Share News

సన్‌..డే!

ABN , Publish Date - May 27 , 2024 | 12:04 AM

ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చి నిప్పులు కురిపిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఎండకు తోడు వడగాడ్పులు వీయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

సన్‌..డే!
చల్లబడ్డారు : కొవ్వూరు గోష్పాదక్షేత్రం రేవులో స్నానాలు చేస్తున్న జనం

కనిపించని ఎండ

రోజంతా తీవ్ర ఉక్కబోత

తట్టుకోలేక అల్లాడిపోయిన జనం

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 26 : ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చి నిప్పులు కురిపిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఎండకు తోడు వడగాడ్పులు వీయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో రోడ్లని నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూని తలపిస్తున్నాయి. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండ అంతగా కనిపించనప్పటికి ఉక్కబోత అదికంగా ఉంటుంది. రెమాల్‌ తుపాను వాతావరణాన్ని చల్లబరచకపోగా మరింత వేడెక్కించింది. జిల్లాలో ఎక్కడా ఒక్క చుక్క వర్షం పడలేదు. ఎండ తీవ్రత, ఉక్కబోత మరింత పెరిగింది. జిల్లా ప్రజానీకాన్ని వడదెబ్బకు గురిచేసింది. దీంతో ఆదివారం జిల్లా ప్రజలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి ఏడు గంటలు దాటినా వాతావరణం చల్లబడలేదు. ఒక పక్క ఎండతీవ్రత, మరోపక్క ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోయారు. బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ఏర్పడిందని వాతావరణశాఖ ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలైనా కురుస్తాయని, వాతావరణం కాస్త చల్లబడుతుందని జిల్లా ప్రజానీకం ఆశించారు. కానీ రెమాల్‌ తుపాను కోల్‌కత్తా, బంగ్లాదేశ్‌ వైపు వెళ్లిపోవడంతో జిల్లావ్యాప్తంగా వేడిగాలులు మరింత పెరిగాయి. ఇలా ఒక్కసారిగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఉక్కబోత కారణంగా అవస్థలు పడాల్సి వచ్చింది. దిలా ఉంటే సోమవారం నుంచి ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ చేస్తున్న హెచ్చరికలు ప్రజల్లో గుబులు రేపుతున్నాయి.

నేడు, రేపు ఎండలే..

గత కొద్దిరోజులుగా జిల్లాలో చిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి, రెండుసార్లు ఆకస్మికంగా భారీ వర్షాలు పడ్డాయి. భూమి చల్లబడిందని అంతా ఆనందపడిపోయారు. మళ్లీ ఎండలు ఠారెత్తించాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులు మబ్బులతో కూడిన వాతావరణం కనిపించింది. ఇలా భిన్నమైన వాతావరణాన్ని జిల్లా ప్రజానీకం చవిచూశారు. ఇప్పుడు మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.రాజమహేంద్రవరంలో ఆదివారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఏడు గంటల సమయానికి కూడా 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇక సోమ, మంగళవారాల్లోనూ దాదాపుగా 44 - 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీంతో రాబోయే రెండు, మూడు రోజులు జిల్లా ప్రజలు ఎండ వేడిమి, ఉక్కబోతల నుంచి రక్షణ కల్పించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.

గోదారి రేవులు కిటకిట..

కొవ్వూరు, మే 26 : ప్రజలు వేసవితాపం తట్టుకోలేకపోతున్నారు. ఎండల నుంచి తట్టుకు నేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుం టున్నారు. గోదావరి తీరప్రాంత ప్రజానీకం గోదావరిలో స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఎండ లేదు కానీ.. ఉక్కబోతతో జనం అల్లాడిపోయారు. బయటకు రావాలంటేనే భయపడిపోయారు. అయితే రాజమహేంద్రవరం, కొవ్వూరు, ధవళేశ్వరం గోదావరి రేవులు జనంతో నిండిపోయాయి. చిన్నా పెద్దా అందరూ వేసవి ఉపశమనం కోసం గోదావరిలో స్నానాలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గోదా వరి రేవులు జనంతో నిండిపోయాయి. ప్రమాదాలు జరుగుతున్నా.. ఏ గోదావరి రేవు వద్ద ఒక్క పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా కనిపించకపోవడం గమనార్హం. రేవులు వద్ద ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు కూడా లేవు.. యువత లోతుకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

Updated Date - May 27 , 2024 | 12:04 AM