ఇంకా పంకా పోలీసు
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:35 AM
జిల్లాలోని చాలా పోలీస్ స్టేషన్లలో ఇంకా వైసీపీ వాసనే వస్తోంది.

తీరు మారని కొందరు
స్టేషన్లలో వైసీపీ వాసనే
ఆ నేతలకు తెరచాటుగా సహాయం
పోలీసు బదిలీల్లో మతలబే కారణం
బదిలీలను పునఃసమీక్షించాలని చర్చ
వారంలో పంపాలని తాజాగా ఉత్తర్వులిచ్చిన ఐజీ‘
బి క్లియర్. నేను 95 సీఎం అని చెప్పాను. మీకు ఇంకా అర్థం కాలేదు. మర్యాదగ చెబితే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్‌లోకి వస్తున్నాను. మర్యాద అయిపోయింది. ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్‌ఫుల్’.. ఓ జిల్లా స్థాయి అధికారికి సీఎం చంద్రబాబు రెండు నెలల కిందట బహిరంగ సభలో ఘాటుగా ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. ఆ ఘటన జరిగి రెండు నెలలు దాటింది. అయినా కొందరు అధికారుల్లో ‘గాలి’ తీరు మారడం లేదు. ముఖ్యంగా పోలీసుల్లో కొందరు పైకి అధికార పార్టీకి విధేయులుగా నటిస్తూ లోపాయికారిగా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వాదన బలంగా వినవస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులనే టార్గెట్‌గా చేసుకున్న జగన్.. పోలీసులను వారిపైకి వదిలారు. వైసీపీ పెద్దల వద్ద మార్కులు వేయించుకోడానికి పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తించారు. సొంత చట్టాలకు తెరలేపారు. నోరు మెదిపితే కేసు.. కాలు కదిపితే కోటింగ్.. అనే దందాను రక్తికట్టించారు. అయితే.. కూటమి ప్రభుత్వానికి జనం అధికారం కట్టబెట్టినా కొందరు పోలీసులు మాత్రం ఇంకా వైసీపీ పంచన పని చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని చాలా పోలీస్ స్టేషన్లలో ఇంకా వైసీపీ వాసనే వస్తోంది. జగన్ జమానాలో పోలీసులను రాజకీయ కక్ష సాధింపునకు విపరీ తంగా వాడుకొన్న మాట జగమెరిగిన సత్యం. ఆ ఐదేళ్లలో ఠాణాలు సెటిల్‌మెంట్ కేంద్రాలుగా మారిపోయాయి. పాలకులే గడ్డి కరుస్తుండడం.. అక్రమాలకు వత్తాసు పలకడంతో అధికారుల అమ్యామ్యాల పని సులభంగా అయిపోయేది. వైసీపీ పాలన సమయంలో స్టేషనుకు వెళ్లాలం టే పేదోడికి దడ పుట్టేది. ఎవరికి తమ గోడు వినిపించాలో తెలియక కుమిలిపోయేవాళ్లు. వైసీ పీ నేత వద్దకు వెళ్లి కాళ్లావేళ్లా పడితేనే అతడు దయ చూపి పోలీస్ స్టేషనుకు ఫోన్ చేస్తే అప్పుడు ఫిర్యాదు తీసుకునే దారుణమైన పద్ధతి నడిచేది. స్టేషనుకు బాధులుగా ఉండే సీఐ, ఎస్‌ఐలను కావాల్సిన వాళ్లను సీట్లలో కూర్చో బెట్టుకోవడంతో దందాలకు అడ్డూఅదుపూ ఉండే ది కాదు. వైసీపీ దుండగులు ఇళ్లల్లోకి వెళ్లి దాడి చేసినా వాళ్లపై కాకుండా బాధితులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొందరు అధి కారులు దందాల పంథా మార్చుకోవడం లేదు. అప్పట్లో ఎలాగైతే దందాలు సాగించేవారో ఇప్పు డూ అదే నడుస్తుండడమే వాటికి కారణంగా వినవస్తోంది. వైసీపీ హయాంలో నీలం కండు వా నీడలో దాష్టీకాలకు తమ వంతు సహాయం చేసిన పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కీలకమైన పోస్టింగులు దక్కించు కున్నారు. ఈ బదిలీల్లో భారీగా డబ్బులు చేతు లు మారాయనే విమర్శలు ఉన్నాయి. ఉదాహర ణకు జిల్లాలోని కీలకమైన పోలీస్ స్టేషన్ల సీటు దక్కించుకోడానికి సుమారు రూ.15 లక్షల వర కూ రేటు పలికిందని చెబుతున్నారు. అయితే.. ఇక్కడే వైసీపీ తెరచాటు కుట్ర ప్రదర్శించింది. తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు వైసీపీ నాయకులే డబ్బులు సమకూర్చి వాళ్లు అనుకున్న సీట్లోకి తెచ్చుకున్నారు. దీంతో తెర పైన కూటమికి విధేయత ప్రదర్శిస్తున్నా.. వైసీపీ కి తెరచాటున ‘పని’ చేసిపెడుతున్నారు. వైసీపీ నాయకులు ఇచ్చే సమాచారంతో టీడీపీ నాయ కులను కేసుల్లో ఇరికిస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు ఏరికోరి తెచ్చుకున్న అధికారులకు కూటమి ప్రభుత్వంలో కూడా కీలకమైన స్థానా లు దక్కాయి. సీఐలు, ఎస్‌ఐల బదిలీలపై కూట మి పెద్దలు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతోనే పరిస్థితి ఇలా మారిందని అటు కూటమి కేడర్ లోను, ఇటు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉదాహరణకు జిల్లాలోని వైసీపీకి పూర్తిగా కొమ్ముకాసే అధికారిగా పేరు బడిన ఓ సీఐ మళ్లీ కీలకమైన స్టేషన్ దక్కించుకున్నారు. మరో ఇలా పలువురు సీఐలు ‘కావాల్సిన’ సీటు సం పాదించారు. సాధారణంగా గతంలో పనిచేసిన పోలీస్ స్టేషనుకు పోస్టింగ్ ఇవ్వడం జరగదు. కానీ కాసులతో ఆ పనీ జరిగిపోయింది. దీంతో గతంలో వైసీపీ నాయకులు మొదలు పెట్టిన పేకాట బోర్డులు, కోడి పందేలు, బెట్టింగులు వంటి జూదక్రీడలు యథేచ్చగా సాగుతున్నాయి. గంజాయి అమ్మకాలూ కొనసాగుతుండడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ ఇదిగో తాజా ఘటన
2022 జూన్ 6న జరిగిన దళిత యువకుడు, వలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కొడుకు శ్రీకాం త్‌పై కేసు నమోదైనా రెండేళ్లపాటు పోలీసులకు అరెస్టు చేయాలనే ఆలోచన కూడా రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. దీంతో శ్రీకాంత్‌ని ఏపీ పోలీసులు తమిళనాడులో అరెస్టు చేశారు. తర్వా త రాష్ట్రానికి తరలించారు. కోర్టు రిమాండు విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తర లించారు. అతడికి మంగళవారం(26న) కోర్టు బెయిల్ మంజూరు చేసినా తగిన పత్రాలు జైలు కు సమర్పించడం, తదుపరి ప్రక్రియకు సమ యం దాటిపోవడంతో 27న (బుధవారం) సా యంత్రం 6 గంటలకు విడుదల చేశారు. కొడుకు ను తీసుకెళ్లడానికి విశ్వరూప్ జైలు వద్దకు వచ్చా రు. సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ హల్‌చల్ సృష్టించారు. ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగింది. అయినా పోలీసులు మిన్నకుండిపోయారు. శ్రీకాంత్‌ని విశ్వ రూప్ ‘ప్రభుత్వ వాహనం’ అని స్టిక్కరింగ్ చేసి ఉన్న ఇన్నోవాలో తీసుకెళ్లినా వారించలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన డ్రైవరును చంపిన కేసులో నిందితుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబా బు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన సమ యంలోనూ పెద్ద ర్యాలీ నిర్వహించారు. అప్పుడు జగన్ జమానా కాబట్టి పోలీసులూ తమ వంతు సహకారం అందించారు. తర్వాత టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, అదిరెడ్డి వాసు (ప్రస్తుత రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే)ను అక్రమ లావాదేవీలంటూ అరెస్టు చేసి జైలుకు పంపారు. వారికి బెయిల్ వచ్చి విడుదలైన సమయంలో టీడీపీ శ్రేణులు జైలు వద్దకు చేరుకోగా పోలీసులు రకరకాల ‘రూల్స్’తో ఇబ్బంది పెట్టారు. చివరికి ర్యాలీకి కూడా అనుమతి లేదంటూ అప్పటి డీఎస్పీ విజయ్‌పాల్ (ఈయనపై వైసీపీ డీఎస్పీ అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి) నోటీసు ఇచ్చి మరీ అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఒక వైసీపీ నాయకుడి కొడుకు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైతే హల్‌చల్‌ని ఏమాత్రమూ అడ్డుకోలేదంటే.. వైసీపీ పోలీసింగ్ నడుస్తుందనడానికి ఇంతకంటే తాజా ఉదాహరణ ఉండదేమోననే విమర్శలు వస్తున్నా యి. జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకూ పోలీసుల బదిలీలపై పునఃసమీక్ష చేసి మార్పులు చేస్తేగానీ వైసీపీ వాసన పోదనే వాదన కూటమి వర్గాల నుంచి వినవస్తోంది. నిజాయితీ, నిబద్ధ తకు పెద్దపీట వేసే ఉన్నతాధికారిగా పేరున్న ఐజీ అశోక్‌కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించా లని కోరుతున్నారు.
ఫ అప్పుడు పట్టించుకోలేదు
వైసీపీ హయాంలో దాష్టీకాలపై ఎంత గట్టిగా మొత్తుకున్నా అటు జగన్ ప్రభుత్వం, ఇటు పోలీసులు వినబడనట్టు నటించేవారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినా ఫలితం ఉండేది కాదు. ఈ క్రమంలో.. జిల్లాలోని శాంతి భద్రతలు అదుపు తప్పడంపై ‘అశాంతి అభద్రత’ అనే శీర్షికతో గత ఏడాది డిసెంబరు 2న ఓ కథనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఐజీ అశోక్ కుమార్ అదే నెల 4న ఎస్పీని ఆదేశించారు. కానీ యథావిధిగా దానిని పట్టించుకోలేదు. అయితే ఆ విచారణ రిపోర్టును వారంలో పంపించాలని, ఈ విషయంపై ఎస్పీ స్వయంగా చొరవ చూపాలని ఆదేశిస్తూ ఈనెల 3న బ్లాక్ రిమైండర్ పేరుతో ఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వాస్తవాలపై ఎంత అలసత్వం ప్రదర్శించేవారో ఈ ఘటన రుజువు చేస్తోంది.