Share News

తెలికచర్ల పోస్టాఫీస్‌లో స్వాహా

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:53 AM

పోస్టాఫీసుల్లో వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. స్వాహా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

తెలికచర్ల పోస్టాఫీస్‌లో స్వాహా
పాస్‌ పుస్తకాలు పరిశీలిస్తున్న పోస్టల్‌ అధికారులు

ఖాతాదారుల ఆందోళన.. తూతూమంత్రంగా విచారణ

నల్లజర్ల,ఫిబ్రవరి 6 : పోస్టాఫీసుల్లో వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. స్వాహా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. నల్లజర్ల మండలం చీపురుగూడెం పోస్టు ఆఫీసులో రూ.15 లక్షలు ప్రజల సొమ్ములు స్వాహా చేసిన పోస్టు మాస్టారు(బీపీఎం)ఇందిర సంఘటన మరువక ముందే తెలికిచర్లలో మరో ఘటన చోటు చేసుకుంది.నల్లజర్ల మండలం తెలికిచర్ల పోస్టాఫీస్‌లో ప్రజలు దాచుకున్న సొమ్ములు స్వాహా చేసినట్టు ఖాతాదారులకు అను మానం రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గత రెండు రోజులుగా తెలికిచర్ల పోస్టాఫీస్‌లో తనిఖీలు జరుగుతున్నాయి. నిడదవోల మేల్‌ వాచర్‌ సత్యనారాయణ,మరో సహయకుడు కలిసి మంగళవారం ఖాతాదారుల పాస్‌పుస్తకాలు తనిఖీ చేశారు.ఇప్పటి వరకు పోస్టు మాస్టర్‌(బీపీఎం)కన్యా కుమారి ఇంట్లో ఉన్న పోస్టు కార్యాలయాన్ని మరొక చోటికి మార్చారు. బీపీఎం సెలవుపై వెళ్లిపోవడంపై ఖాతాదారులు మరింత ఆందోళన చెందుతున్నారు.తాము దాచుకున్న సొమ్ములు ఎంత వరకు ఖాతాలో ఉన్నాయో పరిశీలించాలని పోస్టాఫీస్‌కు క్యూ కడుతున్నారు. ప్రజల సొమ్ములు లక్షల్లో స్వాహా జరిగితే మేల్‌ వాచర్ల స్థాయి అధికారులతో విచారణ చేయించడంపై ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. గతంలో చీపురుగూడెం పోస్టాఫీస్‌లో రూ.15 లక్షలు స్వాహా జరిగితే కింది స్థాయి అధికారులు తనిఖీ చేయడం ద్వారా కేవలం రూ.30 వేలు మాత్రమే ఖాతాలో జమ కాలేదని రిపోర్టు ఇచ్చారు. దీంతో ఆ ఉద్యోగి కేసు నుంచి ఇబ్బంది లేకుండా బయటపడిపోయాడు. ప్రజలు మాత్రం మోసపోయారు.దీంతో ప్రజలకు పోస్టల్‌ విచారణపై నమ్మకంపోయింది.

Updated Date - Feb 07 , 2024 | 12:53 AM