Share News

పిఠాపురం నుంచి పవన్‌ ఎన్నికల శంఖారావం

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:53 AM

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేస్తున్న కాకినాడజిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారా వం పూరించనున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.

పిఠాపురం నుంచి  పవన్‌ ఎన్నికల శంఖారావం

30నుంచి ప్రచారం ప్రారంభం

ఉగాది వేడుకల్లో పాల్గొంటానని వెల్లడి

పిఠాపురం, మార్చి25: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేస్తున్న కాకినాడజిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారా వం పూరించనున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. మూడు రోజులపా టు ఇక్కడే ఉండి పలు సమావేశాల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకలను ఇక్కడే జరుపుకుంటారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 30వ తేదీన ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వెళ్లతానని, అందుకు అనుగుణంగా ప్రచారం షెడ్యూల్స్‌ ఉండాలని సూచించారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీచేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్స్‌ ఉండాలని తెలిపారు.

పిఠాపురంలో పర్యటన ఇలా

పిఠాపురం నియోజకవర్గానికి 30వ తేదీన చేరుకునే పవన్‌కల్యాణ్‌ అష్టాదశ శక్తి పీఠాల్లో దశమశక్తి పీఠం అధిష్టాన దేవతయిన పుర్హుతికాఅమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడే వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. అనం తరం దత్తపీఠాన్ని దర్శించుకుంటారు. అప్పటినుంచి మూడురోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండి పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు జరుపుతారు. క్రియాశీలక కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి సమావేశం ఉప్పాడలో జరుగుతుంది. నియోజకవర్గంలోని బంగారుపాప దర్గా సందర్శనతోపాటు క్రైస్తవ పెద్దలతో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకలను పిఠాపురం నియోజకవర్గంలోనే నిర్వహించుకోవాలని పవన్‌కల్యాణ్‌ నిర్ణయించుకున్నారు. పవన్‌ పర్యటన ఖరారు కావడంతో జనసేన నాయకులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. మూడురోజుల పర్యటనలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Mar 26 , 2024 | 12:53 AM