Share News

నేడు కాకినాడ జిల్లాలో సీఎం బస్సు యాత్ర

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:26 AM

: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర శుక్రవారం ప్రవేశించనుంది. సిద్ధం బహిరంగ ఏర్పాట్లు కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో చురుగ్గా సాగుతున్నాయి.

నేడు కాకినాడ జిల్లాలో సీఎం బస్సు యాత్ర

8 కాకినాడ రూరల్‌లో మేమంతా ‘సిద్ధం’ సభకు చురుగ్గా ఏర్పాట్లు

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 18: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర శుక్రవారం ప్రవేశించనుంది. సిద్ధం బహిరంగ ఏర్పాట్లు కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో చురుగ్గా సాగుతున్నాయి. తిమ్మాపురం పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలంలో జరిగే ‘మేము సిద్ధం’ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్‌ ప్రసంగించే సభావేదిక, సభాప్రాంగణంవద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యే కన్నబాబు, గ్రామ సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ, జడ్పీటీసీలు యాళ్ల సుబ్బారావు, నులుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజబాబ్జి, పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, ఏంఎసీ చైర్మన్‌ గీసాల శ్రీనులు పర్యవేక్షిస్తున్నారు.

సీఎం పర్యటన సాగేదిలా..

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో సీఎం జగన్‌ శుక్రవారం ఉద యం చేరుకుంటారు. బస్సు యాత్ర ద్వారా ఉదయం ఎస్‌టీ రాజపురం నుంచి బయలుదేరి పెద్దాపురం బైపాస్‌, సామర్లకోట బైపాస్‌ మీదుగా ఉండూరు చేరుకుంటారు. ఇక్కడ భోజన విరామం తీసుకుంటారు. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత ఉండూరు క్రాస్‌, కాకినాడ బైపాస్‌ రోడ్డు మీదుగా సాయంత్రం 3.30 గంటలకు కాకినాడ రూరల్‌ అచ్చంపేట జంక్షన్‌ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ తర్వాత ఇక్కడినుంచి బయలుదేరి పిఠాపురం బైపాస్‌, గొల్లప్రోలు బైపాస్‌, కత్తిపూడి బైపాస్‌, తుని బైపాస్‌ల మీదుగా ప్రజలకు బస్సు యాత్ర ద్వారా అభివాదం చేస్తూ వెళ్తారు. తునిలో ముగించుకుని పాయకరావుపేట బైపాస్‌ మీదుగా గొడిచర్ల క్రాస్‌లో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని ఎమ్మెల్యే కన్నబాబు తెలిపారు.

అనుమతులు లేకుండానే సిద్ధం ఫ్లెక్సీల ఏర్పాటు

పిఠాపురం, ఏప్రిల్‌ 18: సీఎం జగన్‌ జిల్లా పర్యటనలో భాగంగా అచ్చంపేటవద్ద శుక్రవారం జరిగే బహిరంగసభ తర్వాత బస్సు లో చిత్రాడ, పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు బైపాస్‌ రోడ్డుల మీదుగా వెళ్లనున్నారు. బైపాస్‌రోడ్డు ప్రాంతాల్లో పలుచోట్ల జగన్‌ సిద్ధం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటికి అనుమతులు తీసుకోలేదని సమచారం. వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 19 , 2024 | 07:22 AM