రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:23 AM
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ రీజనల్ ఎస్పీ కేఎస్‌ఎస్వీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు ఆలమూరులో మంగళవారం తనిఖీలు చేపట్టారు. కల్యాణ చక్రవర్తి వే బ్రిడ్జి సమీపంలో అశోక్ లేలాండ్ లారీని రాజమహేంద్రవరం విజిలెన్స్ సీఐ టి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీ చేశారు.

అమలాపురం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి)/ఆలమూరు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ రీజనల్ ఎస్పీ కేఎస్‌ఎస్వీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు ఆలమూరులో మంగళవారం తనిఖీలు చేపట్టారు. కల్యాణ చక్రవర్తి వే బ్రిడ్జి సమీపంలో అశోక్ లేలాండ్ లారీని రాజమహేంద్రవరం విజిలెన్స్ సీఐ టి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీ చేశారు. 460 తెలుపు రంగు ప్లాస్టిక్ బస్తాలు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు చెందిన 40 గోనె సంచులు... మొత్తం 500 బస్తాల్లో సుమారు 25 వేల కిలోల పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్టు గుర్తించారు. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన శ్రీగౌతమి రైస్ అండ్ ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమాని గొట్టెపు రమేష్‌బాబు నుంచి పీడీఎస్ బియ్యాన్ని కాకినాడకు చెందిన వి.శ్రీనివాసరావుకు సరఫరా చేస్తున్నట్టు డ్రైవర్ పెద్దిరెడ్డి రాజేష్ అధికారులకు తెలిపారు. సుమారు రూ.21.37 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం, వాహనాన్ని సీజ్ చేసి 6(ఎ) కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు కోసం పోలీస్‌స్టేషన్‌కు సిఫార్సు చేసినట్టు అధికారులు తెలిపారు. బియ్యాన్ని ఆలమూరు ఎంఎస్‌వోకు అప్పగించగా మండపేట ప్రభుత్వ గోదాముకు తరలించారు. లారీని ఆలమూరు పోలీసులకు అప్పగించారు. ఆలమూరు ఎస్‌ఐ శ్రీను నాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు శ్రీనివాసరెడ్డి, భార్గవమహేష్, అలీషా, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు పాల్గొన్నారు.