Share News

సత్యదేవుడి ప్రధానాలయం ధ్వజస్తంభం తొలగింపు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:50 AM

రత్నగిరివాసుడైన సత్యదేవుడి ప్రధానాలయంలో శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభం తొలగింపు ప్రక్రియను ఆదివారం పూర్తిచేశారు.

సత్యదేవుడి ప్రధానాలయం   ధ్వజస్తంభం తొలగింపు

అన్నవరం, ఏప్రిల్‌ 7: రత్నగిరివాసుడైన సత్యదేవుడి ప్రధానాలయంలో శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభం తొలగింపు ప్రక్రియను ఆదివారం పూర్తిచేశారు. అడుగుభాగంలో సుమారు 15 గ్రాముల బంగారం ఇతర లోహాలు లభ్యమయ్యాయి. వీటిని కొత్తగా లోహాలతోపాటు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన రోజున అడుగుబాగంలో వేయనున్నట్లు ఆలయ ఈవో రామచంద్రమోహన్‌ తెలిపారు. ఈనెల 18 నుంచి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభమై 22న ప్రతిష్ఠించనున్నారు. సుమారు రూ.4కోట్ల వ్యయంతో నెల్లూరుకు చెందిన ఒక దాత అందించనున్నారు. నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకలు ఘనంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈకార్యక్రమానికి దేవదాయశాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించనున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి. భక్తులు, గ్రామస్థులు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు విచ్చేయాలని అధికారులు కోరారు. మరో వందేళ్ల వరకు ఇటువంటి కార్యక్రమం జరగనందున అధికసంఖ్యలో భక్తులు విచ్చేస్తారని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉగాది వేడుకలకు సత్యదేవుడి ఆలయం ముస్తాబు

పంచాంగ పఠనం ఇతర వైదిక కార్యక్రమాలు

అన్నవరం, ఏప్రిల్‌ 7: ఈనెల 9న క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని అన్నవరం సత్యదేవుడి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు ఆలయ ఈవో రామచంద్రమోహన్‌ తెలిపారు. వేకువజామున సుప్రభాతసేవ అనంతరం స్వామి, అమ్మవార్లకు అభ్యంగన స్నానమాచరింపచేసి నూతన పట్టువస్త్రాలను ధరింపచేసి ఉదయం 9గంటలకు పంచాంగ ఆవిష్కరణ, 9.30కి గొల్లపల్లి సుబ్రహ్మణ్య ఘనాపాఠిచే పంచాంగశ్రవణం, 10గంటలకు ఉగాది పచ్చడి వితరణ గావించి 5గురు పండితులకు ఉగాది పురస్కారాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. కళామందిరంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, 11గంటలకు వెండి రథంపై స్వామి,అమ్మవార్ల ఊరేగింపు, రాత్రి 7గంటలకు కొండదిగువ వెండిగజవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.

సత్యదేవుడి ఆలయ విశిష్టత, వైదిక కార్యక్రమాలపై

డాక్యుమెంటరీ చిత్రీకరణకు ఉత్తర్వులు

అన్నవరం, ఏప్రిల్‌ 7: అన్నవరం సత్యదేవుడి ఆలయ విశిష్టత, నిత్యం జరిగే వైదిక కార్యక్రమాలపై డాక్యుమెంటరీ చిత్రీకరించాలని దేవదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈవో రామచంద్రమోహన్‌ ఆదివారం చిత్రీకరణ సంస్థకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని ఆదిరాజు సినీక్రియేషన్స్‌ సంస్థ చిత్రీకరిస్తోంది. డిజిటల్‌ ఫార్మట్‌లో సుమారు 20 నిమిషాల నిడివితో వీటిని చిత్రీకరిస్తామని నిర్మాణసంస్థ డైరెక్టర్‌ కార్తీక ఆదిరాజు తెలిపారు. ఆలయంలో జరిగే నిత్య కార్యక్రమాలతో పాటుగా ప్రతీ సంవత్సరం ఆలయంలో నిర్వహించే పండుగలు, బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, గిరిప్రదక్షణ, రత్నగిరిపై ఉన్న ఉపాలయాలు, స్వామివారి ప్రసాదం విశిష్టత, తదితర అంశా లను చిత్రీకరించనున్నట్లు ఆమె తెలిపారు. గతంలో సింహాచలం ఆలయ విశిష్టత డాక్యుమెంటరీని తమ నిర్మాణ సంస్థ చిత్రీకరించిందన్నారు. కార్యక్రమంలో పీఆర్వో కృష్ణారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:50 AM