టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:36 AM
నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడకుండా పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అమలాపురం ఎమ్మెల్యే విజేత అయితాబత్తుల ఆనందరావు సూచించారు.

అమలాపురం టౌన్, జూన్ 16: నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడకుండా పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అమలాపురం ఎమ్మెల్యే విజేత అయితాబత్తుల ఆనందరావు సూచించారు. అమలాపురం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆనందరావు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గంలో సీఎస్సార్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. నాట్ స్టార్టెడ్ పనులకు వెంటనే టెండర్లు పిలిచి మొదల పెట్టాలన్నారు. ఏ ప్రభుత్వంలో మంజూరైన పనులైనప్పటికీ అభివృద్ధి కుంటుపడకుండా ముందుకు సాగాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ దృష్టికి ప్రధాన సమస్యలను తీసుకువెళ్లడంతో పాటు పట్టణంలో బైపాస్‌వంతెనలు, రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయడానికి నిర్ణయించారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.చంటిబాబు, ప్రాజెక్టు డీఈఈ అన్యం రాంబాబు, పీఆర్ డీఈ పీఎస్ రాజ్‌కుమార్, ఏఈలు రాధాకృష్ణ, సత్యనారాయణ, సంపన్న, గంగాధర్ పాల్గొన్నారు.