Share News

ప్రమాదభరితంగా బెండానార్త్‌ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌

ABN , Publish Date - May 31 , 2024 | 12:28 AM

పంచనది డ్రెయిన్‌లో 1,500 ఎకరాల ఆయకట్టు ముంపునీరు దిగేలా బ్రిటిష్‌ హయాంలో కొమరగిరిపట్నంలో నిర్మించిన పురాతన బెండా నార్త్‌ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ శిథిలమై ప్రమాదభరితంగా తయారైంది.

ప్రమాదభరితంగా బెండానార్త్‌ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌

అల్లవరం, మే 30: పంచనది డ్రెయిన్‌లో 1,500 ఎకరాల ఆయకట్టు ముంపునీరు దిగేలా బ్రిటిష్‌ హయాంలో కొమరగిరిపట్నంలో నిర్మించిన పురాతన బెండా నార్త్‌ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ శిథిలమై ప్రమాదభరితంగా తయారైంది. సముద్ర పోటు, పాటులకు ఉప్పునీరు ఎక్క కుండా ముంపు, క్రమబద్ధీకరణకై గతంలోఏర్పాటు చేసిన షట్టర్లు పాడై గోడలు కూలి అవసానదశకు చేరింది. డ్రెయినేజీ, ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌ శాఖల పరిధిలో ఉన్నా తమది కాదంటే తమది కాదని అధికారులు, మరోపక్క పాలకులు నిర్లక్ష్యం చేయడంతో వేలాది ఎకరాలకు ముంపు సమస్య తప్పడంలేదు. కొమరగిరిపట్నం శివారు రామేశ్వరం వెళ్లే రోడ్డులో ఉన్న ఈ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ కూలితే తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కొమరగిరిపట్నం, తుమ్మలపల్లి, బెండమూర్లంక పరిధిలో సుమారు 1,500 ఎకరాల ఆయకట్టు ముంపునీరు పంచనది డ్రెయిన్‌ మీదుగా రామేశ్వరం మొగ ద్వారా దిగాల్సి ఉంది. మొగ ద్వారా ఉప్పునీరు స్లూయిస్‌ తలుపులులేక వందలాది ఎకరాల చేలలోకి చేరి సాగునీటి సమస్యలకు విఘాతం కలిగిస్తోంది. 2007లో అప్పటి మంత్రి గొల్లపల్లి సూర్యారావు స్లూయిస్‌ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు జరగలేదు. 20ఏళ్లుగా దీనిని పట్టించుకున్నవారే లేరని రైతులు ఆరోపిస్తున్నారు. బెండా నార్త్‌ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, డ్రెయిన్స్‌, ఇరిగేషన్‌, హెడ్‌వర్క్స్‌ అధికారులకు కొమరగిరిపట్నం నీటి సంఘం మాజీ అధ్యక్షుడు దాట్ల గోపిరాజు, మంతెన సురేష్‌రాజు, ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:28 AM