Share News

ప్రభల తీర్థం ఏర్పాట్లపై సమీక్ష

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:30 AM

కనుమ సందర్భంగా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే ప్రభల తీర్థానికి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి సూచించారు.

ప్రభల తీర్థం ఏర్పాట్లపై సమీక్ష

అంబాజీపేట, జనవరి 6: కనుమ సందర్భంగా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే ప్రభల తీర్థానికి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి సూచించారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ ఎన్‌.నాగపద్మలక్ష్మి అధ్యక్షతన శనివారం ఏకాదశ రుద్రలు ఉత్సవ కమిటీ సభ్యలు, ట్రస్ట్‌ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ఆయా గ్రామాల నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభల తీర్థంలో మొబైల్‌ టాయిలెట్స్‌, తాగునీరు, ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాలని సూచించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ తీర్ధంలో సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు, జంగిల్‌ క్లియరన్స్‌తో పాటు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే భక్తులకు వాటర్‌ ఫ్యాకెట్స్‌ అందించేందుకు ఆయా పంచాయతీల నుండి నిధులు అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ పద్మనాభం కోరారు. తీర్ధానికి తీసుకువచ్చే ప్రభలకు అడ్డువచ్చిన విద్యుత్‌ తీగలను తొలగించాలని ఆయా కమిటీ నిర్వహకులు విద్యుత్‌శాఖ డీఈ జి.అన్నవరంను కోరారు. అలాగే పారిశుద్ధ్య ఏర్పాట్లకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎంపీడీవో కె.సత్యనారాయణమూర్తికి ఆర్డీవో సూచించారు. ఈ సమావేశంలో డీఎల్‌డీవో ఎం.ప్రభాకర్‌, ఏపీడీ డి.రాంబాబు, డివిజనల్‌ వైద్యాధికారి సుమలత, ఆర్‌అండ్‌బీ డీఈ రాజేంద్ర, ఎస్‌ఐ చైతన్యకుమార్‌, ట్రస్ట్‌ చైర్మన్‌ జయంతి భాస్కరసుబ్రహ్మణ్యం, సర్పంచ్‌లు కాండ్రేగుల శ్రీనివాసరావు, దొంగ నాగేశ్వరరావు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:30 AM