Share News

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:09 AM

రాబోయే సాధారణ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల విషయంలో ఇప్పటి నుంచీ అధికారులు దృష్టి సారించారు. రెవెన్యూ-పోలీసు శాఖలు ఈ మేరకు సమీక్షలు నిర్వహించుకుని అత్యంత సమస్యాత్మకంగా, మావోయిస్టుల దుశ్చర్యలకు అనుకూలంగా ఉన్న మూడు పోలింగ్‌ కేంద్రాలను రంపచోడవరం సెగ్మెంట్లో గుర్తించారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి

  • రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న రంప సబ్‌కలెక్టర్‌

రంపచోడవరం, ఫిబ్రవరి 24: రాబోయే సాధారణ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల విషయంలో ఇప్పటి నుంచీ అధికారులు దృష్టి సారించారు. రెవెన్యూ-పోలీసు శాఖలు ఈ మేరకు సమీక్షలు నిర్వహించుకుని అత్యంత సమస్యాత్మకంగా, మావోయిస్టుల దుశ్చర్యలకు అనుకూలంగా ఉన్న మూడు పోలింగ్‌ కేంద్రాలను రంపచోడవరం సెగ్మెంట్లో గుర్తించారు. ఈ మేరకు రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ ప్రశాంతకుమార్‌ శనివారం తన కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల విషయంలో చర్చించారు. మావోయిస్టుల కారణంగా అత్యంత సమస్యాత్మకంగా వై.రామవరం మండలం బొడ్డగండి, చింతూరు మండలం పారకొండ, సుద్దగూడెం పోలింగ్‌ కేంద్రాలు గుర్తించారు. ఈ కేంద్రాలలో ఎన్నిక లు నిర్వహించడం భారీ బందోబస్తు చర్యలతో కూడుకున్నది కావడం, అక్కడి నుంచి బ్యాలెట్‌ యంత్రాలను తరలించడం వంటి అంశాలు ప్రమాదకరంగా అధికారులు గుర్తించిన విషయాన్ని సమావేశంలో చర్చించారు. ఈ నేపఽథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఇందుకు రాజకీయ పార్టీ అభిప్రాయాల మేరకు ఎన్నికల సంఘానికి నివేదిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్రాలను తరలిస్తే అక్కడి నుంచి ఓటర్లు ఆయా కేంద్రాలకు తరలివచ్చే విషయంలో రవాణా చర్యలను ఎవరు తీసుకోవాలన్న అంశం కూడా చర్చకు వచ్చింది. ఇక పోలవరం ప్రాజెక్టు కారణంగా గోదావరి తీరం నుంచి నిర్వాసితులను ఇప్పటికే తరలించడంతో కొండమొదలు తదితర ప్రాంతాలలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను కూడా తరలించే అంశాన్ని కూడా చర్చించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌, సీపీఎం తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:09 AM