మన అప్పలరాజే.. రాజబాబు!
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:55 AM
గోదావరి జిల్లాల నుంచి ఎందరో మహానుభావులు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. వారికున్న ప్రతిభను చాటి ఆయా రంగాల్లో అగ్ర స్థానానికి చేరుకుని ఈ ప్రాంతానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చారు. గోదావరి నీరు తాగిన వారికి ఎటకారం ఎక్కువ అనే నానుడిని నిజం చేస్తూ ఆ వెటకారాన్ని హాస్యంగా మలిచి తెలుగు చలన చిత్రసీమలో నవ్వుల రేడుగా తన దైన ముద్రవేసుకున్న వారిలో అగ్రజుడు పుణ్యమూర్తుల అప్పలరాజు (హాస్యనటుడు రాజబా బు).
రాజమహేంద్రితో విడదీయరాని అనుబంధం.
మానవత్వంలో తనకు తానే సాటి.. నేడు హాస్యనటుడు రాజబాబు జయంతి
(రాజమహేంద్రవరం సిటీ-ఆంధ్రజ్యోతి)
గోదావరి జిల్లాల నుంచి ఎందరో మహానుభావులు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. వారికున్న ప్రతిభను చాటి ఆయా రంగాల్లో అగ్ర స్థానానికి చేరుకుని ఈ ప్రాంతానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చారు. గోదావరి నీరు తాగిన వారికి ఎటకారం ఎక్కువ అనే నానుడిని నిజం చేస్తూ ఆ వెటకారాన్ని హాస్యంగా మలిచి తెలుగు చలన చిత్రసీమలో నవ్వుల రేడుగా తన దైన ముద్రవేసుకున్న వారిలో అగ్రజుడు పుణ్యమూర్తుల అప్పలరాజు (హాస్యనటుడు రాజబా బు). పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 1937 అక్టోబరు 20న రాజబాబు జన్మించారు. ఆయన స్వస్థలం మండపేట. ఆయన బాల్యం మండపేట లోను, రాజమహేంద్రవరంలోను సాగింది. రాజబాబు తండ్రి ఆర్‌అండ్‌బీలో ఉద్యోగి కావడంతో రాజమహేంద్రవరంలో ఉద్యోగరీత్యా ఆయన ఇక్క డకు వచ్చారు. తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్‌గా శిక్షణ పొందిన రాజబాబు రాజమహేంద్రవరంలో చాలాకాలం పేద విద్యార్థులకు ట్యూషన్ చెప్పి తన జీవితాన్ని ఇక్కడే ప్రారంభించారు. తాను పుట్టిన ఊరు తర్వాత సొంతూరుగా రాజమహేంద్రవరాన్నే ప్రకటించుకున్నారు. రాజమహేంద్రవరంలో బాబులు స్టూడియో అధినేత బాబుతో రాజబాబుకు మంచి అనుబంధం ఏర్పడింది. బాల్యం నుంచి నాటకాలపై మక్కువ ఉన్న రాజబాబు రాజమహేంద్రవరంలో సునంద మ్యూజికల్ పార్టీలో చేరి మిమిక్రీ చేయడం, నాటక ప్రదర్శనలు చేయడం వంటి చేశారు. అటుపై సినిమారంగంపై ఉన్న ఆసక్తితో మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నపుడు బాబులు స్టూడియో అధినేత బాబు, తన శ్రేయోబిలాషులు కానుమిల్లి చిట్టి బాబు, గండిపల్లి చిట్టిబాబు, వి.చిట్టిబాబు తది తరులు ఆయనకు సహకరించారు. తమ స్నేహితుడ్ని మద్రాసుకు పంపించారు. దీంతో రాజబాబు జీవితం గొప్ప మలుపుతిరిగింది. సినిమా రంగంలో హాస్యనటుడిగా తిరుగులేని స్థానానికి చేరుకున్నారు. కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరమంటే రాజబాబుకు ఎంతో మక్కువ. తాను మద్రాసు వెళ్లేందుకు సహకరించిన మిత్రు ల పేర్లన్నీ చివర బాబు ఉండడంతో తాను సిని మా జీవితంలోకి అడుగుపెట్టాక అప్పలరాజు పేరులో ఉన్న రాజుకు తన మిత్రుల పేర్లను జత చేసుకుని రాజబాబుగా మార్పుకుని వారిపై తన కున్న ప్రేమావాత్సల్యాలను వ్యక్తపరిచారు.
సెక్యూరిటీగార్డు రూమ్‌లో బస
చెన్నపట్నం సినిమా అవకాశాల కోసం వెళ్లిన తొలినాళ్లలో అవకాశాల కోసం తిరిగే సమయంలో రాజబాబు చాలా ఇబ్బందులుపడ్డారు. ఆయన తొలుత అప్పటి హీరోయిన్ రాజసులోచన ఇంటి సెక్యూరిటీగార్డు రూమ్‌లో ఆశ్రయం పొందారు. రాజబాబు సినిమా రంగంలో స్థిరపడ్డాక సెక్యూరిటీ గార్డుకు ఒక ఇంటినే బహుమతిగా ఇవ్వడం విశేషం.
575 సినిమాల రికార్డు
రాజబాబు తిరుగులేని హాస్యనటుడుగా ఎదిగారు. గోదావరి జిల్లాలకు చెందిన మరొక ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంకటరామయ్య 1960లో తీసిన ‘సమాజం’లో సినిమాలో రాజబాబుకు అవకాశం ఇచ్చారు. అది మొదలుకొని అనేక విభిన్నమైన సినిమాల్లో రాజబాబు రాణించారు. అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, ఎస్‌వీ రంగారావు, కృష్ణ, శోభన్‌బాబు, కాంతారావు వంటి వారి సినిమాల్లో కచ్చితంగా రాజుబాబు పాత్ర ఉండేది. అప్పట్లో అగ్రనటుల సినిమాల్లో రాజబాబు పాటతో కూడిన సినిమాలు ఉండేవంటే ఆయన ప్రాముఖ్యత ఆ స్థాయిలో ఉండేది. రాజ బాబు స్వయంగా సినిమాలు తీశారు. సొంతంగా ఎవరికివారే యమునాతీరే, మనిషి రోడ్డునపడ్డాడు వంటి 8 సినిమాలు ఆయన తీశారు. మొత్తం 575 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు.
గతం మర్చిపోని మంచి మనిషి
తాను పుట్టిన ఊరు, పెరిగిన తీరు, సహకరించిన మిత్రులు, జీవితాన్ని ఇచ్చిన చిత్రసీమలో ఎదుగుదలకు ప్రోత్సహించిన వారిని రాజబాబు ఏనాడూ మర్చిపోలేదు. గతాన్ని మార్చిపోకుండా మానవత్వంతో ఈ సమాజానికి తన దైన శైలిలో సేవచేసిన నటుడు రాజబాబు. ఆయన కళాకా రుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాజమహేంద్రవరంలో అనేక సేవలు రాజబాబు చేశారు. సినిమారంగంలో సక్సెస్ అయ్యాక రాజబాబు రాజమహేంద్రవరం వచ్చిన సమయంలో ఇక్కడ పారిశుధ్య కార్మికుల్లో కొంతమందిని గుర్తించి వారికి ప్రస్తుత కంబాలచెరువు షాడే స్కూల్ సమీపంలో ఇళ్లు కట్టించి ఇచ్చారు. అదేవిధంగా కోరుకొండలో ప్రభుత్వ కళాశాలను కట్టించారు. అది రాజబాబు జూనియర్ కళాశాలగా ఉంది. అలాగే ఎంతోమంది అనేకమంది పేద విద్యార్థు ల చదువులకు ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుత సుబ్రహ్మణ మైదానంలో ఉన్న ఆనం కళాకేంద్రానికి లక్ష విరాళం ఇస్తానని తన పేరుపెట్టాలని ఆయన అప్పటి ప్రభుత్వానికి సూచిస్తే అప్పటి ప్రభుత్వం రెండు లక్షలు విరాళం ఇచ్చిన వారి పెట్టింది. లేదంటే ఇప్పుడు దానిపేరు రాజబాబు కళాకేంద్రంగా ఉండేది. నవ్వుల రారాజుగా వెలుగొందిన రాజబాబుకు భార్య, పిల్లలు ఉన్నారు. వారు సినిమారంగానికి దూరంగా ఉన్నారు. వారు అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు సోదరులు మాత్రం సినిమా రంగంలోనే ఉన్నారు. రాజబాబు 1983 ఫిబ్రవరి 7న మరణించారు. అటుపై 2011 ఏప్రిల్ 9న రాజమహేంద్రవరం గోదావరి బండ్‌పై మాజీ ఎంపీ సినీనటుడు మాగంటి మురళీమోహన్ ప్రతిష్టాత్మకంగా రాజబాబు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించా రు. ఈ విగ్రహావిష్కరణకు 75 మంది హస్యనటులు, నటీమణులు హాజరయ్యారు. ఇటువంటి హాస్యనట రారాజు రాజబాబు జయంతి నేడే.