ప్రత్తిపాడులో నేడు కోటి బిల్వార్చన
ABN , Publish Date - Nov 04 , 2024 | 01:10 AM
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని మినర్వా కళాశాల సమీపంలో సోమవారం జరిపే అయ్యప్పస్వామి లక్ష దీపోత్సవాల మధ్య కోటి బిల్వార్చనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
ప్రత్తిపాడు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని మినర్వా కళాశాల సమీపంలో సోమవారం జరిపే అయ్యప్పస్వామి లక్ష దీపోత్సవాల మధ్య కోటి బిల్వార్చనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయం మాదిరిగా 8 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం లక్ష్మి గణపతి హోమంతో కోటి బిల్వార్చన పూజ లు ప్రారంభం కానున్నాయి. చండీహోమం, పూర్ణాహుతి, గురు పూజోత్సవం, సాయంత్రం ప్రత్తిపాడులో అయ్యప్పస్వామి ఊరేగింపు, అయ్యప్ప పడిపూజ, 6గంటల నుంచి కోటి బిల్వార్చన పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూజల నిమిత్తం శబరిమల సన్నిదానం నుంచి పందల రాజ్యవంశీకులు ఆలయ పూజారి మేల్ శాస్త్రి, స్వామిజీలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఇరవై అయిదు వేల మంది అయ్యప్ప భక్తులు, మరో 10 వేల మంది ప్రజలు పాల్గొనేలా మైదానాన్ని బారికేడ్లతో ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా రు. ఇందుకోసం 400 మంది మహిళా వలంటీర్లు, 200 మంది పురుష వలంటీర్లను ఏర్పాటు చేశారు. అయ్యప్పస్వామి కోటి బిల్వార్చన పూజలు నిర్వహించే ప్రాంగణాన్ని ఆదివారం సాయంత్రం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా సందర్శించారు. పూజలు నిర్వహించే యాగశాలలు, సన్నిదాన ప్రదేశాలు పరిశీలించారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.