Share News

అమలాపురంలో రైతుబజార్‌ పునఃప్రారంభానికి చర్యలు

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:59 PM

జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉన్న రైతు బజార్‌ను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి వెల్లడించారు. రైతు బజార్‌ ప్రాంగణంలో శనివారం రైతులతో అవగాహన సదస్సును నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన రైతులతో పాటు ఉద్యాన, మార్కెటింగ్‌, మత్స్యశాఖల అధికారులు సదస్సులో పాల్గొన్నారు.

అమలాపురంలో రైతుబజార్‌ పునఃప్రారంభానికి చర్యలు

అమలాపురం టౌన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉన్న రైతు బజార్‌ను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి వెల్లడించారు. రైతు బజార్‌ ప్రాంగణంలో శనివారం రైతులతో అవగాహన సదస్సును నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన రైతులతో పాటు ఉద్యాన, మార్కెటింగ్‌, మత్స్యశాఖల అధికారులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆర్టీసీ బస్టాండు ఎదురుగా మార్కెటింగ్‌ శాఖ ఆద్వర్యంలో ఉన్న రైతు బజార్‌ వివిధ కారణాలతో పూర్తిస్తాయిలో నిర్వహణ జరగడం లేదని గుర్తించి పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌, సహకార, మత్స్యశాఖల మంత్రి కె.అచ్చెన్నాయుడు జిల్లా సమీక్షలో రైతు బజార్ల అంశాన్ని ప్రస్తావించారన్నారు. జిల్లాకు సంబంధించి అమలాపురం, రాయవరం రైతుబజార్ల సమస్యలపై చర్చించిన అనంతరం పునఃప్రారంభానికి చర్యలు చేపట్టినట్టు జేసీ వెల్లడించారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు రైతుబజార్‌ నిర్వహణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యానశాఖ అధికారులు గ్రామాల్లోని కూరగాయలు పండించే రైతులను గుర్తించి దరఖాస్తులు అందజేయడంతో పాటు పండించిన పంటను నేరుగా రైతులు రైతు బజార్లకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే విక్రయాలు జరుపుకునే విధంగా చైతన్య పరచాలని ఆదేశించారు. దళారీ వ్యవస్థను పూర్తిగా లేకుండాచేసి రైతుబజార్‌ నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు తాజాగా లభ్యమయ్యేలా చూడడంతో పాటు చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సంఘటితంగా మూడు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలుదారుల సౌలభ్యం కోసం క్యాంటీను ఏర్పాటు చేయాలన్నారు. రోజువారీ వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలిస్తూ పారిశుధ్య చర్యలను పురపాలక సంఘం చేపట్టాలన్నారు. ఆర్టీసీ సంస్థ రైతులు పండించిన పంటలను నేరుగా రైతు బజార్‌కు తీసుకువచ్చేలా ఉదయం నుంచి బస్సులు నడపాలని, కనీస చార్జీలు వసూలు చేయాలని జేసీ సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో కె.మాధవి, జిల్లా ఉద్యానశాఖ అధికారి బీవీ రమణ, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్‌.శ్రీనివాసరావు, మార్కెటింగ్‌శాఖ అధికారి కె.విశాలాక్ష్మి, ఉద్యానశాఖ సిబ్బంది, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:00 AM