Share News

ఉత్తుత్తి డీఎస్సీలెందుకు

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:41 AM

ప్రభుత్వం ఇన్ని రోజులూ మెగా డీఎస్సీ అని ఊదర గొట్టి ఇప్పుడు కేవలం ఆరువేల పోస్టులతో ఉత్తుత్తి డీఎస్సీ నిర్వహించాలనుకోవడం నిరుద్యోగులను దగా చేయడమేనని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.జె.త్రినాథ్‌బాబు ఆరోపించారు.

ఉత్తుత్తి డీఎస్సీలెందుకు

రాజానగరం, ఫిబ్రవరి 1 : ప్రభుత్వం ఇన్ని రోజులూ మెగా డీఎస్సీ అని ఊదర గొట్టి ఇప్పుడు కేవలం ఆరువేల పోస్టులతో ఉత్తుత్తి డీఎస్సీ నిర్వహించాలనుకోవడం నిరుద్యోగులను దగా చేయడమేనని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.జె.త్రినాథ్‌బాబు ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో రాజానగరంలోని గాంధీ విగ్రహం వద్ద సంఘ సభ్యులతో కలిసి కొవ్వొత్తులు, ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా 50 వేల పోస్టులకు డీఎస్సీ నిర్వహిస్తామని ఊదర గొట్టిన ప్రభుత్వం కేవలం 6 వేలు పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని ఉసూరుమనిపించడం సరికాదన్నారు. ఉపాధ్యాయ సంఘాలు దశాబ్దాల తరబడి పోరాటం సాగించి రద్దు చేయించిన అప్రంటీస్‌ విధానాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు సంబంధించి పునరాలోచన చేయకపోవడం విచారకరమన్నారు. వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ప్రయోజనం లేదని, కనీసం మధ్యంతర భృతిపై చర్చించకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలపై ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిదర్శనమని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు బండి ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఆర్థిక కార్యదర్శి వీరబాబు, జిల్లా నాయకులు భీమేశ్వరరావు, శైలజ, మండల నాయకులు చిన్నా మాస్టారు, గీత, వీరబాబు, ఉదయభాను, సూర్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:41 AM