పోలీస్ ట్రయల్స్
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:59 AM
సార్వత్రిక ఎన్నికల పండుగ ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వచ్చీ రావడంతోనే బ్యూరోక్రాట్ల ప్రక్షాళన మొదలుపెట్టింది. ఉన్నత స్థాయిలో గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగి ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసిన వారి పనిపట్టే చర్యలు వేగవంతం చేసింది.

కావాల్సిన చోట పోస్టింగ్‌కి..
ఎవరి ప్రయత్నంలో వారు..
త్వరలో బదిలీల జాతర
వైసీపీకి అంటకాగిన వారిలో దడ
అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీ
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి) సార్వత్రిక ఎన్నికల పండుగ ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వచ్చీ రావడంతోనే బ్యూరోక్రాట్ల ప్రక్షాళన మొదలుపెట్టింది. ఉన్నత స్థాయిలో గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగి ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసిన వారి పనిపట్టే చర్యలు వేగవంతం చేసింది. ముందుగా రాష్ట్ర స్థాయి అధికారులను స్థానం చలనం చేసింది. తర్వాత జిల్లా స్థాయి అధికారుల వంతు వచ్చింది. వైసీపీకి కొమ్ము కాశారనే ఆరోపణలు ఉన్న కలెక్టర్ మాధవీలతను ఇప్పటికే బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో మరికొందరు అధికారుల స్థాన చలనంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా డివిజన్, సబ్-డివిజన్ అంతకంటే తక్కువ స్థాయి అధికారుల బదిలీల జాతర మొదలుకానుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో బదిలీల విషయం త్వరలో తేలనుంది. దీంతో పోలీసు అధికారులు ‘ట్రయల్స్’ మొదలు పెట్టారు. ముఖ్యంగా ఇన్స్‌పెక్టర్లు, డీఎస్పీలు పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసుల్లో బదిలీలు జరిగాయి. వారు ఇప్పుడు తమ ‘సొంత’ గూటికి చేరుకోడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అలా వచ్చిన వారిలో మరికొందరు అదే స్థానంలో కొనసాగడానికి, ఇంకొందరు లాభసాటి స్టేషన్‌లో పోస్టింగులకు నేతల చుట్టూ దుడ్డుతో ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలోని ఎస్‌ఐ నుంచి డీఎస్పీ వరకూ బదిలీలకు సంబంధించి జాబితా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోటాలో అడిషనల్ ఎస్పీలు కూడా జిల్లాకు వచ్చారు. వీరందరూ ఎక్కడకు ఎవరు వెళ్లారో తెలియని పరిస్థితి నెల కొంది. అయితే ఎన్నికల సమయంలో ఎక్కువగా కర్నూలు, కృష్ణా తదితర జిల్లాల నుంచి తూర్పుగోదావరికి వచ్చారు. వారందరూ ఇప్పుడు వారి ప్రాంతా లకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఎన్నికల కోటాలో రావడంతో మూడు నాలు గు నెలల్లో తిరిగి వెనక్కి వెళ్లిపోతామన్న ఉద్దేశంతో కుటుంబాలను ఇక్కడికి తీసుకురాలేదు. పిల్లలను కూడా అక్కడి స్కూల్స్‌లోనే చేర్పించారు. ఇప్పుడు వారి మునుపటి ప్రదేశానికి తప్ప ఎక్కడికి బదిలీ చేసినా తిప్పలు తప్పవనే ఆందోళన నెలకొంది. ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు తమకు కావాల్సిన వాళ్లను తీసుకొచ్చుకున్నారు. అందుకు అప్పటికే ఆ స్థానంలో ఉన్న అధికారు లను వేరొకచోటికి పంపించేశారు. అలా వచ్చిన వాళ్లు ఎన్నికలో సమయంలో వైసీపీ నేతలకు తమకు తోచిన ‘సహాయం’ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అధికారులు కూడా అధికార కూటమి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. ఎన్నికల సమయంలో రాజమహేంద్రవరం రూరల్ లో ఓ పోలీస్ స్టేషన్, కొవ్వూరు రూరల్ పీఎస్‌కి వచ్చిన అధికారి, రాజమ హేంద్రవరం అర్బన్ పరిధిలోని ఓ జోన్ అధికారి వైసీపీ నేతలకు ‘బాగా’ కావాల్సిన వారనే ప్రచారం ఉంది. మరో జోన్ అధికారిపై ఎన్నికల సమయం లోనే ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. రాజమహేంద్రవరం రూర ల్‌లో ఓ ఇన్స్‌పెక్టర్ అదే పరిధిలోని మరో స్టేషన్‌లో సీటుకు ప్రయత్నించి సఫ లీకృతం వరకూ వచ్చినట్టు చెప్పుకుంటున్నారని పోలీసు వర్గాల్లో వినవస్తోంది. మరికొందరు రాబడి బాగా వచ్చే స్టేషన్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాలోని ఇసుక ర్యాంపులు, గ్రావెల్, కంకర, మట్టి వనరులు పరిధిలోకి వచ్చే స్టేషన్లు, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ పరిధిలోని స్టేషన్లలో పోస్టింగులకు ఎవరి దారిలో వారు ట్రయల్స్‌లో మునిగిపోయారు. అయితే డీఐజీగా ద్వారకా తిరుమలరావు ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. దీంతో కింది స్థాయి సిబ్బంది బదిలీలపై త్వరలోనే దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల కోటాలో వచ్చిన వాళ్ల బదిలీ తప్పదనే సాంకేతాలు వస్తున్నాయి.
మంచి అధికారులు వెళ్లిపోతే..
జిల్లాలో ఏ పార్టీకి కొమ్ముకాయకుండా ఉన్న కొందరు పోలీసుల అధికా రులు సైతం ఆందోళనలో ఉన్నారు. వైసీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా, ప్రలోభాలకు గురిచేసినా ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ నిబంధనల ప్రకారం వారు నడుచుకున్నారు. వైసీపీ నేతలు తమ వారిని సదరు సీటులో కూర్చోబెట్టుకోడానికి పక్కకు తప్పుకోమంటే తలవంచుకొని వెళ్లిన వాళ్లూ ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ ఈ తంతు నడిచింది. ఏ పార్టీ వాళ్లనూ నొప్పించకుండా జిల్లాలో ఎన్నికలు సజావుగా జరగడానికి, శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లకుండా ఉండడానికి దోహదపడ్డారు. అటు ప్రజలతో ఇటు తమ సిబ్బందితో ఇబ్బంది లేకుండా నడుచుకున్నారు. ఎలాంటి విపత్కర సందర్భం ఎదురైనా సంయమనం పాటించారు. ‘తూర్పు’ ప్రశాంతం అనే మాటను రుజువుచేశారు. అలాంటి వారిని విడుచుకోడానికి అధికార కూటమి నేతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాస్థాయిలో పోలీస్ పరంగా మంచి టీం ఉందనే ప్రశంసలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మంచి అధికారులు వెళ్లిపోతే ఎలాంటి వారు వస్తారో అనే మీమాంశ కూడా కూటమి నేతల్లో ఉంది. పైగా కొత్తగా అధికార పగ్గాలు చేపట్టారు. జిల్లా అలవాటు పడిన వాళ్లను కదుపుకొంటే ఇబ్బందులు తప్పవనే ఆలోచన ఉంది. అలాంటి అధికారులను కొత్త ప్రభుత్వం వచ్చిందనే కారణంతో బదిలీ చేస్తే అది వారిని ఇబ్బందిపెట్టే పరిస్థితి వస్తుంది. ఆయా అధికారులను పంపేస్తే వైసీపీకి కొమ్ముకాశారని, అక్రమాలకు తలొగ్గారనే అపవాదు వారిపై పడే అవకాశం ఉంది. అందువల్ల అందరినీ ఒకే గాటన కట్టడం సరికాదనే వాదన బలంగా వినవస్తోంది. అలాగే ఐదేళ్లపాటు లూప్‌లైనులో ఉన్నవారు మంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వారితో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిం చారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని వారంతా ఆశిస్తున్నారు.
కిందిస్థాయి ఎదురుచూపులు
ఎక్కడికి బదిలీ చేస్తారో.. ఏ ఊర్లో పిల్లల్ని బడిలో చేర్చాలో.. తీరా చూస్తే తరగతులు మొదలైపోయాయి.. బదిలీల విషయం ఇంకా ఏమీ తేల్చలేదు.. ఇదీ ప్రస్తుతం కొన్ని పోలీసు కుటుంబాలు అనుభవిస్తున్న మనోవేదన. ఇన్స్ పెక్టర్ నుంచి పైస్థాయి వరకూ అర్థబలంతో మేనేజ్ చేసుకొనే పరిస్థితి ఉంటుంది. కానీ, హోంగార్డు నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకూ ఆర్థికంగా సతమతమవుతూనే ఉంటారు. పోస్టింగుల కోసం చెల్లించుకొనే పరిస్థితి ఉం డదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొందరు పోలీసులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ వరకూ బదిలీ చేసే అధికారం ఎస్పీ చేతిలో ఉంటుంది. సుదీర్ఘంగా ఒకేచోట పనిచేస్తున్న ఆ సిబ్బందిని ఏడాది కిందట ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో స్థాన చలనం కలిగించారు. తర్వాత ఐదేళ్లు మించి ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న వాళ్ల బదిలీలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గత నెలలో బదిలీల కోసం కొం దరు అర్జీలు పెట్టుకున్నారు. కానీ 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైనా వాటిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెల 13 నుంచి పాఠశాలలు, కళాశాలల్లోని తరగతులు ప్రారంభమైపోయాయి. సిల బస్‌ని కూడా మొదలుపెట్టేశారు. కానీ బదిలీల విషయంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో స్కూల్‌లో ఇంకా చేర్చని పిల్లలకు సమాధానం చెప్పలేక తల్లి దండ్రులు సతమతమవుతున్నారు. ఒకవేళ బదిలీ ఆలస్యమైతే ఇప్పటికే తాము ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోని స్కూల్‌లో చేర్పించిన పిల్లలను విద్యా సంవత్సరం మధ్యలో వేరే చోటికి తరలించడం ఇబ్బందిగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కార్పొరేట్ కళాశాలల్లో చదివే పిల్లలను మధ్యలో వేరే చోటికి తీసుకెళ్తే ఫీజులు వెనక్కు తిరిగి ఇవ్వడానికి తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఒకవేళ వారి బ్రాంచి ఆ ఊర్లో ఉంటే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లే.. లేకపోతే తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో రిక్వెస్టులు పెట్టుకున్న పోలీసులు బదిలీల ఆదేశాల(డీవో) కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సుమారు 130 మంది వరకూ బదిలీకోసం వినతి సమర్పించగా.. దాదాపు 80 మంది అర్హత ఉన్న వారిగా తెలుస్తోంది. వీళ్లందరూ డీవోల కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను స్కూల్‌లో చేర్చే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పని చేసే వాళ్లు, పెద్ద వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పిల్లల చదువుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో డీవోలు తాము కోరుకున్నట్లు వస్తే ఆ సమస్య కూడా తీరుతుందని ఆశ పడుతున్నారు. అర్జీలు పెట్టుకున్న వాళ్లే కాకుండా ఐదేళ్లకు మించి ఒకేచోట పాతుకుపోయిన వాళ్లపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకచోట డీవో ఉన్నా తాము కోరుకున్న చోట ఏళ్ల తరబడి పాతుకుపోయి వాళ్లూ ఉన్నారు. ఆయా సీట్లలోకి వచ్చే అధికారులను ప్రసన్నం చేసుకొని పబ్బం గడుపుకొంటున్నారు. సదరు అధి కారులను ‘పక్కదోవ’ పట్టించడంలో కీలకంగా వ్యవహరిస్తూ అన్నీ తామై ‘చక్కబెడుతున్నారనే’ ఆరోపణలు ఉండగా, వారిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంది.