Share News

7 కేజీలు రూ.100

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:09 AM

ఉల్లిపాయల ధరలు దిగొస్తున్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి ఉల్లిపాయల ధరల్లో అనూహ్యమైన తగ్గుదల కనిపిస్తోంది.

7 కేజీలు రూ.100

మహారాష్ట్ర నుంచి భారీగా దిగుమతులు

ఆటోలపై రూ.100కి ఏడు కిలోలు

రైతు బజార్లలో మాత్రం తగ్గని ధర

ఇంకా కిలో రూ.20లకే విక్రయం

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 11 : ఉల్లిపాయల ధరలు దిగొస్తున్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి ఉల్లిపాయల ధరల్లో అనూహ్యమైన తగ్గుదల కనిపిస్తోంది. మహారాష్ట్రలో కొత్త పంట చేతికి రావడంతో డిమాండ్‌ కంటే ఎక్కువగా దిగుమతులు పెరడమే ధరలు తగ్గుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో ఉల్లిపాయల లోడు లారీలు మార్కెట్‌కు వస్తుండడంతో ఇక్కడి హోల్‌సేల్‌ వ్యాపారులు వచ్చిన పాయలను వచ్చినట్టే బహిరంగ మార్కెట్లకు పంపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ రాజమహేంద్రవరం హోల్‌సేల్‌ మార్కెట్‌కు నాలుగు, ఐదు లారీలు వచ్చేవని, ఇప్పుడు ఏకంగా పది నుంచి పదిహేను వరకూ లారీలోడ్లు వస్తున్నాయని చెబుతున్నారు. దీంతో హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ధరలు నేలచూపులు చూస్తున్నాయి.

ఆటోలపై ఇంటింటికీ ఉల్లి

హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ఉల్లిపాయల ధర తక్కువగా ఉండడంతో ఆటోలు, తోపుడుబండ్లపై ఇంటింటికీ తీసుకొచ్చి విక్రయించే వ్యాపారులు రూ.100లకే ఏడు కిలోలు అంటూ ఊదరగొడుతున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి పది కిలోలు రూ.90-100లకు కొనుగోలు చేసి రవాణాఖర్చులు, కొంత లాభం వేసుకుని తక్కువకే ఇళ్లవద్ద విక్రయిస్తున్నారు. అయితే రైతు బజార్లలో మాత్రం కిలో రూ.20లకు తగ్గడంలేదు. నిజానికి బహిరంగ చిల్లర మార్కెట్ల కంటే రైతుబజార్లలోనే ధరలు తక్కువగా ఉండాలి. కానీ తాము నాణ్యత కల్గిన పాయలు తెస్తున్నామని, ధర తగ్గిస్తే గిట్టుబాటు కాదని రైతు బజార్లలోని వ్యాపారులు చెబుతున్నారు.

కొత్తపాయలు నిల్వకు ఆగవు ..

మహారాష్ట్రలోని షోలాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి భారీగా ఉల్లిపాయలు మార్కెట్లకు వస్తున్నా అవన్నీ కొత్తపాయలు కావడంతో నిల్వకు ఆగే పరిస్థితి లేదు. దీంతో బస్తాలకు, బస్తాలు కొనుగోలు చేసుకుని నిల్వచేసుకునే అవకాశం ఉండదు. ఆరుదలపాయ కాకపోవడంతో త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఒకేసారి 25, 30 కేజీల కొనుగోలు చేసుకున్నా ప్రయోజనం ఉండదు. హోటళ్లు, కర్రీపాయింట్ల వారికి ఈ ధరల తగ్గుదలతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:09 AM