Share News

26 నుంచి ఆధ్యాత్మిక యాత్ర

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:43 AM

వారాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించేవిధంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

26 నుంచి ఆధ్యాత్మిక యాత్ర
పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌

  • ఆరు పుణ్యక్షేత్రాలను కలుపుతూ బస్సు ఏర్పాటు

  • ఒక్క రోజు యాత్ర

  • పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వారాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించేవిధంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామక్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్‌ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోందన్నారు. అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. యాత్ర కోసం బస్సును ఏర్పాటు చేశామని, దానిలో 18 సీట్లు ఉంటాయన్నారు. ఈ బస్సు కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ రూట్‌ నిర్ధారించామన్నారు. బస్సును రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్‌ వద్ద టూరిజం శాఖకు సంబంధించిన సమాచారం, రిజర్వేషన్‌ కౌంటర్‌ కార్యాలయం వద్ద ఈనెల 26న ఉదయం 6గంటలకు ప్రారంభిస్తామన్నారు. ఉదయం బయలుదేరి యాత్ర పూర్తి చేసుకుని రాత్రి 7:30గంటలకు తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. బస్సు టిక్కెట్‌ పెద్దలకు రూ.వెయ్యి, 3-10 ఏళ్ల చిన్నారులకు రూ.800గా నిర్ణయించారన్నారు. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక కలయికగా ఉన్న ఈ టూర్‌ ప్యాకేజీని యాత్రికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. 26న ప్రారంభోత్సవంలో తాను, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, టూరిజం శాఖ ఉన్నతాధికారులు, బోర్డు డైరెక్టర్లు పాల్గొంటారని తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 12:44 AM