Share News

ఇసుక, మట్టి తవ్వకాలకు బ్రేక్‌ పడిందా?

ABN , Publish Date - May 17 , 2024 | 11:24 PM

గతేడాది గోదావరి వరదలు, వర్షాలు ముగియగానే గోదావరి నదీ తీర ప్రాంతాల్లో మొదలైన ఇసుక, మట్టి తవ్వకాలు ఇప్పటివరకు బ్రేక్‌లు లేకుండా కొనసాగాయి.

ఇసుక, మట్టి తవ్వకాలకు బ్రేక్‌ పడిందా?

గోదావరి తీర ప్రాంతాలను గుల్ల చేసిన మట్టి, ఇసుక మాఫియా

తవ్వకాలకు అడ్డంకిగా మారిన వరుణుడు

కన్నెత్తి చూడని అధికారులు

పి.గన్నవరం, మే 17: గతేడాది గోదావరి వరదలు, వర్షాలు ముగియగానే గోదావరి నదీ తీర ప్రాంతాల్లో మొదలైన ఇసుక, మట్టి తవ్వకాలు ఇప్పటివరకు బ్రేక్‌లు లేకుండా కొనసాగాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం యథేచ్ఛగా మట్టి, ఇసుక తవ్వకాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం కోర్టు తీర్పు అనుసరించి అక్రమ తవ్వకాలకు బ్రేక్‌ పడనుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాహనాలు తిరగడానికి అనుకూలంగా లేకపోవడంతో మాత్రమే తవ్వకాలకు బ్రేక్‌ పడినట్లు తెలిసింది. కొన్ని ర్యాంపుల్లో మళ్లీ బాటలను సైతం మాఫీయా ప్రతినిధులు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలావుండగా పి.గన్నవరం మండలానికి సంబంధించి ఉడిమూడి లంకలో ఒక మట్టి ర్యాంపు, మానేపల్లిలో ఐదు మట్టి ర్యాంపులు, ఒక ఇసుక ర్యాంపు నడుస్తున్నాయి. ఈ ర్యాంపుల్లో మూడు మట్టి ర్యాంపులు గత కొన్నినెలలుగా నడుస్తున్నప్పటికీ ఇటీవలే మరికొన్ని మట్టి ర్యాంపులు తెరమీదకు వచ్చాయి. పట్టా భూములు, పెరుగులంకల్లో రైతులకు కాసులు ఎరచూపి మట్టి మాఫియా జోరుగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార వైసీపీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్న మట్టి, ఇసుక ర్యాంపులకు ఉన్నతాధికారులు సైతం వంతపాడటంతో క్షేత్రస్థాయుులో కనీసం నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరిపి తీర ప్రాంతాలను గుల్ల చేశారు. స్థానికులు ఫిర్యాదులు చేసినప్పటికీ నామమాత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకుంటున్నారు. రోడ్డుపై ఇసుక, మట్టితో భారీ వాహనాల రాకపోకలు సాగిస్తున్నప్పటికీ కనీసం పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణ చేయకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఎన్నికల పోలింగ్‌రోజు మాత్రమే తవ్వకాలు నిలిపివేశారని అనంత రం తవ్వకాలు ప్రారంభమై ఇటీవలే వర్షం పడటంతో ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్‌ వేశారని స్థానిక ప్రజానీకం చెప్పుకుంటున్నారు.

రు.

Updated Date - May 17 , 2024 | 11:24 PM