పుదుచ్చేరి వరకు సర్కారు ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Mar 15 , 2024 | 12:49 AM
కాకినాడ-చెంగల్పట్టు-కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి పుదుచ్చేరి వరకు నడవనుంది. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించడం యానాం ప్రజల చిరకాల వాంఛ. సామర్లకోట మీదుగా సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుండడంతో సామర్లకోట పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైలు ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది.
సామర్లకోట, మార్చి 14: కాకినాడ-చెంగల్పట్టు-కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి పుదుచ్చేరి వరకు నడవనుంది. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించడం యానాం ప్రజల చిరకాల వాంఛ. సామర్లకోట మీదుగా సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుండడంతో సామర్లకోట పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైలు ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది. ఈ మేరకు సామర్లకోట రైల్వే స్టేషన్ ఉన్నతాధికారులకు రైల్వే సీపీటీఎం అధికారి నుంచి అందిన ఆదేశాలను గురువారం రాత్రి ఆంధ్రజ్యోతి సేకరించింది. 17652 నంబరు గల కాచి గూడ-చెంగల్పట్టు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు పుదుచ్చేరి వరకూ వారంలో మూడు రోజుల పాటు ఆదివారం, బుధవారం, గురువారంలో పుదుచ్చేరి వరకూ వెళ్లనుంది. 17651 నంబరు గల చెంగల్పట్టు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు పుదుచ్చేరి నుంచి కాచిగూడ వరకూ వారంలో మూడు రోజుల పాటు అనగా సోమవారం, గురువారం, శుక్రవారంలలో వెళ్లనుంది. 17644 నంబరు గల కాకినాడ-చెంగల్పట్టు మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ-పుదుచ్చేరి మద్య ఆదివారం, బుధవారం, గురువారం నడవనుంది. మిగిలిన నాలుగు రోజులలో అనగా సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారాలలో కాకినాడ-చెంగల్పట్టు మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తుంది. 17643 నంబరు గల చెంగల్పట్టు-కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు చెంగల్పట్టు-కాకినాడ మధ్య మిగిలిన నాలుగు రోజులు అనగా మంగళవారం, బుధవారం, శనివారం, ఆదివారంలో రాకపోకలు సాగించనుంది. ఈ మేరకు గురువారం పుదుచ్చేరి-కాచిగూడ మధ్య పొడిగించిన రైలు ప్రారంభమైంది. ఈనెల 15న కాకినాడ-చెంగల్పట్టు మధ్య, ఈ నెల 16న చెంగల్పట్టు-కాకినాడ మద్య పొడిగించిన రైళ్లు ప్రారంభం కానున్నాయి. మరిన్ని వివరాలకు సమీప రైల్వే స్టేషన్‌లో బుకింగ్ కార్యాలయం నందు సిబ్బంది ద్వారా తెలుసుకోవచ్చని, పాత టైమింగ్స్‌లోనే రైలు రాకపోకలు సాగించనందని రైల్వే అధికారి కార్యాలయం నుంచి అందిన ఉత్తర్వులలో తెలిపారు. కాగా కాకినాడ, సామర్లకోట మీదుగా పుదుచ్చేరి ప్రాంతానికి ఏకైక ఎక్స్‌ప్రెస్ రైలుగా సర్కార్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే కావడం విశేషం.