Share News

తిరిగి వెళ్లేందుకు అవస్థలు

ABN , Publish Date - May 15 , 2024 | 01:49 AM

ఓటు వేసేందుకు ఉత్సాహంగా స్వస్థలాలకు తరలివచ్చిన ఓటర్లకు తిరిగి వెళ్లేందుకు చుక్కలు కనిపిస్తున్నా యి.

తిరిగి వెళ్లేందుకు అవస్థలు

సరిపడా బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ.. రైళ్లు ఫుల్‌.. ప్రైవేటు బస్సులు చార్జీల బాదుడు.. ఓటర్ల అగచాట్లు

పిఠాపురం,మే14: ఓటు వేసేందుకు ఉత్సాహంగా స్వస్థలాలకు తరలివచ్చిన ఓటర్లకు తిరిగి వెళ్లేందుకు చుక్కలు కనిపిస్తున్నా యి. రైళ్లలో రిజర్వేషన్లు అన్నీ ఫుల్‌ అయ్యాయి. ఆర్టీసీ సరిపడా బస్సులు ఏర్పాటుచేయడంలో విఫలమైంది. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఏకంగా 200శాతంపైగా పెరిగాయి. విమాన చార్జీల్లో ఆకాశమే హద్దుగా పెరుగుదల కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటువేసేందుకు గతంలో ఎన్నడూలేనివిధంగా భారీగా ఓటర్లు తమ స్వస్థలాలకు తరలివచ్చారు. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, పూణే తదితర నగరాలతోపాటు పలు రాష్ట్రాల్లో వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలరీత్యా ఉంటున్న వారంతా ఓటు వేయాలనే ఉత్సాహంగా భారీగా పోటె త్తారు. సోమవారం పోలింగ్‌ కావడం, శని, ఆదివారాలు సెలవు లురావడంతో ఓటు వేయడంతోపాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో గడిపే అవకాశం ఉంటుందనే భావనతో జిల్లాకు వ చ్చారు. ఒక్క కాకినాడ జిల్లాకే సుమారు లక్షమంది ఓటుహక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చినట్టు అంచనా. అయితే ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి వెళ్లదామనుకున్న వారికి షాక్‌ తగిలింది. రైళ్లల్లో రిజర్వేషన్లన్నీ ఫుల్‌ అయ్యాయి. బస్సులు, విమాన చార్జీలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి.

ఏ ట్రైన్‌ ఖాళీ లేదు

కాకినాడ జిల్లాలోని తుని, అన్నవరం, పిఠాపురం, కాకినాడ, సామర్లకోట తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌, బెంగళూ రు, చెన్నై వెళ్లే రైళ్లలో రిజర్వేషన్‌లు పూర్తికావడంతోపాటు రిగ్రెట్‌ వస్తోంది. మంగళవారంతోపాటు బుధ, గురువారాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గౌతమి, గోదావరి, విశాఖ, ఏసీ స్పెషల్‌, నాం థేడ్‌ స్పెషల్‌, కోణార్క్‌, జన్మభూమి, ఎల్‌టీటీ, వందేభారత్‌, గరీబ్‌రథ్‌, ఫలక్‌నామా సహా అన్ని రైళ్లలో ఇదే పరిస్థితి. రైల్వేశాఖ పలు స్పెషల్స్‌ రన్‌ చేస్తున్నా రిజర్వేషన్‌ దొరకని స్థితి నెలకొంది.

ఆర్టీసీదీ అదే దారి

ఆర్టీసీ బస్సులన్నీ తిరిగి వెళ్లేవారితో నిండుగా ప్రయాణిస్తున్నాయి. స్వస్థలాలకు వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీవారు తిరిగి హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు నడపడంలో విఫలమైంది. దీంతో ప్రైవేటు బస్సులపై ఆధారపడాల్సి వచ్చింది. దీనివల్ల బస్సు చార్జీలను పెంచేశారు. సాధారణంగా వెయ్యి రూపాయలు ఉండే హైదరాబాద్‌ చార్జీ ఇప్పుడు రూ.2 వేల నుంచి రూ.3,500 వరకూ ఉంది. అయినా కూడా టిక్కెట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు.

ఆకాశంలో విమాన చార్జీలు

విమానచార్జీలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో విమాన చార్జీ గరిష్ఠంగా రూ.3,500 ఉంటుంది. మంగళవారం టిక్కెట్టు ధర రూ.14,500కు చేరుకుంది. బుధవారం కూడా టిక్కెట్టు ధర రూ.8 వేల నుంచి రూ.11వేల మధ్యలో ఉంది. అటు బస్సులు, రైళ్లు దొరకక, ఇటు విమానచార్జీలు, ప్రైవేటు బస్సు చార్జీలు పెరిగిపోవడంతో కొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోగా, కొందరు తప్పని పరిస్థితుల్లో అధిక రేట్లకు కొని వెళుతున్నారు.

Updated Date - May 15 , 2024 | 08:02 AM