Share News

విజయం మనదే!

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:41 AM

వైసీపీ అరాచకాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసి పూర్వవైభవం తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తునిలో బుధవారం నిర్వహించిన రా..కదలి రా!.. సభలో పాల్గొని చంద్రబాబు గంటన్నరసేపు ప్రసంగించారు.

విజయం మనదే!
విల్లును ఎక్కుపెట్టిన చంద్రబాబు

  • రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే

  • వైసీపీ అరాచకాలకు ప్రజలు ముగింపు పలకడం ఖాయం

  • కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేస్తా

  • ఏలేరు ఆధునికీకరణ, పురుషోత్తపట్నంతోపాటు ఎత్తిపోతల పథకాలను బాగుచేస్తా

  • తునిలో రా..కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు

  • జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కన్నబాబు, దాడిశెట్టి రాజా అవినీతిపై ధ్వజం

  • మంచితనానికి, మర్యాదలకు తూర్పుగోదావరి పెట్టింది పేరని కొనియాడిన చంద్రబాబు

  • తుని సభకు వేలల్లో జనం పోటెత్తడంతో చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బు

‘‘వైసీపీ అరాచకాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసి పూర్వవైభవం తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తునిలో బుధవారం నిర్వహించిన రా..కదలి రా!.. సభలో పాల్గొని చంద్రబాబు గంటన్నరసేపు ప్రసంగించారు. సాయత్రం 4.15 గంటలకు హెలీకాఫ్టర్‌లో తునికి చేరుకున్న చంద్రబాబు 5.15 గంటలకు సభా వేదికపైకి వచ్చారు. అప్పటికే వేలల్లో హాజరైన జనాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. జన సందోహాన్ని చూస్తుంటే టీడీపీ గెలుపు కనిపిస్తోందన్నారు. చెంతనే ఉన్న సముద్రం పొంగిందా అన్న తరహాలో వచ్చిన జనాలను చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గొప్పదనాన్ని చంద్రబాబు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా అంటే మంచితనానికి, మర్యాదలకు పెట్టింది పేరు అని కొనియాడారు. అలాగే వైసీపీ నేతల అరాచకాలను మరోసారి ఆయన ఎండగట్టారు. జిల్లాలో ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. సంప్రదాయాలకు చిహ్నమైన కోడి పందాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయని, హద్దుల్లో ఉంటూనే ఆడుకోవాలని సరదాగా సూచించారు.

కాకినాడ(ఆంధ్రజ్యోతి)/తుని రూరల్‌, జనవరి 10:

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు, ఓ మంత్రికి సీట్లు మార్చిన జగన్‌.. కాకినాడ సిటీ, కొత్తపేట, అనపర్తి ఎమ్మెల్యేలను ఎందుకు మార్చరని చంద్రబాబు ధ్వజమెత్తారు. మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కన్నబాబుల అవినీతిపై విరుచుకుపడ్డారు. బుధవారం తునిలో నిర్వహించిన రా..కదలి రా..! సభకు వేలల్లో జనం హాజరవడంతో అంతా పసుపుమయం అయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలతో పండగ వాతావరణం సంతరించుకుంది. సాయంత్రం 5.15కు చంద్రబాబు బహిరంగ సభ వేదికపైకి రాగానే చప్పట్లు, కేరింతల తో టీడీపీ, జనసేన నేతలు, కేడర్‌ స్వాగతం పలికారు. వేలల్లో హాజరైన జనాలను చూసిన చంద్రబాబు ఆప్యాయతలకు జిల్లా మారుపేరు అని కొనియాడారు. నీతినిజాయితీకి జిల్లా పెట్టింది పేరన్నారు. పౌరుషంగా ఒక్కమాట కూడా మాట్లాడరని అన్నా రు. మంచినీళ్లు ఇస్తే కొబ్బరి నీళ్లు ఇక్కడి ప్రజలు ఇస్తారన్నారు. చెంతనే అన్నవరంలో నిత్యం పూజలు, వ్రతాలతో ఈ ప్రాంతం మార్మోగుతుందని వివరించారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజా అని ధ్వజమెత్తారు. అక్రమ సంపాదనతో ఒకచోట 132 ఎకరాలు, మరోచోట రౌతులపూడిలో 72 ఎకరా లు కొన్నారన్నారు. ఇలాంటి వసూలు రాజా అయిన మంత్రి రాజా ఎందుకు టిక్కెట్‌ మార్చే విషయంలో కనబడలేదని జగన్‌ను ప్రశ్నించారు. మరో ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతికి ద్వారాలు తెరిచారని, దందాల్లో ఈయన హీరో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్‌ను నోటికివచ్చినట్టు తిట్టడంలో ద్వారంపూడి మీరిపోయాడన్నారు. ఇలాంటి నేత లు తిన్నదంతా తిరిగి కక్కిస్తానని హెచ్చరించారు. జగన్‌కు ద్వారంపూడి బినామీ అని, బియ్యంలో ఈయన కోట్లు గడించారన్నారు. జిల్లాలో ఏ అవినీతి జరిగినా దీనికి కేంద్రబిందువు ద్వారంపూడేనన్నారు. ఎమ్మెల్యే కన్నబాబు మెక్కడంలో స్పీడ్‌గా ఉన్నారని, ఒకప్పుడు ఈయన జగన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు తెగ పొడుగుతున్నారన్నారు. బతకనేర్చిన కన్నబాబు అవినీతిలో లెక్కలేనంతగా సంపాదించాడని ఆరోపించారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేలను జగన్‌ మార్చేశారని, ఓ మంత్రిని జిల్లా దాటించేశారన్నారు. ప్రజలు కూడా సీఎం జగన్‌ను ఇంటికి పంపించడం ఖాయం అన్నారు. వైసీపీ పాలనలో జిల్లా సాగునీటి రంగం తీవ్రంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. టీడీపీ వచ్చాక ఏలేరు ఆధునికీకరణ, పురుషోత్తపట్నం, ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడినపెడతామని ప్రకటించారు. జిల్లాలో సముద్రజల కాలుష్యంపై మత్స్యకారులు ఫిర్యాదుచేశారని, ఆ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో తీరంతోపాటు సెజ్‌, రెండు పోర్టులు ఉన్నాయని, పెట్రోకాంప్లెక్స్‌ కూడా వస్తే పారిశ్రామికంగా వృద్ధి చెందుతుందన్నారు. పర్యాటకరంగాన్ని కూడా ప్రోత్సహించి జిల్లాకు పూర్వవైభవం తెస్తానన్నారు. కాగా చంద్రబాబుకు టీడీపీ నేతలు వెండి గద, బాణం అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, బండారు సత్యనారాయణ, రాజప్ప, గొల్లపల్లి, ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్యేలు నెహ్రూ, వనమాడి, వర్మ, రామకృష్ణారెడ్డి, వంగలపూడి అనిత, బండారు సత్యానందం, దాట్ల బుచ్చిబాబు, పిల్లి అనంతలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నవీన్‌, ప్రత్తిపాడు, తుని, రాజానగరం ఇన్‌చార్జులు వరుపుల సత్యప్రభ, దివ్య, బొడ్డు వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, కటకంశెట్టి బాబి, పేరాబత్తుల రాజశేఖర్‌, వాసిరెడ్డి ఏసు దాసు, టీడీపీ సీనియర్‌ నేత గుణ్ణం చంద్రమౌళిలు పాల్గొన్నారు.

మూడు నెలల్లో దశ, దిశ చూపిస్తాం

సూర్యుడు తూర్పున ఉదయించి ఏ విధంగా అందరికీ వెలుగునిస్తాడో.. అలా టీడీపీ, జనసేన కూడా మూడు నెలల్లో ప్రభుత్వ బాధ్యత తీసుకుని దశ, దిశ చూపిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. ఒక విజనరీ ఉండాలి. ఆ రోజుల్లో కాటన్‌.. ధవళేశ్వరం బ్యారేజీ కట్టాడు. అతడు విదేశీయుడైనా గోదావరి జిలాల్లో ఏ మూలకు వెళ్లినా ఆయన విగ్రహాలు పెట్టారు. అదీ మీ మంచితనం. మీకు మేలు చేస్తే అలా చూసుకుంటారు. కానీ ఇక్కడ వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కాగా జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన మోసపూరిత హామీల వీడియోను సభా వేదికపై భారీ స్ర్కీన్‌పై చంద్రబాబు ప్రదర్శించారు. మద్య నిషేధం చేస్తానని, సీపీఎస్‌ వారంలోనే రద్దు చేస్తానని, ప్రత్యేక హోదా తీసుకువస్తానని, పోలవరం 2021, 2022, 2023, 2025కల్లా పూర్తిచేస్తానని జగన్‌ ప్రసంగాలను ప్రదర్శించి.. బాబు ప్రశ్నల వర్షం కురిపించారు. జై చంద్రబాబు, జై పవన్‌కల్యాణ్‌.. సైకో పోవాలి-సైకిల్‌ రావాలం టూ సభా ప్రాంగణం నినాదాలతో హోరెత్తింది. చంద్రబా బు ప్రసంగానికి కార్యకర్తలు ఉత్సాహంతో స్పందించారు.

Updated Date - Jan 11 , 2024 | 03:41 AM