Share News

కిటకిటలాడిన శైవక్షేత్రాలు

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:34 AM

శివ.. శివా అంటూ పరమశివుడిని స్తుతిస్తూ భక్తులు వేకువజాము నుంచే శైవక్షేత్రాలకు పోటెత్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివలింగాలకు అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేశారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన అన్ని ఆలయాల్లోనూ భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 కిటకిటలాడిన శైవక్షేత్రాలు

ద్రాక్షారామ, కోటిపల్లి, ముక్తేశ్వరం, మురమళ్ల,

కుండలేశ్వరం తదితర చోట్ల పోటెత్తిన భక్తులు

శివ.. శివా అంటూ పరమశివుడిని స్తుతిస్తూ భక్తులు వేకువజాము నుంచే శైవక్షేత్రాలకు పోటెత్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివలింగాలకు అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేశారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన అన్ని ఆలయాల్లోనూ భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేలాది జనం ప్రముఖ ఆలయాలకు తరలిరావడంతో ఆయా ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడిపోయాయి. ముఖ్యంగా జిల్లాలోని పంచారామక్షేత్రమైన ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వేలాది మంది క్యూకట్టారు. అలాగే కోటిపల్లిలోని ఛాయాసోమేశ్వరస్వామి ఆలయానికీ అదే రీతిలో భక్తులు విచ్చేశారు. ఇక మురమళ్ల, ముక్తేశ్వరం, కుండలేశ్వరం తదితర చోట్ల కూడా శైవ క్షేత్రాలకు భక్తజనం పోటెత్తారు. ఓం నమశ్శివాయ అంటూ శివనామస్మరణలతో ఆ ఆలయాలన్నీ మార్మోగి పోయాయి. అలాగే సాయంత్రం వరకు ఆధ్మాతిక కార్యక్రమాలు జరిగాయి.

అయినవిల్లి, మార్చి 8: శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ముక్తేశ్వరంలో ముక్తికాంత క్షణముక్తేశ్వరాలయం, శ్రీరాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వరాలయం, అయినవిల్లి శ్రీసిద్ధివినాయకస్వామి ఆలయాలు శుక్రవారం భక్తులతో కిట కిటలాడాయి. తెల్లవారుజామునే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలను సందర్శించారు. మహాశివరాత్రి సందర్భంగా శైవాగమోక్త ప్రకారం మహాన్యాసాది రుద్రాభిషేక పూజలు, పంచామృతాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అయినవిల్లి సత్తిబాబుశర్మ పూజలు నిర్వహించారు. ముక్తేశ్వరంలో పళ్లస్వామి చారిటబు ల్‌ ట్రస్టు, శ్రీకాకోళపు కృష్ణమూర్తి సత్రం, విశ్వబ్రాహ్మణ సంఘం అన్నసమారాధన చేశాయి.

శివనామ స్మరణతో మార్మోగిన మురమళ్ల

ఐ.పోలవరం, మార్చి 8: మహాశివరాత్రి సందర్భంగా మురమళ్ల శ్రీభద్రకాళీ వీరేశ్వరస్వామి ఆలయం శివనామస్మరణతో హోరెత్తింది. వేకువజాము నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలాచరించి వీరేశ్వరస్వామి దర్శనం కోసం బారులుతీరారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమా ర్‌, మాజీ ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, చెల్లి వివేకానంద, పలువు రు ప్రముఖులు వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. చైర్మన్‌ పెన్మెత్స వాసురాజు, ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అర్చకుడు యనమండ్ర సుబ్బారావు, పురోహితులు నాగభట్ల రామకృష్ణమూర్తి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కొత్తమురమళ్ల శాలివాహన సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. అలాగే శ్రీభద్రకాళీసమేతవీరేశ్వరస్వామికి పుష్కర నదీజలాలతో అభిషేకం చేశారు. నిత్యకల్యాణ బ్రహ్మ నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ అభిషేకం జరిగింది. తొలుత నదీజలాల కలశాలను పురవీధుల్లో ఊరేగింపు జరిపారు. చైర్మన్‌ పెన్మెత్స వాసురాజు, ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యు లతోపాటు భక్తులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 01:35 AM