Share News

రోడ్డుకు గండి

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:47 AM

వైసీపీ సగం..సగం పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ,సీతానగరం మండలాలను కలిపే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారికి మునగాల వద్ద ఆదివారం గండిపడింది.

రోడ్డుకు గండి
కోరుకొండ- ముగ్గళ్ల ఆర్‌అండ్‌బీ రహదారిపై మునగాల వద్ద పడ్డ గండి

రెండేళ్లుగా సాగుతున్న రోడ్డు పనులు

నేటికీ పూర్తికాలేదు.. కొట్టుకుపోయిన రోడ్డు

10 గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్‌

కోరుకొండ, జూలై 14 : వైసీపీ సగం..సగం పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ,సీతానగరం మండలాలను కలిపే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారికి మునగాల వద్ద ఆదివారం గండిపడింది. దీని కారణంగా 10 గ్రామాల ప్రజానీకం రాకపోకలు నిలిచిపోయాయి. కోరుకొండ, ముగ్గళ్ళ ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణానికి సుమారు మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే రెండేళ్ల కిందటే రోడ్డు పనులు ప్రారంభమైనప్పటికీ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు నేటికి పూర్తి కాలేదు. ఈ రోడ్డుపై కొన్ని కల్వర్టులు, వంతెనలు నిర్మించాల్సి ఉంది. వంతెన నిర్మాణానికి సంబంధించి కాపవరం-మునగాల గ్రామాల మధ్య తోట కాలువ వద్ద కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఈ పనులకు ఇక్కడ రోడ్డు డైవర్షన్‌ ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతా రాహిత్యం వల్ల పనులు సకాలంలో పూర్తి కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీరు తోట కాలువ మీదుగా వచ్చి గోదావరికి చేరే సందర్భంలో కల్వర్టు నిర్మాణం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్‌ రోడ్డు గండిపడి కొట్టుకుపోయింది. సీతానగరం, కోరుకొండ మండలాలకు చెందిన సుమారు 10 గ్రా మాల ప్రజలకు ఇబ్బంది కలిగింది.ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రయాణీకులను శ్రీరంగపట్నం మీదుగా వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. కోరుకొండ, కాపవరం,మునగాల, కూనవరం, ముగళ్ళ, ఇనిగంటివారిపేట, రఘుదేవపురం, సీతానగరం గ్రామాల ప్రజలు గండిని పూడ్చాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా గండిని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదివారం పరిశీలించి మునగాల గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.తక్షణం ఆర్‌అండ్‌బీ అధికారులతో గండిపూడ్చే విషయంపై చర్చించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం రోడ్డుకు గండిపడిందన్నారు. త్వరితగతిన కోరుకొండ, ముగ్గళ్ల రహదారి గండి పూడ్చే ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు ఎస్‌బీవీ.రెడ్డి, వీవీ మధుసూధన్‌లకు సూచించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు మాట్లాడుతూ కోరుకొండ ముగ్గళ్ళ రహదారిలోని మునగాల సమీపంలో తోటకాలువ వద్ద మైనర్‌ వంతెన (కల్వర్టు) నిర్మాణంలో ఉన్న దృష్ట్యా గతంలో తాత్కాలిక రహదారి మార్గం ఏర్పాటు చేశామని, అక్కడ పైపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల పై నుంచి వరద నీరు వచ్చి గండిపడిందన్నారు.తక్షణం పనులు చేపట్టి వేగవంతంచేస్తామన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:47 AM