Share News

నాడు-నేడు పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 23 , 2024 | 12:41 AM

మనబడి నాడు-నేడు పథకం రెండో దశ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ కలెక్టర్‌, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావు సూచించారు.

నాడు-నేడు పనులను వేగవంతం చేయాలి

పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ మధుసూదనరావు

ముమ్మిడివరం, మే 22: మనబడి నాడు-నేడు పథకం రెండో దశ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ కలెక్టర్‌, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావు సూచించారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ కళాశాలలోని సమావేశపు మందరింలో బుధవారం సాయంత్రం మండల విద్యాశాఖ అధికారులు-2తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ నాడు-నేడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఆదేశాల మేరకు నాడు-నేడు రెండో దశ పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభించే తేదీ నాటికి పనులన్నింటినీ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారానికి ఒక పాఠశాలను పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలో తాగునీరు, విద్యుద్దీకరణ, తరగతి గదులు, మైనరు, మేజర్‌ పనులు తదితర మౌలిక వసతులను పూర్తిచేయాలన్నారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సహకారంతో స్టేజ్‌ కంప్లిషన్‌ కూడా పూర్తి చేయాలన్నారు. మండల స్థాయిలో ఎప్పటికప్పుడు కాంపోనెంట్‌ వారీగా నాడు-నేడు పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్షలు నిర్వహించాలన్నారు. పూర్తిచేసిన పనులకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పనుల నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే పనుల జాప్యానికి గ్రీన్‌ చాక్‌ బోర్డులు, స్మార్ట్‌ టీవీలు రావాల్సి ఉందని, పనులు పూర్తి చేయడానికి సిమెంటు, ఇసుక కొరత ఉందని ఎంఈవోలు ఈ సందర్భంగా ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మధుసూదనరావు మండలాల వారీగా సమీక్ష నిర్వహించి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సమగ్రశిక్ష సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఆల్ట్రనేటివ్‌ స్కూల్స్‌ కోఆర్డినేటర్‌ డి.రమేష్‌బాబు, ఏపీవో డాక్టర్‌ ఎంఏకే భీమారావు, ఫైనాన్స్‌ అండ్‌ అక్కౌంట్స్‌ ఆఫీసర్‌ జి.ప్రవీణ్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సుబ్బరాజులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:41 AM