వరిలో అక్కడక్కడా మాగుడు తెగులు
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:39 AM
వరి పంటలో అక్కడక్కడా మూగుడు తెగులు కనిపిస్తోందని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు వెంకట నరసింహం, శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం అనపర్తి, రాజమహేంద్రవరం సబ్‌డివిజన్ల పరిధిలోని అనపర్తి, కడియం గ్రామాల్లో పలు వరి పంటలను వారు పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.
అనపర్తి/కడియం, సెప్టెంబరు 2: వరి పంటలో అక్కడక్కడా మూగుడు తెగులు కనిపిస్తోందని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు వెంకట నరసింహం, శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం అనపర్తి, రాజమహేంద్రవరం సబ్‌డివిజన్ల పరిధిలోని అనపర్తి, కడియం గ్రామాల్లో పలు వరి పంటలను వారు పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం వరిపొలాలపై ఏమీ లేదని పంట ఆరోగ్యంగా ఉందని చెప్పారు. అయితే కొద్దిచోట్ల నీరు నిలిచినప్పటికీ ప్రస్తుతం ఇబ్బంది లేదని కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పంటను సంరక్షించుకోవచ్చునన్నారు. వర్షాపు నీరు నుంచి తేరుకున్న పంటకు ఎకరాకు 20కిలోల పొటాష్, 20కిలోల యూరియా చల్లుకోవాలని సూచించారు. మాగుడు తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 2 ఎంఎల్/ప్రొపికొనజోల్ 1 ఎంఎల్/ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ 0.4 గ్రా. టెబ్యూకొనజోల్/అజాక్సీస్ట్రోబిన్, టెబ్యూకొనజోల్ 1.5 ఎంఎల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. స్వర్ణ, ఎంటీయూ 1318 వంటి వరిరకాలకు నత్రజని ఎరువును తగ్గించుకోవాలన్నారు. ఈ బృందం వెంట ఏడీఏ కృష్ణ, ఏవోలు సురేష్, కె.ద్వారకాదేవి వ్యవసాయ సహాయకులు ఉన్నారు.