Share News

సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:38 AM

ఏలూరు రేంజ్‌లో సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు శాంతిభద్రతల ప్రత్యేక అధికారి, ఎస్‌ఈబీ ఐజీ ఎం.రవిప్రకాష్‌ తెలిపారు. ఏలూరు రేంజ్‌లో కోనసీమలో అల్లర్లతో నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు

సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

అల్లర్లలో కోనసీమ నంబరు వన్‌

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

అల్లర్ల అణచివేతకు క్యూఆర్టీ బృందాలు

ఎస్‌ఈబీ ఐజీ రవిప్రకాష్‌

అమలాపురం టౌన్‌, జూన్‌ 1: ఏలూరు రేంజ్‌లో సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు శాంతిభద్రతల ప్రత్యేక అధికారి, ఎస్‌ఈబీ ఐజీ ఎం.రవిప్రకాష్‌ తెలిపారు. ఏలూరు రేంజ్‌లో కోనసీమలో అల్లర్లతో నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, నూజివీడు, కృష్ణాజిల్లాలోని గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాలను సెన్సిటివ్‌ నియోజకవర్గాలుగా గుర్తించామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌తో కలిసి శనివారం ఐజీ రవిప్రకాష్‌ విలేఖరులతో మాట్లాడారు. ఏలూరు రేంజ్‌లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలతో పాటు ఎక్కడా అల్లర్లు జరగకుండా క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌(క్యూఆర్టీ)లను ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్‌ లోకేషన్స్‌ ఫీడ్‌చేసి క్యూఆర్టీ బృందాలకు అందించామన్నారు. ఒక్కో బృందానికి 5 నుంచి 15 గ్రామాల బాధ్యతను అప్పగించాం. ఎక్కడైనా గొడవ జరిగితే ఐదారు నిమిషాల వ్యవధిలోనే క్యూఆర్టీ బృందాలు అక్కడకు చేరుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్‌ఐ, సీఐల ఆధీనంలో క్యూఆర్టీ టీములను ఏర్పాటు చేశామన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశాం. ఇప్పటికే సెక్షన్‌ 30తో పాటు 144 సెక్షన్‌ అమలులో ఉందని వివరించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని రేంజ్‌లో గతంలో ఆయా ప్రాంతాల్లో పనిచేసిన పోలీసు అధికారులను శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నియమించామన్నారు. వీరితోపాటు పారా మిలటరీ, ఏపీ ఎస్పీ ఇతర బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోలీసులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉండడం పట్ల గర్వపడుతున్నామన్నారు. హింసకు పాల్పడడంవల్ల ప్రజలే నష్టపోతారన్నారు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే కోర్టులు, పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ప్రజలు కూడా బాధ్యత వహించి పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. ఇప్పటికే ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందని, ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి ప్రజలు కులాల పేరిట, వర్గాల పేరిట కొట్టుకోవడం తగదని హితవు పలికారు. డీజీపీ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌ పార్టీలతో పాటు స్ర్టైకింగ్‌ ఫోర్సులు, పోలీసు పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద జిల్లా ఎస్పీ శాంతిభద్రతల పరిరక్షకులుగా ఉంటారన్నారు. లెక్కింపు సమయంలో గెలుపు ఓటముల ప్రభావం గ్రామాల్లో పడే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టేందుకు క్యూఆర్టీ బృందాలు సిద్ధంగా ఉన్నట్టు ఐజీ వివరించారు.

Updated Date - Jun 02 , 2024 | 08:38 AM