Share News

వేదఘోషతో పులకించిన సత్యదేవుడి సన్నిధి

ABN , Publish Date - May 22 , 2024 | 01:08 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి మంగళవారం వేదఘోషతో పులకించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేదాలలో నిష్ణాతులైన పండితులు తమ వేదవిద్యను స్వామివారి పాదాలచెంత ఉంచి పునీతులయ్యారు.

వేదఘోషతో పులకించిన సత్యదేవుడి సన్నిధి

ఘనంగా పండిత సదస్యం

సుమారు 100 మంది పండితులకు సత్కారం

అన్నవరం, మే 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి మంగళవారం వేదఘోషతో పులకించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేదాలలో నిష్ణాతులైన పండితులు తమ వేదవిద్యను స్వామివారి పాదాలచెంత ఉంచి పునీతులయ్యారు. స్వామివారి దివ్యకల్యాణోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం పండిత సదస్యం అత్యంత ఘనంగా జరిగింది. మధ్యా హ్నం 3గంటలకు నవవధూవరులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అనివేటి మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై ఆశీనులు గావించి మరో వేదికపై క్షేత్రపాలకులు సీతారాములను ఉంచి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా పండితులంతా తమ పాండిత్యంతో మైమరిపింపచేశారు. అనంతరం రాష్ట్రం నలుమాలల నుంచి విచ్చేసిన సుమారు 100మంది పండితులను పూలమాలలు, దుశ్శాలువా కప్పి, విసినకర్రను అందజేసి నగదు పురస్కారాలను ఈవో రామచంద్రమోహన్‌, చైర్మన్‌ రోహిత్‌లు అందజేశారు. కార్యక్రమం అనంతరం పండితులంతా నవ దంపతుకు వేదాశీర్వచనాలు అందజేశారు.

Updated Date - May 22 , 2024 | 07:33 AM