Share News

పిఠాపురానికి భారీగా పోలీసు బలగాలు

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:37 AM

కౌంటింగ్‌ సమయంలో, అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా నియమితులయిన ఏసీబీ ఎస్పీ రామ్మోహనరావు సోమవారం రాత్రి వెల్లడించారు.

 పిఠాపురానికి భారీగా పోలీసు బలగాలు

పిఠాపురం, జూన్‌ 3: కౌంటింగ్‌ సమయంలో, అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా నియమితులయిన ఏసీబీ ఎస్పీ రామ్మోహనరావు సోమవారం రాత్రి వెల్లడించారు. నియోజకవర్గంలో రెండు ప్లాటూన్ల సీఐఎస్‌ఎఫ్‌, ఒక ప్లాటూన్‌ ఏపీఎస్పీ బలగాలతో పాటు ఒక ప్లాటూన్‌ ఏఎన్‌ఎస్‌ పార్టీ, సివిల్‌ పోలీసులు 100 మంది, ఇతర విభాగాలు నుంచి 25 మందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని వివరించారు. ఏడు క్విక్‌ రెస్పాన్స్‌ టీములు, ఏడు మొబైల్‌ టీములు, ఒక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, రెండు స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్సులు, వజ్ర వాహనం, రోప్‌ పార్టీలను రంగంలోకి దించామని తెలిపారు. 25 ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మకంగా గుర్తించిన 18 గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, సమస్యలు సృష్టించే 30మందిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. 509 మందికి సెక్షన్‌ 149 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌, ఎలక్షన్‌ అధికారులు అనుమతి పొందిన ఏజెంట్లు, అభ్యర్థులు, వారి తరపు ప్రతినిధులు మినహా మిగిలిన వారు కాకినాడ కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు.

యువకుడి హత్య కేసులో ఇద్దరి అరెస్టు

ప్రత్తిపాడు, జూన్‌ 3: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన యువకుడు మొగలి సతీష్‌ హత్య కేసులో నిందితులను సోమవారం స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌ఐ ఎం.పవన్‌కుమార్‌ విలేకరులకు అందించారు. ఒమ్మంగి గ్రామానికి చెందిన మొగలి సతీష్‌(33) మే 4న జ్యూస్‌ తాగి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని భార్య మొగలి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే 4వ తేదీ రాత్రి ఒమ్మంగికి చెందిన బుర్రా దొరబాబు సతీష్‌ను ధర్మవరం గ్రామ శివారు పోలవరం కాలువ గట్టు వద్దకు రప్పించి ఒమ్మంగికి చెందిన గాడిదల లోవరాజు అనే వ్యక్తి సహాయంతో సతీష్‌ను ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. అనంతరం లోవరాజు సహాయంతో సతీష్‌ మృతదేహాన్ని, సతీష్‌ బండిని ట్రాక్టర్‌పై వేసి ఉత్తరకంచి, పొదురుపాక పొలాల సరిహద్దుకు తరలించారు. దొరబాబు మామగారు అయిన వాయిలశెట్టి విశ్వనాథం సహాయంతో ఉత్తరకంచి పొదురుపాక సరిహద్దు సర్వే తోటల్లో గొయ్యి తీసి సతీష్‌ మృతదేహాన్ని పాతిపెట్టారు. అనంతరం సతీష్‌ మోటార్‌ బైక్‌ను ఎవరికీ అనుమానం రాకుండా మే 5వ తేదీ రాత్రి పెదమల్లాపురం గ్రామ శివారులో పెట్రోల్‌ పోసి దొరబాబును తగలబెట్టారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న దొరబాబు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ కె.పుణ్యవతి వద్ద లొంగిపోయి వ్యక్తిగత కక్షలతోనే తాను 4వ తేదీ రాత్రి మెగలి సతీష్‌ను హత్య చేసినట్లు చెప్పాడు. స్థానిక సీఐ ఎం.శేఖర్‌బాబు, ఎస్‌ఐ ఎం.పవన్‌కుమార్‌, తహసీల్దార్‌ నరసింహారావు పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పరిశీలించి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈ కేసులో నిందితులైన బుర్రా దొరబాబు ఒమ్మంగిలోను, గాడిదల లోవరాజును రాచపల్లిలో అరెస్ట్‌ చేసి స్థానిక కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. దొరబాబుకు సహకరించిన అతని మామ వాయిలశెట్టి విశ్వనాథాన్ని అరెస్ట్‌ చేయాల్సి ఉందని అతని కోసం గాలింపు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తె లిపారు.

Updated Date - Jun 04 , 2024 | 12:37 AM