Share News

ప్రత్యర్థుల ఎత్తులు ఫలించేనా గెలుపుపై ఎవరి ధీమా వారిదే

ABN , Publish Date - May 16 , 2024 | 01:43 AM

ఇటీవల జరిగిన శాసనసభా ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం జనసేన. టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేశారు.

ప్రత్యర్థుల ఎత్తులు ఫలించేనా  గెలుపుపై ఎవరి ధీమా వారిదే

దివాన్‌చెరువు/రాజానగరం మే 15: ఇటీవల జరిగిన శాసనసభా ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం జనసేన. టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేశారు. ఇదే పేరునగల ఇతర జిల్లాలకు చెందిన మరో ఇద్దరు అభ్యర్థులు అసెంబ్లీకి, ఒక అభ్యర్థి లోక్‌సభకు పోటీ చేశారు. కూటమి అభ్యర్థి బత్తులకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజుగ్లాసును పోలిన గుర్తులే మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు కేటాయించడం, ఈ ముగ్గురు అభ్యర్థుల పేర్లు ఈవీఎంలలో వరుస క్రమంలో ఉండడంతో కొంత మంది ఓటర్లు అయోమయానికి గురైనట్లు తెలుస్తోంది. ఓటర్లు చైతన్యవంతులై ఓటుహక్కు వినియోగించుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యర్థులు వేసే ఇటువంటి ఎత్తులు చిత్తుకావడం ఖాయమని కూటమి వారు అంటున్నారు. జూన్‌ నాల్గవ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలు తమ అభ్యర్థికే విజయం చేకూరు తుందన్న గట్టి విశ్వాసంతో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు పోలింగ్‌ ముగిసి ఓటరు తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఓటింగ్‌ జరిగిన తీరు చూస్తే ఓటర్లు స్పష్టతతో తీర్పు ఇచ్చారని తెలుస్తోంది. ఓటింగ్‌ లో జిల్లాలోనే రాజానగరం నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. చాలాగ్రామాలలో ఓటర్లు ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి క్యూలైన్లులో వేచి ఉండడం, పోలింగ్‌సమయం సాయంత్రం 6 గంటలు దాటినా బాగా పొద్దుపోయే వరకూ ఓపికతో వేచిఉండి ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 2,16.491 మంది ఓటర్లుకుగాను 87.53 శాతం అనగా1,89,505 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాము చాలా ఎన్నికలలో పనిచేశామని ఈవిధంగా ఓటర్లు ఓట్లు వేయడం అరుదుగా చెప్పవచ్చునని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇక గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ముందునుంచే రాత్రింబవళ్లు ప్రజలను కలుసుకొని వారి ఆశీర్వాదం అందుకు నేందుకు ప్రయత్నించిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఓట్లు లెక్కింపు కోసం ఎదురు చూస్తున్నారు. నాయకులు,కార్యకర్తలతో గెలుపు అవకాశాలపై చర్చలు సాగిస్తున్నారు.

పాతవెలుగుబందలో మళ్లీ పాత సమస్యే

రాత్రి 12 గంటల దాకా సాగిన పోలింగ్‌ ప్రక్రియ

ఓటర్ల ఇబ్బందులు పట్టని వైనం

రాజానగరం, మే 15 : సార్వత్రిక ఎన్నికల్లో ఆ గ్రామంలో ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదు. నిర్థీత సమయానికే ఓటర్లంతా పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నా ఓటు వేయడానికి మాత్రం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సిందే. ఎన్నికల సమయంలో ప్రతిసారి ఇబ్బందులు బారిన పడుతున్నా అధికారులు మాత్రం పోలింగ్‌ కేంద్రం ఏర్పాటులో పునరాలోచించడం లేదని మండలంలోని పాతవెలుగుబంద గ్రామస్ధులు వాపోతున్నారు. నియోజకవర్గంలోని 216 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం సమయానికి పూర్తవుతున్నా, అర్ధరాత్రి దాకా పోలింగ్‌ సాగడం ఇక్కడ పరిపాటిగా మారింది. గ్రామంలోని పాఠశాల భవనంలో 167 పోలింగ్‌ కేంద్రంలో 1240 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రం అనువుగా లేకపోవడం ఒక కారణమైతే, ఇరుకుగా ఉండే సందు మార్గం గుండా ఓటర్ల వెళ్లిరావాల్సి ఉండటం మరో కారణంగా చెప్పొచ్చు. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ ఇదే సమస్య ఉత్పన్నమైంది. దీంతో పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్ల తరలింపు సెక్టార్‌ మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఈపాఠశాల భవనంలో పోలింగ్‌ కేంద్రం కేటాయించవద్దని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్ధానిక నాయకులు చెబుతున్నారు. ఇదే ప్రాంగణంలో మరో భవనంలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే ఇబ్బందులు అధిగమించవచ్చని వివిధ పార్టీలకు చెందిన స్ధానిక నాయకులు భావిస్తున్నారు.

Updated Date - May 16 , 2024 | 07:44 AM