Share News

సీతానగరంలో..ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యం

ABN , Publish Date - May 26 , 2024 | 12:45 AM

సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే ఆరోగ్య కేంద్రానికే అనారోగ్యం వచ్చింది. స్లాబ్‌ మొత్తం పాడవడంతో ప్రతి గదిలోను వర్షం పడుతుండడంతో రికార్డులతో పాటు మందులు తడిసిపోతున్నాయి. ఆరోగ్య సిబ్బంది.. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది.

సీతానగరంలో..ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యం
సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

  • శిథిలావస్థకు చేరిన పీహెచ్‌సీ భవనం

  • స్లాబ్‌ మొత్తం పాడై ప్రతి గదిలోను వర్షం

  • తడిసిపోతున్న రికార్డులు, మందులు

  • మరమ్మతులకు నిధులివ్వని పాలకులు

సీతానగరం, మే 25: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే ఆరోగ్య కేంద్రానికే అనారోగ్యం వచ్చింది. స్లాబ్‌ మొత్తం పాడవడంతో ప్రతి గదిలోను వర్షం పడుతుండడంతో రికార్డులతో పాటు మందులు తడిసిపోతున్నాయి. ఆరోగ్య సిబ్బంది.. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. సీతానగరం మండలానికి 30 పడకల ఆసుపత్రి మంజూరు అవుతోందని ఐదేళ్లుగా పాలకులు చెబుతూ రావడమే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కనీసం మరమ్మతులకు నిధులు కూడా మంజూరు చేయలేదు. అడిగితే 30 పడలక ఆసుపత్రి మంజూరవుతోందని ప్రతి సమావేశంలోను వైసీపీ నాయకులు చెబుతూ వస్తున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రెండు రోజుల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందనగా హడావుడిగా శంకుస్థాపన చేశారు. అయితే సదరు స్థలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చెందినది కావడంతో ఆ కమిటీకి వేరే చోట స్థలం కేటాయించి ఇక్కడ శంకుస్థాపన చేశారు. కాని సుమారు రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు కనీసం గోతులు కూడా తీయలేదు. వైద్య సిబ్బందిని ఎవరిని అడిగినా సరైన సమాధానం మాత్రం చెప్పడం లేదు. నూతన ప్రభుత్వం వచ్చి పరిశీలించి నిధులు విడుదల చేస్తే ఆసుపత్రి పనులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నారు. అక్కడి నుంచి కనీసం ఒక సంవత్సరం అయినా భవన నిర్మాణానికి సమయం పడుతుంది అప్పటి వరకు అయినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 12:45 AM