Share News

ఈ రహదారులకు మోక్షమెప్పుడో...!

ABN , Publish Date - May 26 , 2024 | 11:59 PM

ప్రభుత్వాలు మారుతున్నా ఆధ్వాన రహదారులకు మో క్షం లభించడంలేదు. మండలంలోని పలు రహదారులను పాలకులు పట్టించుకోకపోవడంతో నేటికీ ఆఽధ్వానస్థితిలో ఉన్నాయి.

ఈ రహదారులకు మోక్షమెప్పుడో...!

అభివృద్ధికి నోచుకోని ప్రధాన రహదారులు

ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు

అంబాజీపేట, మే 26: ప్రభుత్వాలు మారుతున్నా ఆధ్వాన రహదారులకు మో క్షం లభించడంలేదు. మండలంలోని పలు రహదారులను పాలకులు పట్టించుకోకపోవడంతో నేటికీ ఆఽధ్వానస్థితిలో ఉన్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఇసుకపూడి, చిరతపూడి, పసుపల్లి, గంగలకుర్రు అగ్రహారం ప్రధాన రహదారులు ఏళ్ల తరబడి ఆధ్వానంగా ఉన్నా ప్రజాప్రతి నిధులు పట్టించుకోవడం లేదు. పసుపల్లి గ్రామంలో టీడీపీ హాయాంలో నిధులు మంజూరై అప్పటి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో నిధులు లేక పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఆ రహదారిపై ప్రయా ణించా లంటే ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. మాచవరం పంచాయతీ పరిధిలోని కోఠివారి అగ్రహారానికివెళ్లే రహదారి రాళ్లు లేచి ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. నిత్యం వందలాది మంది ప్రజలు ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారు. ఏళ్ల తరబడి రహదారి ఆధ్వానంగా ఉన్నా ఈ రహదారిని పట్టించుకొనే నాథుడే కరవయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగలకుర్రు అగ్రహారం పరిధిలోని పీర్మాయిపాలెం వద్ద ఉన్న రహదారిని ఏ శాఖతో తెలియక ఏళ్ల తరబడి అస్తవ్యస్తంగా మారింది. ఈ రహదారి ఆర్‌అండ్‌బీ శాఖకు చెందినదా.. పంచాయతీరాజ్‌ శాఖదో తెలియక ఈ రహదారికి సుమారు ఇరవై ఏళ్ల నుంచి మంజూరు కావడంలేదు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులకు గ్రామస్థులు తెలియజేసినా త్వరలో నిధులు మంజూరు చేస్తామని అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. వర్షాకాలంలో ఇటువైపు ప్రయాణించాలంటే చాలాకష్టంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి అధ్వాన రహదారులకు నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

సన్నవిల్లి-ఉప్పూడి రహదారిపై నరకయాతన

ఉప్పలగుప్తం, మే 26: సన్నవిల్లి-ఉప్పూడి ప్రధాన రహదారిపై ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. స్వల్ప వర్షానికే రహదారి కాల్వలా మారి వాహనచోదకులు ఇక్కట్లు పడుతున్నారు. పదేళ్ల క్రితం టీడీపీ హయాంలో సన్నవిల్లి నుంచి కాట్రేనికోన మండలం ఉప్పూడి వరకు 6.500 కి.మీ రహదారిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. వైసీపీ పాలనలో మిగిలిన రహదారుల మాదిరిగానే ఈ రహదారీ నిర్లక్ష్యానికి గురైంది. కనీస నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో శిథిలస్థితికి చేరింది. కాట్రేనికోన మండలం లోని శివారు గ్రామాలతో పాటు మండలంలోని చినగాడవిల్లి, పెదగాడవిల్లి, మునిపల్లి, సన్నవిల్లి, లక్ష్మివాడ ప్రజలు జిల్లా కేంద్రమైన అమలాపురం వెళ్లడానికి ఈ రహదారే శరణ్యం. దీనిని ఆధునికీకరించాలని మూడేళ్లుగా ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.

ఆధ్వాన స్థితిలో రహదారులు

అల్లవరం, మే 26: మండలంలోని పలు రహదారులు కుంగిపోయి గోతులతో అధ్వానంగా మారాయి. ఆయా మార్గాల్లో వాహనచోదకులు ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. తాడికోన వంతెన నుంచి డి.రావులపాలెం వెళ్లే డ్రెయిన్‌ గట్టు రహదారి రెండు కిలోమీటర్ల పొడవున దిగబడి ప్రమాదభరితంగా మారింది. అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు. అల్లవరం గుడ్డివానిచింత నుంచి దేవగుప్తం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేశారు. దీంతో రాళ్లులేచి గోతులతో వాహనాలు వెళ్లలేని స్థితి నెలకొంది. తరుచూ వాహన ప్రమాదాలు తప్పడం లేదు. బెండమూర్లంక నుంచి ఓడలరేవు రహదారి పనులను స్థల వివాదంతో ఓడలరేవు వద్ద మధ్యలో ఆపివేశారు. రోడ్డుపక్కన మార్జిన్‌ స్థలం తమదంటూ కొందరు ఆటంకాలు కల్పిస్తున్నారు. తూర్పులంక నుంచి అల్లవరం వెళ్లే రహదారి పనులను కూడా వివిధ కారణాలతో నిలిపివేశారు.

Updated Date - May 26 , 2024 | 11:59 PM