Share News

మార్పు రావాలి!

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:18 AM

2023 గడచిపోయింది.. కాలగర్భంలో కలిసిపోయింది.. ఎన్నో విషాదాలు.. మరెన్నో సంతో షాలు.. చివరిలో ఆందోళనలు.. 2023 ఏదో అలా గడచిపోయిందంతే.. మరీ 2024 ఎలా ఉండాలనుకుంటున్నారు.. మార్పు రావాలంటే మనం మారాలంతే..2024 అదే చెబుతోంది..

మార్పు రావాలి!
కడియపులంక పల్ల గణపతి నర్సరీలో విరివనాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు

గంజాయి వద్దు.. మద్యం మత్తు వద్దు..

సారాకు చెక్‌ పెడదాం

అందరితో కలిసుందాం

అభివృద్ధి చేసేవారికే ఓటేద్దాం

ఈ ఏడాది అష్టదిగ్బంధనం చేయాల్సిందే

కాలగర్భంలో కలిసిన 2023

2023 గడచిపోయింది.. కాలగర్భంలో కలిసిపోయింది.. ఎన్నో విషాదాలు.. మరెన్నో సంతో షాలు.. చివరిలో ఆందోళనలు.. 2023 ఏదో అలా గడచిపోయిందంతే.. మరీ 2024 ఎలా ఉండాలనుకుంటున్నారు.. మార్పు రావాలంటే మనం మారాలంతే..2024 అదే చెబుతోంది.. మార్పు అనేది మనతోనే ఆరంభంకావాలి.. రాజకీయంగా మనకు ఎవరు కరెక్ట్‌ అనేది తేల్చుకోవాల్సిన ఏడాది ఇది.. ఎందుకంటే ఎన్నికలు ఉండేది ఈ ఏడాదే.. మనం ఎలా బతకాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి.. గంజాయి మత్తు వీడాలి.. సారా.. మనసారా.. వదిలేయాలి.. మన భద్రత మనమే చూసుకోవాలి.. అందరితో కలిసుండాలలి.. సమస్యలపై ప్రశ్నించాలి.. యువతరానికి ఒక లక్ష్యం ఉండాలి.. ఈ ఏడాది ఇలాంటి మార్పు రావాల్సిందే..

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఆప్యాయతకు మారుపేరు.. పరదాలా పరిచిన పచ్చ దనం.. గోదారమ్మ ఒడిలో ఆహ్లాదంగా సాగిపోయే జీవ నం.. ఇదీ మూడు ముక్కల్లో తూర్పుగోదావరి జిల్లా ఘనత. కానీ గత నాలుగేళ్లుగా ప్రశాంతాన్ని అశాంతి శాసిస్తోంది. సీఐ స్థాయి అధికారులు సైతం చోటామోటా నాయకుల మాటలు వినితీరాల్సిన పరిస్థితి దాపురిం చింది. కారణాలేమైనా అతి శృతిమించి సాధారణ జనజీ వనాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో అన్ని రకాల నేరాలూ తగ్గాయని గణాంకాలను చూసి మురిసిపోతున్నా వాస్తవాలు మాత్రం మౌనంగా వెక్కిరిస్తున్నాయి.పోలీసు నిఘా నిద్దరోతుండడం.. నిఘా శాఖ(ఇంటెలిజెన్స్‌) రాజకీయ ఫీడ్‌బ్యాక్‌లకు మాత్రమే పరిమితం కావడం ప్రజల పాలిట శాపంగా మారాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.మరోవైపు పౌరస్పృహ పట్టు తప్పడం.. సామాజికస్పృహ చల్లారిపోవ డం వం టివి నిశ్శబ్ద ప్రమాదాలుగా పరిణ మించాయి.ఈ పరిస్థితులు ‘2024’లో వ్యక్తిగతంగా.. సామాజికపరంగా.. రాజకీయం గా కచ్చితంగా ‘మార్పు కావాలి’ అని ఘోషిస్తున్నాయి.

రాజకీయం..

ఈ సారి మాత్రం కొత్త సంవత్సరానికి మరింత ప్రా ధాన్యత ఉంది.2024 జనవరి వేడుకలకు రాజకీయ ప్రత్యే కత ఉంది. కొద్దినెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగను న్నాయి.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అధికారంలోకి రావా లని ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సారి తెలుగదేశం- జన సేన పార్టీ పొత్తుతో నాయకులు,కార్యకర్తల్లో జోష్‌ పెరి గింది. అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే కదన రంగంలోకి దూకారు.. మీ భవిష్యత్‌ మాదంటూ ఇంటిం టా పలకరిస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార వైసీపీ మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తోంది. కానీ గతంలో ఏ అధికార పార్టీకి లేనంత ప్రజ్యాతి రేక తను వైసీపీ ప్రభుత్వం మూటకట్టుకుంది.. జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్ర స్తుత రాజకీయ సమీకరణలు పూర్తిగా మారాయి. త్వర లో జరగననున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం- జన సేన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ తప్పు జరగకూడదనే జతకట్టా యి.వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూ డదనే లక్ష్యం తో పవన్‌ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ రెండు పార్టీల మధ్య సీట్లు అధికారికంగా ఖరారు కాలేదు. కానీ ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరినట్టు ప్రచా రం జరుగుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు పదిల మేనని గతంలోనే చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేల స్థానాలు పది లమేనని చెప్ప వచ్చు.మిగిలిన స్థానాల సంగతి తేలాల్సి ఉంది. వైసీపీ లో తీవ్ర గందరగోళం నెలకొంది.ఇప్పటికే సిటీ, రూరల్‌ స్థానాలకు కోఆర్డినేటర్లను కాదని అభ్యర్థులను మార్చి వేసిన సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో మిగిలిన స్థానాలపై ఉత్కంఠ నెలకొంది.తెలు గుదేశం,వైసీపీ రెండింటికి ఎంపీ అభ్యర్థులు కొత్త వారే వచ్చే అవకాశం ఉంది.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో అధిష్ఠానాలు అభ్యర్థులఖరారుపై దృష్టి సారిస్తున్నాయి.

గంజాయి మహమ్మారి..

గంజాయి మహమ్మారి యువత జీవితాలను నిర్వీ ర్యం చేస్తోంది.ఆంధ్ర ఒడిశా(ఏవోబీ)లో సాగవుతున్న గంజాయి జిల్లాకు కూడా సరఫరా అవుతోంది. పట్టణా లకే పరిమితమైన గంజాయి పొగ ఇప్పుడు పల్లెల్లో గుప్పుమంటోంది. ఈ ఏడాది రూ.2.63 కోట్ల విలువ చేసే 5300 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది. వారికి చిక్కకుండా మరో రెండింతల గంజాయి యువత ఆరోగ్యంలోకి చేరి పోయింది. ఇంత జరుగుతున్నా నిఘా, శాంతి భద్రతలు, నేర, నార్కోటిక్స్‌ తదితర విభాగాలు పసిగట్టలేకపోవడం విస్తుగొలుపుతోంది.

నాణ్యత లేని మద్యం - ఫుల్‌గా సారా

జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.100 కోట్లు దాటే శాయి. నాణ్యతలేని ప్రభుత్వ మద్యానికి సారా జతకలిసి ఆరోగ్యాలను గుల్లచేసి కుటుంబాలను నాశనం చేస్తున్నా యి. మద్యం ధరల పెరుగుదలతో గత ప్రభుత్వంలో అదుపులోకి తెచ్చిన సారా ఈ ప్రభుత్వంలో సవాలు విసిరే స్థాయికి చేరింది. గోదావరి లంకల్లో గుట్టుగా తయారు చేసి ఊళ్లలోకి తరలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 13,600 లీటర్ల సారా, 1లక్షా 55వేల లీటర్ల బెల్లపు ఊటను సెబ్‌ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కిందే ఇంత పెద్ద ఎత్తున ఉంటే చాటుగా సరఫరా అయిపోయి జనాలను ముం చేస్తున్న సారా ఇంకా ఎంత భారీగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ నాలుగేళ్లలో కాలేయం, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడే మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకే ఈ ఏడాది మందు,సారా రెండింటినీ వదిలేసి ఆరోగ్యంగా ఉండాలి.

ప్రాణాలను మింగేస్తున్న రోడ్లు

బయటకు వెళితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామన్న నమ్మకం లేదు. ఎందుకంటే రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది 926 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 336 మంది బలైపోయారు. బ్లాక్‌స్పాట్లు గుర్తిస్తున్నా ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ శాఖలు కలిపి చర్యలు తీసుకోవాల్సి ఉండడం విపరీత కాలయాపనకు దారితీసి భద్రతను ప్రాణాపాయం అధిగమిస్తోంది.

కానరాని పౌరస్పృహ?

రానురాను పౌరస్పృహ నీరసిస్తోంది.నాకెందుకులే అనే ధోరణి మితిమీరుతోంది. కళ్లెదుట దుర్ఘటనలు జరిగినా కనీసం స్పందించకపోగా బాధితులు నెత్తురోడుతున్నా ఫొటోలు, వీడియోలు తీసుకోవడంతో కాలయాపన చేయడం ఆవేదన మిగులుస్తోంది.గతంలో పాఠశాలల్లో ఉండే మోరల్‌ క్లాసులు మళ్లీ మొదలుపెట్టాలనే వాదన వినిపిస్తోంది.ఈ ఏడాది మహిళల, పిల్లలపై జరిగిన నేరాలకు సంబంధించి 890 కేసులు నమోదయ్యాయి. పౌరస్పృహ ఉంటే వాటి సంఖ్య చాలా వరకూ తగ్గు తుంది కదా!. ప్రశ్నించే తత్వం తగ్గిపోయింది.ధరలు పెరి గినా ధర్నాలు లేవు.. సమస్యలపై నిలదీసేవారు లేరు.. దీంతో ప్రభుత్వ పాలన తీరు మారింది.

మితిమీరిన యువతరం

ఇటీవల కాలంలో యువత మితిమీరి ప్రవర్తించడం, లెక్కలేనితనం ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు పెద్దలను చూస్తే నమస్కరించే సంస్కారం అంతరించే దశకు చేరుకొని బీర్‌ బాటిళ్లతో ఎదురెళ్లి మంచిచెప్పిన వారిపై తిరగబడుతుండడం చూస్తున్నాం. తల్లిదండ్రుల మాట వినకుండా పెడదారులు పట్టడం ఎక్కువకావడం ఎవరూ కాదనలేని వాస్తవం. మరొకరి స్వార్థ అవసరా లకు యువతను నిర్వీర్యం చేస్తున్న ఘనులూ ఉన్నారు. అందువల్ల రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులైన యువత ఇప్పటికైనా మేలుకోవాలి. మంచి లక్ష్యంతో ఈ రోజే తొలి అడుగు వేయాలి. ఈ ఏడాది జిల్లాలో 62 అత్యాచారాలు, 24 హత్యలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. తెరమాటున ఉన్నవాటి లెక్క దేవుడికే తెలియాలి. ఈ అఘాయిత్యాల్లో ఎక్కువగా యువతే ఉంటున్నారనేది గణాంకాలు చెబుతున్న వాస్తవం.

నిఘా మెలకువగానే ఉందా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ప్రజల భద్రత,రక్షణలో నిఘా వ్యవస్థకు అత్యంత ప్రాధా న్యం ఉంది. నేరస్తుల అనుపానులు గమనిస్తూ, నేరాలు జరిగే ఆస్కారంపై అప్రమత్తంగా ఉంటూ ఆయా శాఖ లను.. ముఖ్యంగా పోలీసులను అప్రమత్తం చేయడం నిఘా విభాగ ప్రధాన విధి. కానీ గంజాయి, నాటుసారా, గేమింగ్‌, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు తదితర నేరాల సంఖ్యను పరిశీలిస్తే నిఘా విభాగం పనితనం డొల్లగా మారినట్టు కనిపిస్తోంది. రాజమహేంద్రవరానికి ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తుంటారు.నిఘా పనితీరు నీరసంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

కలిసి ఉంటే కలదు సుఖం..

అందరం కలిసి ఉంటేనే అది సమాజం. ప్రస్తుత సమా జంలో ఎవరికివారే యమునా తీరే. జిల్లాలో ఈ ఏడాది 700 కొట్లాట/గలాటా/దాడి/గొడవ వంటివి పోలీ సుల వద్ద నమోదయ్యాయి. పోలీసుల కంట పడనివి పది రెట్లు ఉంటాయి. రాజీమార్గం రాజమార్గమని అం టారు. ‘సారీ’ అంటే జారిపోయేదేమీ లేదు. కానీ ఈగో అడ్డొచ్చి సమస్యలను కొనితెస్తోంది. సెల్‌ఫోన్లతో పరిచ యం ఎక్కువై కుటుంబీకులు కూడా దూరపు బంధు వుల్లా కనిపిస్తున్నారు.ఇలాగే కొనసాగితే మనిషి సంఘ జీవి నుంచి ఏకజీవిగా మారే ప్రమాదం లేకపోలేదు.

ఎనిమిదింతల ఆనందం కావాలి...

2023 వెళ్లిపోయింది.. మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది.. 2024లోకి వచ్చేశాం..ఈ ఏడాది ఎలా ఉండాలి.. ప్రతి ఒక్కరిదీ ఒకటే ఆశ.. అంతా బాగుండాలి.. అలా బాగుండాలంటే ఏం ఉండాలి.. ప్రతి కుటుంబం ఆదాయం రెండింతలు పెరగాలి.. బాధలు..నష్టాలు.. కష్టాలు.. జీరోగా ఉండాలి.. వ్యయం రెండింతలు తగ్గాలి.. ఇలాగైతేనే నాలుగింతల ఆనందం పొందుతాం.. అంతా బాగుంటాం.. ఇదీ జనం ఆలోచన.. ఎందుకంటే 2023 లో అన్నీ కష్టాలు.. బాధలే.. అన్నదాతకు ప్రకృతి వైపరీత్యాలు.. జనానికి ధరాఘాతం.. ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ నాయకులకు అంతంతమాత్రంగానే ఉంది.2024లో ఇలా కాదు.. ఆనందంగా.. సంతో షంగా గడవాలని కోరుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి కూడా అందరికీ 2024 ఆనందాన్ని పంచాలని.. కడియపులంక పల్ల గణపతి నర్సరీలో ఏర్పాటు చేసిన విరివనాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతోంది..!!

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి : కలెక్టర్‌

రాజమహేంద్రవరం, డిసెంబరు 31: 2024లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలని జిల్లా కలెక్టర్‌ డా. కె. మాధవీలత ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా తమ తోటి వారితో సామరస్యంగా స్నేహభావంతో మెలగాలని సకల సంపదలు కలగాలని కోరుకున్నారు. రానున్నరోజుల్లో మరింతగా ప్రజలకు మంచి జరగాలన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:18 AM