Share News

టీడీపీ హయాంలో కళకళ.. వైసీపీ వచ్చాక వెలవెల

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:46 AM

జగ్గంపేట నియోజకవర్గం సమస్యలకు నిలయంగా మారింది. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. పొలాలకు సాగునీరు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు.

టీడీపీ హయాంలో కళకళ..  వైసీపీ వచ్చాక వెలవెల

జగ్గంపేట నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి

సాగునీటి ప్రాజెక్టులు గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

పనిచేయని తాళ్లూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌

నిలిచిన రామవరం పురుషోత్తపట్నం ఫేజ్‌-2

అభివృద్ధికి నోచుకుని మల్లవరం ఎత్తిపోతల పథకం

సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు

నియోజకవర్గంలో ఒక్క రోడ్డూ అభివృద్ధి పరచని రాష్ట్ర ప్రభుత్వం

లబ్ధిదారులకు అందని టిడ్కో ఇళ్లు..

జగ్గంపేట, ఏప్రిల్‌ 21: జగ్గంపేట నియోజకవర్గం సమస్యలకు నిలయంగా మారింది. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. పొలాలకు సాగునీరు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడంవల్ల నిరుపయోగంగా మారాయి. నియోజకవర్గంలో ఎటువైపు చూసినా గతుకుల రహదారులు తప్ప నిర్మాణలు చేపట్టలేదు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులతోపాటు వంద పడకల ఆస్పత్రి నిర్మాణం, కాపు కల్యాణ మండపం, ఇండోర్‌ స్టేడియం వంటివి ఎన్నో జగ్గంపేటలో నెలకొల్పేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలన్నీ మూలనపడ్డాయి. కేవలం టీడీపీ హయాంలో మొదలెట్టారనే కక్షతోనే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వైసీపీ పూర్తి చేయకపోవడం గమనార్హం.

పెండింగ్‌లోనే ఇండోర్‌ స్టేడియం నిర్మాణం

టీడీపీ ప్రభుత్వం సమకూర్చిన నీటి వనరులను వైసీపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. గండేపల్లి మండలం తాళ్లూరులో 2003లో టీడీపీ హయాంలో చంద్రబాబు పుష్కర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్‌ హయాంలో అది పూర్తయింది. దశాబ్ధకాలంపాటు ఈ ప్రాజెక్టు ద్వారా 30వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అయ్యింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి పెట్టకపోవడంతో మోటార్లు మరమ్మతులకు గురవడం, పైపులైన్లు దెబ్బతినడంతో ఒక్క చుక్క నీరు కూడా అందడంలేదు. దీంతో తాళ్లూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనిచేయకుండాపోయింది. పుష్కర జలాలను ఏలేరుకు అనుసంధానం చేస్తూ జగ్గంపేట మండలం రామవరంలో రూ.600కోట్లతో ఏర్పాటు చేసిన పురుషోత్తపట్నం ఫేజ్‌-2 ప్రాజెక్టును వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలుపుదల చేసింది. దీంతో జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, కిర్లంపూడి మండల రైతులకు సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. రూ.130కోట్లతో మల్లవరం ఎత్తిపోతల పథకాన్ని టీడీపీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఎక్కడ పైపులైన్లు అక్కడే ఉండిపోయాయి. వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. పుష్కర జలాలు అందకపోవడంతో మెట్టప్రాంతమైన గుర్రప్పాలెం, గొల్లలగుంట, కాండ్రేగుల, నరేంద్రపట్నం, బావారం గ్రామాలకు నీరందక తొలకరి పంటలు మధ్యలోనే ఎండిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 2023లో సార్వా, 2024లో దాళ్వా పంటను కొనుగోలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ముందుకు రాలేదు. 2023లో అకాల వర్షాల కారణంగా పంటలు తడిసిపోతే జ్యోతుల నెహ్రూ గ్రామాల్లో పర్యటించి కలెక్టర్‌తో మాట్లాడితే కానీ పంట కొనుగోలు చేయలేదు ఈ వైసీపీ ప్రభుత్వం.

అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ

టీడీపీ ప్రభుత్వ హయాంలో జగ్గంపేట పట్టణంలో 3600మందికి సొంతింటి కల నెరవేర్చేందుకు టిడ్కో ఇళ్లకు శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లను గాలికొదిలేసింది. జగ్గంపేటలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను అభివృద్ధి పరచాలని టీడీపీ సన్నాహాలు చేసి గండేపల్లి మండలం జడ్‌.రాగంపేటవద్ద వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ నిర్మాణ పనులు కాస్తా నిలిచిపోయాయి. టీడీపీ హయాంలోనే నిర్మించిన కాపు కల్యాణ మండపం వైసీపీ ప్రారంభించినా సరే దాన్ని పూర్తి వాడకంలోకి తీసుకురాలేకపోయింది. ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి టీడీపీ చర్యలు తీసుకున్నా వైసీపీ ప్రజాప్రతినిధులు దాన్ని తుంగలోకి తొక్కేశారు.

ఒక్క రోడ్డు అభివృద్ధి చేయలేదు

టీడీపీ హయాంలో సర్వీస్‌ రోడ్లు, సీసీ రోడ్లు, మెయిన్‌రోడ్లను అభివృద్ధి చేశారు. ప్రతి గ్రామం, ప్రతి వీధిలో రోడ్డు సదుపాయం ఉండేలా టీడీపీ చర్యలు తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డును అభివృద్ధి చేయలేకపోయింది. గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన అడపాదడపా మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంది తప్ప పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. జగ్గంపేట మండలంలోని కొత్తూరు-బలభద్రపురం, కృష్ణాపురం-మన్యంవారిపాలెం, రాజపూడినుంచి మన్యంవారిపాలెం, రామవరం-గోనేడ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

Updated Date - Apr 22 , 2024 | 12:47 AM