Share News

రైల్వే ఎలైన్‌మెంట్‌పై వాడివేడిగా చర్చ

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:28 AM

కోనసీమ రైల్వేలైన్‌ ఎలైన్‌మెంట్‌ మార్పుచేస్తూ తీర్మానం చేసే అధికారం మున్సిపల్‌ కౌన్సిల్‌కు ఉందా అని అధికార పక్ష కౌన్సిలర్‌ సంసాని వెంకటచంద్రశేఖర్‌ ప్రశ్నించారు. కౌన్సిల్‌ చేసిన తీర్మానంతో ఎవరైనా కోర్టుకు వెళ్తే రైల్వేలైన్‌ నిర్మాణ పనులు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు.

రైల్వే ఎలైన్‌మెంట్‌పై వాడివేడిగా చర్చ

అమలాపురం టౌన్‌, జూలై 27: కోనసీమ రైల్వేలైన్‌ ఎలైన్‌మెంట్‌ మార్పుచేస్తూ తీర్మానం చేసే అధికారం మున్సిపల్‌ కౌన్సిల్‌కు ఉందా అని అధికార పక్ష కౌన్సిలర్‌ సంసాని వెంకటచంద్రశేఖర్‌ ప్రశ్నించారు. కౌన్సిల్‌ చేసిన తీర్మానంతో ఎవరైనా కోర్టుకు వెళ్తే రైల్వేలైన్‌ నిర్మాణ పనులు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఒకసారి కేంద్రస్థాయిలో డీపీఆర్‌ పూర్తయిన తర్వాత ఎలైన్‌మెంట్‌ మార్పు చేయడంలో ఆంతర్యం ఏమిటని సభ్యులు ప్రశ్నించారు. అమలాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం శనివారం చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రైల్వే లైన్‌ ఎలైన్‌మెంట్‌ అంశాన్ని లేవనెత్తారు. అమలాపురం పట్టణానికి తూర్పు ప్రాంతంలో ఉన్న కొందరు అభ్యంతరాలు తెలుపుతూ లేఖ ఇచ్చారు సరే రేపు పశ్చిమవైపు రైతులు, ప్రజలు అలాగే లేఖ ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయిందని, దాన్ని కాదని మాగాం, బండారులంక, పేరూరు మీదుగా రైల్వేలైన్‌ వెళ్తే పట్టణాభివృద్ధికి ఎటువంటి నష్టం ఉండదని పేర్కొనడంలో అర్థం లేదని పలువురు సభ్యులు వాదించారు. అమలాపురం మండలపరిషత్‌ పరిధిలోని తీర్మానాన్ని మున్సిపల్‌ కౌన్సిల్‌కు తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్‌ అబ్బిరెడ్డి చంటి మాట్లాడుతూ భవిష్యత్తులో అమలాపురం కార్పొరేషన్‌గా మారుతుందన్న కారణంగానే రైల్వేలైన్‌ ఎలైన్‌మెంట్‌ను మార్పు చేయమని కోరామన్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇచ్చిన లేఖను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపించేందుకు కౌన్సిల్‌ నిర్ణయించింది బ్లీచింగ్‌, ఆలం, శానిటరీ సామగ్రి, ఎలక్ర్టికల్‌ మెటీరియల్‌ను లక్షలాది రూపాయలు వెచ్చించి ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారని కౌన్సిలర్‌ మట్టపర్తి నాగేంద్ర ఆరోపించారు. మెటీరియల్‌ను కౌన్సిలర్లకు చూపించాలని ఎన్నిసార్లు కోరినా ఎందుకు చూపించడంలేదని ప్రశ్నించారు. దీనిపై కమిటీ వేయాలని కౌన్సిలర్‌ చంటి కోరడంతో అసలు పురపాలక సంఘంలో స్టాండింగ్‌ కౌన్సిల్‌ కమిటీలు ఎందుకు వేయడంలేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్‌ను ప్రాసిక్యూట్‌ చేసేవిధంగా కౌన్సిల్‌ తీర్మానం చేయాలని కోరారు. కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ మాట్లాడుతూ స్టాండింగ్‌ కమిటీలు ఎవరు ఏర్పాటు చేయాలో స్పష్టంచేస్తూ నోట్‌ఫైల్‌ను వారం రోజుల్లో పంపిస్తానని సమావేశం దృష్టికి తెచ్చారు. 5వ వార్డులో వాటరు పైపులైను వేయకుండా వేసినట్టు నివేదికలు ఇస్తున్నారని, అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో చేయని పనులు చేసినట్టు, చేసిన పనులు చేయనట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తున్న వ్యవహారాలపై కౌన్సిలర్లు బొర్రా చిట్టిబాబు, గొవ్వాల రాజేష్‌, సాంసాని బులినాని ప్రశ్నించారు. సంబంధిత ఫైళ్లను సమావేశంలో చూపించాలని పట్టుబట్టారు. ఎంబుక్‌లు కాంట్రాక్టరు వద్దే ఉంటున్నాయని, అధికారుల బీరువా తాళాలు సైతం వారివద్దే ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. నోట్‌ ఫైల్స్‌ కనిపించని తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులతో డిసిప్లినరీ యాక్షన్‌ తీసుకుంటామని కమిషనర్‌ పేర్కొన్నారు. ‘పురపాలక సంఘంలో గతంలో మంజూరు చేసిన రూ.2 కోట్ల పనులు ఇంతవరకు పూర్తికాలేదు. ఇప్పుడు మరో రూ.2 కోట్లతో పనులు ప్రతిపాదిస్తున్నారు. అసలు పురపాలక సంఘంలో ఎంతమేర బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి’ అని సభ్యులు ప్రశ్నించారు. కమిషనర్‌ మనోహర్‌ మాట్లాడుతూ రూ.9 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని, ప్రస్తుతం పురపాలక సంఘంలో రూ.6 కోట్లు నిధులు ఉన్నాయని అందుకే నోట్‌ ఫైల్‌లో నిధుల కొరత విషయాన్ని ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. పురపాలక సంఘంలో టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు అస్తవ్యస్తంగా ఉన్నాయని కౌన్సిలర్‌ పిండి అమరావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సైనికులకు ఇంటి పన్నులు మినహాయిస్తూ ప్రభుత్వం జీవో నంబరు 83 విడుదల చేసిందని, 41 నెలలుగా ఏ ఒక్క మాజీ సైనికుడికైనా ఇంటిపన్ను మినహాయించారా అని కౌన్సిలర్‌ తిక్కా సత్యవతి ప్రశ్నించారు. టిడ్కో భవనాల్లో లోటుపాట్లను ఎందుకు సరిదిద్దడంలేదని, అప్పట్లో రూ.లక్ష చొప్పున చెల్లించిన వారికి ఇంత వరకు ఆ మొత్తాలను ఎందుకు చెల్లించలేదని, అసలు టిడ్కో భవనాలు పొందినవారు ఉంటున్నారా, అద్దెకు ఇచ్చేశారా అంటూ సభ్యులు యేడిద శ్రీను తదితరులు ప్రశ్నించారు. 10వ వార్డులో అనధికార లేఅవుట్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కౌన్సిలర్‌ కొల్లాటి దుర్గాబాయి ప్రశ్నించారు. కుక్కల స్వైరవిహారం, రోడ్లపై పశువుల సంచారం. వాటర్‌ పైపులైన్ల అంశాలపై సభ్యులు బండారు గోవిందు, వాసర్ల లక్ష్మి, గండి దేవిహారిక ప్రశ్నించారు. కౌన్సిల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా తొలిసారి సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ను అధికార, విపక్ష కౌన్సిలర్లు, అధికారులు సత్కరించారు.

Updated Date - Jul 28 , 2024 | 12:28 AM