Share News

మైనారిటీలకూ ‘మొండిచేయి’

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:14 AM

ప్రతి మసీదులో ఇమామ్‌, మౌజన్‌ ఉంటారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే తలంపుతో టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ భృతిని ప్రవేశపెట్టింది.

మైనారిటీలకూ ‘మొండిచేయి’

కుడి చేత్తో బటన్‌ నొక్కి.. ఎడమ చేత్తో ఆ సొమ్ములను లాగేసుకుంటూ ఐదేళ్లుగా హస్తలాఘవాన్ని చూపడంతోనే జగన్‌ పరిపాలనను సరిపెట్టారు. ఏ వర్గానికీ మేలు చేసిన దాఖలాలు లేవు. చివరికి.. నా మైనారిటీలంటూనే వాతలు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ముస్లిం గురువులకు జీతాలూ ఇవ్వకుండా పవిత్ర రంజాన్‌ మాసంలోనూ ఆవేదనకు గురిచేశారు. ఆరు నెలలుగా గురువుల ఆవేదన చూడలేక వక్ఫ్‌బోర్డు అధికారులు వేతనాలను విడుదల చేశారు. అదీ రంజాన్‌ ముగిసిన తర్వాత ఇవ్వడం గమనార్హం.

ఇమామ్‌, మౌజన్‌ల జీతాలకు వక్ఫ్‌ సొమ్ములు

ఆరు నెలలుగా భృతి మరిచిన ప్రభుత్వం

గురువుల ఆవేదన చూడలేక అధికారుల చొరవ

మైనారిటీలపై వైసీపీ ముందు నుంచీ చిన్నచూపే

హజ్‌ రాయితీతో సహా పథకాలన్నీ తీసివేత

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

ప్రతి మసీదులో ఇమామ్‌, మౌజన్‌ ఉంటారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే తలంపుతో టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ భృతిని ప్రవేశపెట్టింది. ఇమామ్‌కి రూ.5 వేలు, మౌజన్‌కి రూ.3 వేలు క్రమం తప్పకుండా గౌరవ భృతి అందేది. అయితే గత ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలు వల్లెవేసిన జగన్‌.. ఇమామ్‌, మౌజన్‌లకు రూ.10 వేలు, రూ.5 వేలు ఇస్తామంటూ ప్రగల్భాలు పలికారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మరిచిపోయారు. నాలుగు ఏళ్లపాటు ముస్లీంలు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏడాది నుంచి ఇమామ్‌, మౌజన్‌లకు జీతాల పెంపు జరిగింది. అయితే ఆరు నెలల నుంచీ పెంచిన జీతాల మాట దేవుడెరుగు.. అసలు పైసా కూడా రాలేదు. రంజాన్‌ మాసంలోనూ గౌరవ భృతిని విడుదల చేయలేదు. దీంతో రంజాన్‌లో జిల్లాలోని 205 మసీదుల్లోని సుమారు 400 మంది ఇమామ్‌, మౌజన్లు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఆరు నెలల నుంచీ జీతాలు రాకపోవడంతో రంజాన్‌ వేళ అప్పుల కోసం తిప్పలు పడ్డారు. రంజాన్‌ మాసంలో మసీదులకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్న జగన్‌కి వారి కష్టాలు మాత్రం కనిపించ లేదు. రంజాన్‌ ముగుస్తున్నా ప్రభుత్వంలో చలనం రాలేదు. దీంతో గురువుల ఆవేదన చూడలేక సీఈవో, అధికారులు నిర్ణయం తీసుకొని వక్ఫ్‌ బోర్డు నుంచి జీతాలను చెల్లించారు. ఈనెల 11న రంజాన్‌ ము గియగా.. 12న వేతనాలను ఖాతాల్లో వేశారు. వక్ఫ్‌ బోర్డు చొరవ చూపకుంటే ప్రభుత్వం నుంచి పైసా వచ్చేది కాదంటూ గురువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నా’ ‘నా’ అంటూనే నానాతంటాలూ పెట్టడం జగన్‌కి ఉన్న ప్రత్యేక లక్షణం. నా మైనారిటీలు అంటూనే అధికారంలోకి రాగానే వారికి అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేశారు. మసీదులు, శ్మశాన వాటికలు తదితర వాటి అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన వక్ఫ్‌బోర్డు నిధులనూ పాలకులు వాడుకున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్‌ యాత్రకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి రూ.60 వేలు, మిగతా వారికి రూ.30వేలు హజ్‌కి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన జగన్‌ తర్వాత ఆ మాట మరిచారు. ముస్లింలు హజ్‌కి హైదరాబాద్‌లో విమానం ఎక్కేవారు. వైసీపీ ప్రచార యావతో విజయవాడ నుంచి విమానం అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనివల్ల ఒక్కో యాత్రికుడిపై రూ.90వేల అదనపు భారం పడింది. ఒక్కపైసా కూడా ప్రభుత్వం భరించలేదు. టీడీపీ ప్రభుత్వంలో హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులతో ఒక గైడ్‌ను పంపిం చేవారు. దీనికోసం మక్కా కనీసం ఓసారి వెళ్లిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులను నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసేవారు. వైసీపీ పాలకులు గైడ్‌ల నియామకానికి ఎలాంటి ప్రక్రియ చేపట్టకుండా తమ కార్యకర్త లను నియమించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో గైడ్‌ అవకా శం కోసం ఎదురు చూస్తున్న విశ్రాంత ముస్లీం ఉద్యోగులు దగా పడ్డా యి. పేద, ధనిక అనే బేధం లేకుండా రంజాన్‌ ఆనందంగా జరుపు కోవాలని సంకల్పించి టీడీపీ ప్రభుత్వంలో రంజాన్‌ వచ్చిందంటే తోఫా పేరుతో కానుక అందజేసేవారు. తోఫాలో పప్పు, ఉప్పు, సేమియాలు, నెయ్యి, పసుపు వంటి ఇఫ్తార్‌ వంటకు అవసరమైన వస్తువులు ఉం డేవి. ఈ ప్రభుత్వం వచ్చాక తోఫాను తీసేసింది. దాని స్థానంలో ప్రత్యామ్నాయం కూడా ఏమీ అందజేసే ఆలోచన చేయలేదు. గత ప్రభుత్వంలో రంజాన్‌ మాసం రాక ముందే మసీదుల మరమ్మతులు, రంగులు, ఎలక్ట్రికల్‌ తదితర పనుల కోసం నిధులు విడుదల చేసే వాళ్లు. గ్రామాల్లోని మసీదులకు రూ.15వేలు, పట్టణాల్లోని మసీదులకు రూ.25వేలు అందజేసేవారు. వైసీపీ పాలన వచ్చిన వెంటనే ఆ ఆర్థిక సహాయానికీ నీళ్లొదిలేశారు. పెళ్లి కానుక అంటూ ‘దుల్హన్‌’ పథకాన్ని తెరపైకి తెచ్చారు. దాన్నీ నిర్వీర్యం చేసేశారు. 10శాతం మందికి కూడా లబ్ధి చేకూరలేదు. గత ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు ఉపాధి కోసం రూ.1లక్ష సబ్సిడీతో రూ.3లక్షల రుణం ఆందజేసేవారు. దుకాణ్‌ మకా ణ్‌ అనే మంచి పథకం అమలు చేసేవాళ్లు. ఈ స్కీంలో ఇల్లు కట్టుకొని అక్కడే మటన్‌, చికెన్‌ తదితర దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాఫీగా సాగించడానికి 100శాతం సబ్సిడీతో రుణం అందేది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు తత్కాల్‌ పథకం కింద వక్ఫ్‌బోర్డు నుంచి రూ.10వేలు ఇచ్చేవారు. వితంతువులకు రూ.10వేలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేది. విదేశీ విద్యకు ముస్లిం మైనారిటీలకు రూ.15లక్షల సహాయం చేసేవారు. ఈ సొమ్మును రెండు వాయిదాల కింద ఇచ్చేవాళ్లు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటన్నిటినీ రద్దు చేసింది. పైగా ఈ ప్రభుత్వం చేసిన నిర్వాకంతో ముస్లిం విద్యార్థులు విదేశాల్లో ముప్పుతిప్పలుపడ్డారు. కొందరు చదువు మధ్యలో ఆపేసి భారత్‌కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఏడా దిలో రెండో విడత జమ చేయాల్సిన నిధులను విద్యార్థులకు ఇవ్వక పోవడం ఆ దుస్థితికి దారితీసింది. ముస్లింల బరియల్‌ గ్రౌండ్స్‌కి ప్రహారీ తదితర మౌలిక సదుపాయాలకూ పైసా విదల్చలేదు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆర్భాటంగా మైనారిటీ కార్పొరేషన్‌, షేక్‌ అండ్‌ షేక్‌ కార్పొరేషన్‌, నూర్‌బాషా కార్పొరేషన్‌, సంచార ముస్లీం జాతుల కార్పొ రేషన్‌లను ఏర్పాటుచేశారు. కానీ ఒక్క కార్పొరేషన్‌కీ నిధులు, విధులు లేవు. కుర్చీలు కూడా లేని దుర్భర స్థితిలో ఆ కార్యాలయాలున్నాయి.

ఫ కబుర్లతో కాలక్షేపం

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు కబుర్లతో కాలక్షేపం చేయడం ప్రజలకు అనుభవపూర్వకంగా బోధపడిన విషయమే. ముస్లింల విషయంలోనూ అదే జరిగింది. గత ప్రభుత్వం సమయంలో జిల్లాలో 205 మసీదులు, 410 మంది ఇమామ్‌, మౌజన్‌లు ఉండగా ఐదేళ్లుగా ఈ ప్రభుత్వంలో ఒక్క అంకె కూడా వాటికి జతకాలేదు. 150 మసీదుల్లోని ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ భృతి కల్పించలేదు. 2019లో రాజమహేంద్రవరంలోని రెహమత్‌నగర్‌లో రూ.90 లక్షలతో షాదీఖానా నిర్మాణానికి ఏర్పాట్లు జరిగాయి. అప్పటి ఎంపీ మురళీ మోహన్‌ తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.25 లక్షలు ఇవ్వగా.. ప్రభుత్వం రూ.65 లక్షలు సమకూర్చింది. టెండరు కూడా ఖరారు అయ్యింది. తర్వాత ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం అధికారం పీఠమెక్కడం తెలిసిందే. దీంతో రూ.65 లక్షల నిధులూ వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు షాదీఖానా నిర్మిస్తామంటూ వైసీపీ నేతలు చెబుతుండడంపై ముస్లింలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

ముస్లింల పథకాలన్నీ రద్దే

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ముస్లింల పథకాలన్నీ రద్దు చేశారు. జగన్‌ మళ్లీ గెలిస్తే మా గురువుల జీతాలనూ తీసేస్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 6 నెలల నుంచీ ఇమామ్‌, మౌజన్‌లకు జీతాల్లేవు. వక్ఫ్‌ బోర్డు దయతలచి గురువులకు జీతాలు చెల్లించింది. ఈ పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలోనే చూశాం. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ఎలా చేస్తుంది. ఈ ప్రభుత్వ హయాంలో మైనారిటీల జీవితాలు దుర్భరంగా మారాయి.

- షేక్‌ సుభాన్‌, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర మాజీ డైరెక్టర్‌

Updated Date - Apr 16 , 2024 | 07:54 AM