Share News

పవన్‌..పల్లెబాట

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:15 AM

పవన్‌ పల్లె బాటపట్టారు.. ఓటర్లను కలుసుకునేందుకు మండుటెండలో జనసేనాని ఆరు గంటల పాటు ఏకధాటిగా రోడ్‌ షో నిర్వహించారు.

పవన్‌..పల్లెబాట
పిఠాపురంలో పవన్‌ రోడ్‌ షో

6 గంటలు 19 గ్రామాలు 41 కి.మీ

ఊరూరా ఎదురుచూపులు

అడుగుడుగునా నీరాజనం

జేజేలు పలికి.. జన హారతి

పూలదండలతో ఘన స్వాగతం

పిఠాపురం/గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం రూరల్‌, ఏప్రిల్‌ 29 : పవన్‌ పల్లె బాటపట్టారు.. ఓటర్లను కలుసుకునేందుకు మండుటెండలో జనసేనాని ఆరు గంటల పాటు ఏకధాటిగా రోడ్‌ షో నిర్వహించారు. ఎండ లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన జనసైనికులు, టీడీపీ, బీజేపీ కేడర్‌ ఆయనను అను సరించారు. 19 గ్రామాల మీదుగా ఆరు గంటల పాటు 41 కిలోమీటర్ల మేర రోడ్‌ షో సాగింది. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఇళ్లపైకి ఎక్కి చేతులూపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పంటపొలాలు మీదుగా వస్తున్నప్పుడు రైతులు కాన్వాయ్‌ వద్దకు వచ్చి పవన్‌కు అభి వాదం చేశారు.అందరికి అభివాదం చేసుకుంటూ ప్రజలు, మహిళలు విసిరిన పూలదండలు స్వీకరిస్తూ, చిన్నారులు ఎత్తుకుని ముద్దాడుతూ, అభిమాని ఇచ్చిన మేకపిల్లను చేతితో పట్టుకుని, రగ్గు కప్పుకుని అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ పవన్‌ ముందుకు సాగారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసం నుంచి సోమవారం ఉదయం 10.20 గంటలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ ఎస్‌ఎన్‌ వర్మ, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ బుర్రా కృష్ణంరాజు, యువనేత గిరీష్‌వర్మలతో కలిసి పవన్‌ రోడ్‌ షో ఆరంభ మైంది. వన్నెపూడి, కొడవలి సెంటర్‌ మీదుగా ధర్మవరం సెంటర్‌ నుంచి వెల్థుర్తి, పి.దొంతమూరు, బి.కొత్తూరు, పి.తిమ్మాపురం, గోకివాడ,జములపల్లి, నరసింగపురం, ఎల్‌ఎన్‌పురం-కోలంక, విరవాడ, విరవ-మంగితుర్తి, మల్లాం, జల్లూరు, ఎఫ్‌కేపాలెం-కందరాడ గ్రామాల మీదుగా కుమారపురం వరకూ సాగింది. చెందుర్తి సెంటర్‌ వద్ద అభిమాని ఇచ్చిన మేకపిల్లను పవన్‌ ఎత్తుకుని వారు ఇచ్చిన రగ్గును కప్పుకున్నారు. వన్నెపూడి-కొడవలి సెంటర్‌ వద్ద జాతీయరహదారి జనసంద్రమైంది. ధర్మవరం-వెల్ధుర్తి రోడ్డులో కోల్డ్‌స్టోరేజీ కార్మికులు, జగనన్న కాలనీకి చెందిన ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పవన్‌కు అభివాదం చేశారు. వర్మ స్వగ్రామం పి.దొంతమూరులో అపూర్వరీతిలో స్వాగతం లభించింది. ఇక్కడ బీజేపీ నాయకుడు ఒకరు ప్రచార వాహనం బానెట్‌ ఎక్కి డ్యాన్స్‌ చేయగా అతన్ని పవన్‌ ఆలిం గనం చేసుకున్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించా రు.టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటేనని, రాష్ట్రంలో 175 చోట్ల మూడు పార్టీలు పోటీలో ఉన్నట్టు భావించి పార్టీల నేతలు,కార్యకర్తలు, అభిమానులు అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు.పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వర్మ అందిస్తున్న సహకారం మరువలేనిదని, ఆయన త్యాగాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని పవన్‌ తెలిపారు. వర్మను ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి పంపే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఎల్‌ఎన్‌పురంలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కందరాడ- ఎఫ్‌కేపాలెం సెం టర్‌లో జనసేన నేత డాక్టర్‌ పిల్లా శ్రీధర్‌, శివశంకర్‌ల ఆధ్వర్యంలో పవన్‌కు భారీ గజమాల వేశారు.సాయంత్రం 4.20 గంటలకు రోడ్‌షో ముగించుకుని చేబ్రోలు నివాసానికి వెళ్లారు. అక్కడ నుంచి పవన్‌ గొల్లప్రోలు హెలిప్యాడ్‌కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

గెలిచిన తర్వాత ఇంటింటికీ వస్తా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పురుషోత్త పట్టణం ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తెచ్చి పిఠాపురం నియోజకవర్గంలో రైతులకు పుష్కలంగా సాగునీరందిస్తామని ప్రకటించారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణ బాధ్యతను తీసుకుంటానని తెలిపారు. ఎన్నికల్లో విజయం తర్వాత వర్మ తో కలిసి ప్రతి గ్రామం, ప్రతి వీధి తిరుగుతానని, సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని చెప్పారు. విజ యం మనదే.. అడగకుంటే అమ్మయినా పెట్టదు. అందుకే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌కు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

మా గ్రామానికి రావాల్సిందే

పవన్‌కల్యాణ్‌ తమ గ్రామంలోకి రావాల్సిందేనని విరవ గ్రామస్తులు పట్టుబట్టారు. విరవ గ్రామ ఎంట్రన్స్‌ వద్ద పవన్‌ ప్రచార వాహనాన్ని వారు నిలిపివేశారు.తమ గ్రామం మీదుగా వెళ్లాలని డిమాండ్‌ చేశారు. కనీసం ప్రసంగించాలని పట్టుబట్టారు. దీంతో సుమారు 20 నిమిషాలు పాటు పవన్‌ ప్రచార వాహనంతో పాటు నిలిచిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్‌ వెళ్లాల్సి ఉందని అర్ధం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. ఈలోగా పవన్‌ ప్రచార వాహనం దిగి కారులో మల్లాం వెళ్లిపోయారు.కొంతసేపటి తర్వాత ప్రచార వాహనం వెళ్లింది. అనం తరం మల్లాం నుంచి రోడ్‌షో కొనసాగించారు.

Updated Date - Apr 30 , 2024 | 01:15 AM