Share News

తాటిపర్తిలో ఆలయాల నిర్వహణపై వివాదం, ఉద్రిక్తత

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:54 PM

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆలయాల నిర్వహణపై వివాదం తలెత్తింది. ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వర్తించిన వైసీపీ నేతలు తాళాలు, రికార్డులను జనసేన నేతలకు అప్పగించడం, అందులో తమను భాగస్వాములు చేయకపోవడంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.

తాటిపర్తిలో ఆలయాల నిర్వహణపై వివాదం, ఉద్రిక్తత

జనసేన వర్గీయులకు తాళాలు, రికార్డులు అప్పగింత

తమను భాగస్వాములను చేయకపోవడంపై టీడీపీ ఆగ్రహం

ఆలయం వద్ద ధర్నా, తాత్కాలికంగా పోలీసు, రెవెన్యూ

అధికారులకు తాళాలు అప్పగింతతో సమసిన వివాదం

గొల్లప్రోలు రూరల్‌, జూన్‌ 9: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆలయాల నిర్వహణపై వివాదం తలెత్తింది. ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వర్తించిన వైసీపీ నేతలు తాళాలు, రికార్డులను జనసేన నేతలకు అప్పగించడం, అందులో తమను భాగస్వాములు చేయకపోవడంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో గ్రామంలో సుమారు నాలుగు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తాత్కాలికంగా తాళాలను పోలీసు, రెవెన్యూ అధికారులకు అప్పగించడంతో వివాదం సద్దుమణిగింది. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తాటిపర్తి గ్రా మంలో అపర్ణా సమేత నాగేశ్వరస్వామి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాల నిర్వహణ బాధ్యతలను అధికారంలో ఉన్న పార్టీ నేతలు చూస్తూ ఉంటారు. ఇప్పటివరకూ ఆలయ నిర్వహణ బాధ్యతలను వైసీపీ నేతలు పర్యవేక్షించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపఽథ్యంలో ఆలయాలకు సంబంధించిన తాళాలు, జమాఖర్చులు, రికార్డులను అప్పగిస్తామని వైసీపీ నేతలు సమాచారం ఇచ్చారు. దీంతో ఆలయం వద్దకు టీడీపీ, జనసేన నేతలు చేరుకున్నారు. ఇప్పటివరకూ ఆలయ కమిటీ ప్రతినిధులుగా ఉన్న వారు తాళాలు, రికార్డులను జనసేన నాయకులకు అప్పగించారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈలోగా జనసేన నేతలు రికార్డులు, తాళాలతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయని, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం తామంతా కష్టించి పనిచేస్తే ఆలయ నిర్వహణలో తమ భాగస్వాములను చేయకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తాళాలు తీసుకుని జనసేన నేతలు వెళ్లిపోవడంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు ఆల యం వద్ద ధర్నాకు దిగారు. పవన్‌ గెలుపు కోసం తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ సూచనల మేరకు అహర్నిశలు కష్టించి పనిచేస్తే ఇలా చేస్తారా అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. జనసేన, టీడీపీ వర్గాలు నుంచి కమిటీ ఏర్పాటుచేసి ఆలయాల నిర్వహణ బాధ్యత తీసుకోవాలి కానీ, ఇలా ఏకపక్షంగా జనసేన నాయకులు ఎలా తీసుకుంటారని, వారికి ఎలా తాళాలు అప్పగించారని వారు ప్రశ్నించారు. పెద్దల సమక్షంలో కమిటీ ఏర్పా టు చేసుకుని బాధ్యతలు ఇరుపక్షాలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. తోపులాటలో టీడీపీకి చెందిన కాకి రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి.

పోలీసుల చర్చలు

ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలతో కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్‌లు చర్చించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపఽథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఇరువర్గాలు కలిసి చర్చించుకుని కమిటీలు ఏర్పాటు చేసే వరకూ తాళాలు, ఆలయ నిర్వహణను రెవెన్యూ, పోలీసు అధికారులకు అప్పగించారు. తాము తీసుకువెళ్లిన తాళాలను డీఎస్పీ సమక్షంలో గొల్లప్రోలు ఎస్‌ఐ బాలాజీ, ఆర్‌ఐ సురేష్‌లకు జనసేన నేతలు అందజేశారు. కమిటీ ఏర్పడిన తర్వాత తాళాలను వారికి అప్పగిస్తామని, అప్పటివరకూ ఆలయంలో పూజా కైంకర్యాలు అన్నీ యఽథావిధిగా కొనసాగుతాయని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఉద్రికత్తల నేపఽథ్యంలో తాటిపర్తిలోని ఆలయాలవద్ద పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

వన్నెపూడి ఉదంతంపై వివరాలు సేకరిస్తున్నాం

తాటిపర్తి విషయంలో స్థానిక నేతలు నిర్ణయం తీసుకుంటారు

జనసేన నేతలు సంయమనం పాటించాలి

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

పిఠాపురం, జూన్‌ 9: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మపై జరిగిన దాడి, తదనంతర పరిణామాలు పార్టీ దృష్టికి వచ్చాయని, దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇందులో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని, తప్పుచేసిన వారిని ఎవ్వరినీ ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నాగబాబు ఆదివారం సాయంత్రం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి తమకు సమాచారం ఉందని, పిఠాపురం కోఆర్డినేటర్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌ నేతృత్వంలో స్థానిక నేతలు చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జనసైనికులందరూ సంయమానం పాటించాల్సి సమయం ఇదని చెప్పారు. ఎన్డీయేలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కీలకభూమిక పోషిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం వారంరోజుల్లో పవన్‌కల్యాణ్‌ పిఠాపురం రానున్నారని వెల్లడించారు. పిఠాపురం కోఆర్డినేటర్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌ అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వీలుగా పిఠాపురంలో జనసేన నిర్వహణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పిఠాపురంలో సాధ్యమైనంత వరకూ తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కూర్చొని సామరస్యంగా పరిష్కారమయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుందామని చెప్పారు. సాగు, తాగునీరు సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను పునురుద్దరి స్తామని, సుద్దగడ్డ ఆధునీకరణపై పవన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టాలని జనసైనికులు, వీరమహిళలు, పిఠాపురం ప్రజలను తాను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 09 , 2024 | 11:54 PM