరి గట్టున ఉన్న రాళ్లబండి మ్యూజియం, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ, గౌతమి గ్రంథాలయం, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం ఇల్లు, పెద్ద మసీదు వంటివి చూడదగ్గవి. గోదావరి తీరంలో గౌతమిఘాట్‌ను ఆనుకుని టెంపుల్ స్ట్రీట్‌లో ఇస్కాన్ తదితర ఆలయాలు ఉన్నా యి. రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో బోట్ షికారు నిర్వహిస్తున్నా సరైన నిర్వహణ లేక దానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. పుష్కర ఘాట్‌లో నిత్య హారతి కార్యక్రమం వైసీపీ ప్రభుత్వంలో అటకెక్కింది. రాజమహేంద్రవరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరంలో 1852లో కాటన్ మహాశయుడు నిర్మించిన బ్యారేజీ తప్పక చూడాల్సిందే. రూపాయి ఖరీదు చేసే మొక్క నుంచి లక్షల విలువ చేసే దేశ, విదేశీ రకాల మొక్కలూ కడియం మండల పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటుచేసిన 600 నర్సరీల్లో కనిపిస్తాయి. వశిష్ఠ పాయ ఒడ్డున కోనసీమలో కొలువుదీరిన దిండి దశాబ్దకాలంలో పర్యాటకంగా బాగా ప్రాచుర్యం పొందింది. హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్ పేరుతో ఏపీ టూరిజం ఇక్కడ రిసార్ట్స్ నిర్వహిస్తోంది. దిండిలో కేరళ తరహాలో ఉన్న హౌస్ బోట్లు ద్వారా నదీవిహారాలు సాగిస్తుంటారు. దిండి రిసార్ట్స్‌లో అత్యాఽధునిక సౌకర్యాలతో కూడిన వసతి గదులతోపాటు నాలుగు హౌస్‌బోట్లు, ఒక వశిష్ఠ బోటు, స్పీడు బోట్లు ఉన్నాయి. దిండిలో టూరిజం రిసార్ట్స్‌తోపాటు సమీపంలో మరో మూడు ప్రైవేటు రిసార్ట్స్ ఉన్నాయి. సోంపల్లిలో కోనసీమ రిసార్ట్స్, ఓడలరేవులో సముద్ర రిసార్ట్స్, అయినవిల్లిలో విల్లా రిసార్ట్స్, పాశ ర్లపూడి, యానాం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు రిసార్ట్స్ పర్యాటకులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఆదుర్రులో బౌద్ధస్థూపం చరిత్రకెక్కింది. కాట్రేనికోన మండలం కంది కుప్ప, తాళ్లరేవు మండలం కోరంగి నుంచి మడ అడవు ల్లో పడవల ద్వారా విహారయాత్ర సాగించడానికి అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రసిద్ధి చెందిన ఓడలరేవు, కొమరగిరిపట్నం, కేశనపల్లి, కేశవ దాసుపాలెం, అంతర్వేది, ఎస్.యానాం, చిర్రయానం బీచ్‌లు వేలాదిమందితో కళకళలాడుతున్నాయి. కోనసీమలో అంతర్వేది లక్ష్మీనర సింహస్వామి, గౌతమీనది చెంతన అయినవిల్లి సిద్ధి వినాయక, క్షణముక్తేశ్వరస్వామి, మురమళ్ళ వీరేశ్వర స్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, కడలిలో కపోతేశ్వర స్వామి, వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి, మందపల్లిలో శనేశ్వరస్వామి, ర్యాలిలో జగన్మోహినీ ఆలయాలు ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.
ఏజెన్సీ అందాలకు వెలుగేది
చూపుతిప్పుకోలేని ప్రకృతి అందాలు తూర్పు ఏజెన్సీ సొంతం. మారేడుమిల్లి సమీపంలో అటవీశాఖ ఎకో టూరిజం ప్రాజెక్టు నిర్వహిస్తోంది. వనవిహారి పేరుతో మారేడుమిల్లిలో రిసార్ట్స్‌లో వసతి ఏర్పాట్లు కల్పించారు. ఈ రిసార్ట్స్‌లో స్టే చేయాలంటే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఎకో టూరిజంలో ప్రధానమైన పర్యాటక ప్రాంతం జంగిల్ స్టార్. ఇది పాములేరు వాగు పక్కనే ఉంది. పాములేరు బ్రిడ్జి నుంచి కిలోమీటరున్నర దూరం ఉం టుంది. జంగిల్ స్టార్ నేచురల్ క్యాంపులో గడిపాలనుకునే వారికి ఒక రాత్రంతా అడవిలో గడిపిన అనుభూతి కలుగుతుంది. కొంతకాలంగా గుడిసె అందాలను ఆస్వాదించడానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. వెదురుబొంగులలో పెట్టి తయారుచేసిన బొంగు చికెన్, బొంగు బిర్యాని ఇక్కడ స్పెషల్. మారేడుమిల్లికి 6 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి, కాఫీ తోటలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇటు రంపచోడవరానికి 6 కిలోమీటర్ల దూరంలో రంప ఉంది. ఇక్కడ 14వ శతాబ్దంలో నిర్మించిన శివాలయం ప్రాశస్త్యం పొందింది. శివాలయానికి కిలోమీటరు కొండపైకి వెళితే జలపాతం ఆకట్టుకుంటోంది. ఇన్ని అందాలున్నా వాటి అభివృద్ధికి మాత్రం ఎలాంటి చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం దృష్టిపెడితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యాటకరంగానికి మరింత శోభ చేకూరుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో పర్యాటకరంగం మళ్లీ కళకళలాడేలా చేయడానికి రంగం సిద్ధమవుతోంది. హోప్ ఐలాండ్‌కు బోటు షికారు నుంచి మడఅడవుల వరకు అభివృద్ధి చేయడానికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి.
రూ.100 కోట్లతో అఖండ గోదావరి
కూటమి ప్రభుత్వం తాజాగా పర్యాటక రంగంపై దృష్టిపెట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త పర్యాటక పాలసీని తీసుకొని రావడానికి కసరత్తు చేస్తోంది. గోదావరి జిల్లాల్లో అఖండ గోదావరి ప్రాజెక్టుతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ జిల్లాకు చెందినవారే కావడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందనే ఆశలు చిగురించాయి. అఖండ గోదావరికి రూ.100కోట్లు కేటాయిస్తున్నట్టు ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కడియం నర్సరీలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అక్కడ కాలువలో బోట్ షికారు పెట్టనున్నారు. పాపి కొండలు ఇప్పటికే బోట్ షికారుతో ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే.
అందాలున్నా.. ఆదరించలేదు..
ఓ వైపు సువిశాల సుముద్ర తీరం..మరోవైపు జలజలపారే నదీ జలాలు..ఈరెండింటి మధ్య పొదలుగా...గుబురుగా.. సూర్యుడి వెలుతురు కూడా చొరబడనంత దట్టంగా విస్తరించిన మడ అడవులు.. కాకినాడ కాజా..ఎన్టీఆర్ బీచ్.. కుంభాభిషేకం.. అన్నవరం, పాదగయ.. ఉప్పాడ బీచ్..ఉప్పాడ చీరలు.. పెరుమాళ్లపురం పాకంగారెలు.. చిట్టి ముత్యాల బిర్యానీ.. చిట్టిపెస రట్లు.. ఇలా ఒకటేంటి కాకినాడ అంటే పర్యా టకులకు ఇలా చాలానే గుర్తొచ్చేవి.. పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉన్నా గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసేసింది. పైసా నిధులు కూడా విదల్చకుండా పర్యాటక రంగానికి తూట్లు పొడిచింది. గడచిన ఐదేళ్లలో పర్యాటక రంగం పడకేసింది. వాస్తవానికి 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జిల్లాలో పర్యాటక రంగానికి భారీ ఊపుతెచ్చింది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్‌రోడ్డును అభివృద్ధి చేసి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించింది. ఎన్టీఆర్ బీచ్‌ను అభివృద్ధి చేసి పర్యాటక ఉత్సవాలు, రోజుల తరబడి బీచ్ ఫెస్టివల్‌ను నిర్మించింది. వైసీపీ వచ్చాక వీటన్నిం టికి మంగళం పాడేసింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించింది. పర్యాటకశాఖ మంత్రి దుర్గేష్ ఇప్పటికే సీఎం వద్ద పలు ప్రతిపాదనలు ఉంచారు. కాకినాడ జిల్లాలో అన్నవరం,పాదగయ, సామర్లకోట భీమేశ్వర ఆల యం.. ఉప్పాడ బీచ్ కలిపి టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ ఈ దిశగా హామీ కూడా ఇవ్వడంతో దీని అమలుపై కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నారు.
మడ అడవులు చూస్తే.. మరువరు
దేశంలో పశ్చిమబెంగాల్ తర్వాత రెండో అతిపెద్ద మడ అడవులు కాకినాడలోనే ఉన్నాయి. వేల ఏళ్ల నాటి ఈ మడ అడవులు కాకినాడ నగరానికి రక్షణ గోడగా నిలుస్తున్నాయి. సునామీలు, వరదలు, తుఫాన్ల నుంచి కాకినాడతో పాటు కోనసీమలో ఎన్నో ప్రాంతాలను రక్షిస్తున్నాయి. నదీ జలాలు సముద్రంలో కలిసే చోట చిత్తడినేలల్లో పెరగడమే వీటి ప్రత్యేకత. సాధారణంగా ఉప్పునీటిలో చెట్లు పెరగవు. కానీ ఇవి అందులోనే పెరిగి, ఊత వేర్లతో ఒకదానికొకటి పెనవేసుకుపోయే చెట్లు, పొదల సముదాయమే మడ అడవులు. తాళ్లరేవు మండలం కోరంగి నుంచి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో 58 వేల ఎకరాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. నది.. సముద్రంలో కలిసే ప్రదేశంలో సహజసిద్ధంగా పుట్టుకువచ్చే ఈ మడఅడవులు ప్రాంతాన్ని 1978లో వన్యప్రాణి అభయారణ్యంగా కేంద్రం గుర్తించింది. ఉమ్మడి జిల్లాలో మడ అడవులను మొత్తం తొమ్మిది అభయారణ్యాలుగా గుర్తిం చారు. ఇందులో కోరంగి అభ యారణ్యం అతి పెద్దది. ఇది 42.42 చదరపు కి.మీలో విస్తరించి ఉంది.వీటిలో 80 రకాల వృక్షజాతులున్నాయి.అతిపెద్దదైన కోరంగి అభయారణ్యంలో 24 కుటుంబాలకు చెందిన 35 జాతుల మడ మొక్కలున్నాయి. ఇక్కడకు ఏటా 120 జా తుల పక్షులు వచ్చి విడిది చేస్తుంటాయి. ఎంతో మంది పర్యాటకులు వస్తున్నా సరైన సదుపాయాలే లేవు.
వచ్చే ఏడాది కొత్త పర్యాటక పాలసీ
వచ్చే ఏడాది కొత్త పర్యాటక పాలసీని తీసుకుని రానున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలనీ వచ్చే మార్చి వరకూ అమలులో ఉంటుంది. మార్చి తర్వాత కొత్త పాలనీ అమల్లోకి వస్తుంది. రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమహేంద్ర వరం అఖండ గోదావరి, కడియం, హేవలాక్, చారిత్రిక కట్టడాలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలోని ప్రాంతాలు, పశ్చిమగోదావరి జిల్లాలో పేరుపాలెం బీచ్ వంటివన్నీ అభివృద్ధి చేస్తాం.
-కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి