Share News

సిబ్బంది ఉన్నా.. సమస్యలు పట్టవా!

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:50 AM

మున్సిపల్‌ సిబ్బందికి అదనంగా సచివాలయ కార్యదర్శులు వచ్చినా వార్డుల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీల నిర్వహణ, తాగునీటి సరఫరా పర్యవేక్షించడం లేదని కౌన్సిలర్లు అన్నారు. శనివారం కొవ్వూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన నిర్వహించారు.

సిబ్బంది ఉన్నా.. సమస్యలు పట్టవా!
సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు

  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 11 ఎకరాలు: చిన్ని

  • అభివృద్ధి పనులు సబ్‌ప్లాన్‌ నిధులతో చేపట్టాలి: రమేష్‌

  • కొమ్మలు నరికిన వారిపై చర్యలు తీసుకోకపోతే నిరవధిక దీక్ష: బీజేపీ కౌన్సిలర్‌ మురళీకృష్ణ

కొవ్వూరు, జూలై 27: మున్సిపల్‌ సిబ్బందికి అదనంగా సచివాలయ కార్యదర్శులు వచ్చినా వార్డుల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీల నిర్వహణ, తాగునీటి సరఫరా పర్యవేక్షించడం లేదని కౌన్సిలర్లు అన్నారు. శనివారం కొవ్వూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన నిర్వహించారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ సూరపనేని చిన్ని మాట్లాడుతూ దొండకుంట పుంత రోడ్డు వద్ద మున్సిపల్‌ హెడ్‌ వాటర్‌వర్క్సు స్థలంలో పంపుహౌస్‌ నిర్మాణం చేపట్టాలని కౌన్సిల్‌కు తీసుకువచ్చిన తీర్మాణాన్ని ఆమోదించారు. కంఠమణి రమేష్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ నిర్మాణం చేపడతారని అడిగిన ప్రశ్నకు చిన్నీ బదులులిస్తూ పశివేదల-నందమూరు జంక్షన్‌లో ఉన్న లేఅవుట్‌ 3లో ఖాళీగా ఉన్న 11 ఎకరాల్లో కాలేజీ నిర్మించాలని సూచించారు. మున్సిపాల్టీలోని పలు అభివృద్ధి పనులకు రూ.7 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసి రుడాకు పంపించామన్నారు. అలాగే వాటర్‌వర్క్సులో మరమ్మతుల శాశ్వత పరిష్కారానికి సుమారు రూ.10 లక్షలు వ్యయం అవుతుందన్నారు. అయితే అభివృద్ధి పనులు జనరల్‌ ఫండ్‌తో కాకుండా ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో చేపట్టాలని రమేష్‌ అన్నారు. బ్రిడ్జిపేటలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలన్నారు. పీహెచ్‌ వర్కర్లతో పాటు, నాన్‌ పీహెచ్‌ వర్కర్లకు ఒకేలా వేతనాలు పెంచాలని కమిషనర్‌కు సూచించారు. కౌన్సిలర్‌ బత్తి నాగరాజు మాట్లాడుతూ పట్టణంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, ఖాళీస్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి విష పురుగులు సంచరిస్తున్నాయన్నారు. చైర్‌పర్సన్‌ రత్నకుమారి మాట్లాడుతూ ప్రతిరోజూ ఎమినిటీ సెక్రటరీలు వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్‌ సేవలను అందజేయాలన్నారు. బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ కౌన్సిల్‌ ఏర్పడిన నాటినుంచి విద్యుత్‌ డ్రైవర్స్‌ కోసం కౌన్సిల్‌ సమావేశాల్లో నిధులు మంజూరు చేస్తూనే ఉన్నాం. నాణ్యతలేని డ్రైవర్స్‌ కొనుగోలు చేస్తున్నామా, చాలా సందేహాలు ఉన్నాయని, విచారణ చేపట్టాలన్నారు. కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకష్ణ మాట్లాడుతూ గోష్పాదక్షేత్రంలో దేవతావృక్షం కొమ్మలు నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఫిర్యాదుచేసి 10 రోజులయిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కమిషనర్‌ కె.జోసఫ్‌ డానియేలు మాట్లాడుతూ గోష్పాక్షేత్రం ఇరిగేషన్‌ స్థలమని, మున్సిపల్‌ సిబ్బంది ఎవ్వరూ చెట్టు కొట్టడంలో పాల్గొనలేదని శానిటరి ఇన్‌స్పెక్టర్‌ విచారణలో తేలిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరవధిక దీక్ష చేస్తానని మురళీకృష్ణ అన్నారు. గౌతమీనగర్‌లోని లక్ష్మీసాయి డ్వాక్రా గ్రూపు రిజల్యుషన్‌లో ట్యాంపరింగ్‌కు పాల్పడిన రిసోర్స్‌పర్సన్‌ శ్రీలక్ష్మిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సూరపనేని చిన్ని మాట్లాడుతూ రిసోర్స్‌పర్సన్‌పై ఫిర్యాదులొచ్చి వచ్చినా 8 నెలలుగా ఏం చేస్తున్నారని మెప్మా సీఎంఎం భవానీని ప్రశ్నించారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా పాలకవర్గ సభ్యుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆగస్టు కౌన్సిల్‌కు పట్టణంలోని డ్వాక్రా ఆర్పీల రికార్డులు తనిఖీచేసి నివేదిక అందజేయాలని కమిషనర్‌ను కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:50 AM